Thursday, March 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసాగునీరు విడుదల చేయాలి

సాగునీరు విడుదల చేయాలి

- Advertisement -

రోడ్డుపై బైటాయించి రైతుల రాస్తారోకో
పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన
నవతెలంగాణ -రాయపోల్‌

యాసంగి కాలంలో సాగుచేసిన పంటలకు సరైన నీరు లేక ఎండిపోతున్నాయి.. కాబట్టి వెంటనే కొండపోచమ్మ సాగర్‌ నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు రాస్తారోకో నిర్వహించారు. సిద్దిపేట జిల్లా రాయపోల్‌ మండలం వీరనగర్‌ వద్ద సాగునీరు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ లింగారెడ్డిపల్లి, అంకిరెడ్డిపల్లి, రాంసాగర్‌ గ్రామాలకు చెందిన రైతులు బుధవారం రోడ్డుపై బైటాయించి రాస్తారోకో నిర్వహించారు. సుమారు రెండు గంటలపాటు సాగిన ఈ ఆందోళనతో భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి రామాయంపేట కాల్వ ద్వారా వస్తున్న గోదావరి నీటిని తమ గ్రామాల చెరువులకు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. చెరువులు నింపుకునేందుకు కాల్వ ఉన్నప్పటికీ నీటిని విడుదల చేయకపోవడంతో చెరువు కింద వేసిన పంటలు ఎండిపోయే దశకు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.

వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి వరినాట్లు వేసినప్పటికీ చెరువుల్లో నీరు లేకపోవడంతో ఆయకట్టు కింద ఉన్న వరి పంటలు ఎండిపోతున్నాయన్నారు. తలాపున కాల్వ ఉన్నప్పటికీ తమ చెరువులకు నీళ్లు ఎందుకు విడుదల చేయడం లేదని అధికారులను ప్రశ్నించారు. వెంటనే రామాయంపేట కాల్వ ద్వారా మూడు గ్రామాల చెరువులకు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని కోరారు. లేకపోతే మరింత తీవ్రంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న రాయపోల్‌ ఎస్‌ఐ మానస సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను సముదాయించారు. సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో లింగారెడ్డిపల్లి సర్పంచ్‌ స్వామి, ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌, మాజీ ఎంపీటీసీ స్వామి, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -