9 జిల్లాల్లో 48 మందిపై క్రిమినల్ కేసులు
అందరి బాగోతాలను బయటపెడతాం
సిద్ధిపేట, సిరిసిల్ల జిల్లాల్లో అక్రమాల గుర్తింపు
త్వరలో 31 జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్
ఉన్నతస్థాయి కమిటీ నివేదిక : రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ధరణి పోర్టల్‌లోని లొసుగులను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన వారిని, రిజిస్ట్రేషన్ల చలానా సొమ్మును కాజేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ధరణి పోర్టల్‌లో లొసుగుల వల్లే రిజిస్ట్రేషన్లలో అక్రమాలు జరిగాయని చెప్పారు. ఆ పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని గత ప్రభుత్వంలోని పెద్దలు ప్రభుత్వ భూములను కాజేశారని అన్నారు. దీనిపై సిద్దిపేట?, సిరిసిల్ల జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థతో పైలట్ కింద ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించామనీ, ఇందులో అనేక అవినీతి అక్రమాలు జరిగినట్టు ప్రాథమిక నివేదికలో స్పష్టమైందని వివరించారు. ఈ ఫోరెన్సిక్ నివేదికను పరిశీలించిన తర్వాత మిగిలిన 31 జిల్లాల్లో కూడా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని ప్రకటించారు.
శనివారం సచివాలయంలోని తన కార్యాలయంలో ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడిన సంఘటనలపై ఏర్పాటు చేసిన ఉన్నతస్ధాయి కమిటీతో మంత్రి పొంగులేటి సమావేశాన్ని నిర్వహించారు. విచారణలో ఎదురైన అంశాలు, ఎవరి పాత్ర ఎంత, తెరవెనుక ఎవరైనా ఉన్నారా? రెవెన్యూ అధికారుల పాత్ర ఏమైనా ఉందా? వంటి అంశాలపై కమిటీ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కమిటీ ప్రాథమిక నివేదికను పరిశీలించి మరికొన్ని సలహాలు సూచనలు చేస్తూ మరింత లోతైన విచారణ జరిపి తుది నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ధరణి పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం 52 లక్షల లావాదేవీలకు గాను 35 లక్షల లావాదేవీలను పరిశీలించామని పొంగులేటి అన్నారు. వాటిలో ప్రాథమికంగా 4,848 లావా దేవీల్లో లోటుపాట్లు జరిగినట్టు గుర్తించామని వివరించారు.
విచారణ తర్వాత 1,109 డాక్యుమెంట్లకు సంబంధించి సుమారు రూ.నాలుగు కోట్లు ప్రభుత్వానికి చెల్లింపు జరగలేదని కమిటీ సభ్యులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆనాటి ప్రభుత్వం అనాలోచితంగా ఎలాంటి ముందుచూపు లేకుండా ఒక కుట్రపూరితంగా తెచ్చిన ధరణి పోర్టల్‌లోని లొసుగులను ఆసరాగా చేసుకుని కొంతమంది అక్రమాలకు పాల్పడితే భూభారతి పోర్టల్ ద్వారా ఆడిట్ నిర్వహించి అక్రమాలను గుర్తించి తక్షణమే ఉన్నత స్ధాయి కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టామని గుర్తు చేశారు. తొమ్మిది జిల్లాల్లోని 35 మండలాల్లో అక్రమాలకు పాల్పడిన 48 మందిపై క్రిమినల్ కేసులను నమోదు చేశామన్నారు. వాస్తవ పరిస్దితి ఇలా ఉంటే ప్రతిపక్షంలో ఉన్న ఓ నాయకుడు రూ.వెయ్యి కోట్ల అవినీతి అని, మరో నాయకుడు రూ.పదివేల కోట్లు అని ఇంకొక్కరు భూభారతి పోర్టల్ అవినీతిమయమని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు.
నేడు ఖమ్మంలో శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్స్‌ల అందజేత
మొదటి విడతలో నాలుగు వేల మంది శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్స్‌లు జారీ చేశామని పొంగులేటి చెప్పారు. ఆదివారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో మరో రెండు వేల మందికి లైసెన్స్‌లు జారీ చేస్తామని వివరించారు. ఈ లైసెన్స్‌డ్ సర్వేయర్లతో రాష్ట్రంలో నక్షా లేని 373 గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ విజయ్ కుమార్, ఉన్నతస్థాయి కమిటీ సభ్యులు డీఐజీ ఎమ్ సుభాషిని, సీఎమ్‌ఆర్‌వో మకరంద్, ఏసీబీ ఎస్పీ సింధు శర్మ, సైబర్ క్రైమ్ డీఎస్పీ ఎ సంపత్, ఎన్‌ఐసీ ప్రతినిధి శ్రీనివాస్, హోంశాఖ సలహాదారు పి శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్‌వి మతిలేని మాటలు : మీడియా చిట్ చాట్‌లో పొంగులేటి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపైన కేటీఆర్ మాట్లాడుతున్న భాష సరిగ్గా లేదనీ, మతి లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి పొంగులేటి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికలు వ్యక్తిగతంగా తాను రెఫరెండంగా భావిస్తున్నానని అన్నారు. ఇప్పటికే రెండు సార్లు కేటీఆర్ రెఫరెండం అన్నారని గుర్తు చేశారు. ఇంతకు ముందు జరిగిందే ఈ ఎన్నికల్లో జరుగుతుందని చెప్పారు. ఆనాడు సోయి లేకుండా ఇష్టం వచ్చినట్టు జిల్లాలను ఏర్పాటు చేసి ఇప్పుడు అగ్నిగుండం చేస్తామంటూ మతిలేని మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా శాస్త్రీయ పద్ధతిలో ప్రజామోదంతో జిల్లాలను పునర్‌వ్యవస్థీకరిస్తామన్నారు. బట్టకాల్చి మీద వేయడమే ప్రతిపక్ష పార్టీల పని అన్నట్టుగా ప్రధాన ప్రతిపక్షం వ్యవహరిస్తోందని చెప్పారు. బీఆర్‌ఎస్ పాలనలో అక్రమాలు జరిగినట్టుగానే ఇప్పుడు కూడా అలాగే జరుగుతున్నాయని భ్రమపడుతున్నారని అన్నారు. ఇంకా అధికారంలో ఉన్నట్టుగా వారి వ్యవహార శైలి ఉందన్నారు. అధికారంలోకి వస్తామంటూ పగటి కలలు కంటున్నారని చెప్పారు.



