– గత పాలకుల వైఫల్యం వల్లే కృష్ణా వాటాలో అన్యాయం
– ఏడాదిలో మిగతా ప్రాజెక్టులను పూర్తి చేస్తాం
– ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనా స్థలంలో ప్రమాదకర పరిస్థితి : మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు
– క్షేత్రస్థాయిలో సాగునీటి ప్రాజెక్టుల పరిశీలన
నవతెలంగాణ- మహబూబ్‌గర్ ప్రాంతీయ ప్రతినిధి
”ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యతగా గుర్తించి పూర్తి చేస్తాం.. రెండేండ్ల లో పాలమూరు- రంగారెడ్డిని, ఏడాదిలో కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కృష్ణా నీటి వాటా కోల్పోయాం.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే నీటి పంపకాల విషయంలో పట్టుబట్టి నీటి పెంపుదల కోసం కసరత్తు చేస్తున్నాం..” అని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రధాన భాగమైన నార్లాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు పంప్‌హౌస్, ప్యాకేజీ 2 ఓపెన్ కెనాల్, మహాత్మాగాంధీ కల్వకుర్తి లిప్ట్ ఇరిగేషన్ స్కీమ్, లిప్ట్ -1, వనపర్తి జిల్లా రేవల్లి మండలం ఎదుల రిజర్వాయర్, స్టేజ్ 2, కోడేరు మండలం తీగలపల్లి గ్రామంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పంప్‌హౌస్, సొరంగం, కాల్వ నిర్మాణ పనులను మంత్రులు గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ వేగవంతంగా పూర్తి చేయడానికి, సమస్యల పరిష్కారం, అవాంతరాలను తొలగించడానికి ప్రాజెక్టులను సందర్శించినట్టు చెప్పారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి లిప్ట్ ఇరిగేషన్ స్కీమ్, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. తమ ప్రభుత్వం ఈ నాలుగు ప్రాజెక్టులను 2026 మార్చి 31 వరకు 100శాతం పనులు పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటోందన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివేన రిజర్వాయర్లలో 50 టీఎంసీల నీటిని నింపడానికి ఆరు నెలలు, ఉద్దండాపూర్ రిజర్వాయర్ నింపడానికి 2026 మార్చి వరకు నిర్దిష్ట గడువును నిర్దేశిం చుకుని ప్రణాళికబద్ధంగా పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరందించేందుకు చర్యలు తీసుకుంటామని వివరిం చారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం మొదటి లిఫ్టులో నిరుప యోగంగా ఉన్న రెండు మోటార్లకు మరమ్మతులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. ఉద్దండ పూర్ రిజర్వాయర్‌తో పాటు ఓపెన్ కెనాల్ పనులు పూర్తి చేసి సాగునీరు అందిస్తామన్నారు. ఈ విషయమై వనపర్తి నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్‌తో మంత్రులు చర్చించారు. బచావత్ ట్రిబ్యునల్‌లో ఉమ్మడి రాష్ట్రానికి 811 టీఎంసీలు కేటాయిస్తే.. అందులో బీఆర్‌ఎస్ హయాంలో తెలంగాణ కు 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు కేటాయిం చారని తెలిపారు. ఈ ఒప్పందం చెల్లదని కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన తర్వాత లిఖితపూ ర్వకంగా వాటర్ బోర్డుకు వివరించినట్టు చెప్పారు. పదేం డ్లలో కృష్ణానది నుంచి ఏపీకి నీటిని తరలిస్తుంటే.. కేసీఆర్ మౌలిక వసతులు ఏర్పాటు చేసి సహకరించారని ఆరోపిం చారు. బీఆర్‌ఎస్ అసమర్థత వల్ల ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని వివరించారు. కాళేశ్వరంలో లక్షల కోట్ల రూపాయలు పెట్టకుండా.. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి ఉంటే పాలమూరు, నల్లగొండ జిల్లాల భారీ ప్రాజెక్టులు ఇదివరకే పూర్తి అయ్యేవని అన్నారు. పాలమూరు -రంగారెడ్డిలో 25వేల కోట్లు ఖర్చు చేసి ఎకరా భూమికైనా నీరు ఇవ్వలేదన్నారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లోపల ప్రమాదకర పరిస్థితి
ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంలో ఇప్పటి వరకు ఇద్దరు మృతదేహాలను బయటకు తీశామని, మరో ఆరు మృతదేహాలు తీయలేకపోయామని, లోపల ప్రమాదకర పరిస్థితులు ఉన్నందున ఆ ఆరుగురి ఆచూకీ తెలియడం లేదని మంత్రులు తెలిపారు. ఇప్పటికీ కార్మికులను బయటికి తీసే విషయంలో ఉన్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్ర్‌గ్రేషియా చెల్లించామని తెలిపారు. మంత్రుల వెంట ఎంపీ మల్లు రవి, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మెన్ చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్యెల్యేలు రాజేష్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్ బాదవత్ సంతోష్, మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, ఇంజినీరింగ్ శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.