Thursday, February 26, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుగ్లాసెడు పాలూ గరళమే?

గ్లాసెడు పాలూ గరళమే?

- Advertisement -

రాజమండ్రి విషాదం తర్వాత రాష్ట్రంలో ‘కల్తీ’ కలవరం
మృత్యువుకు ‘పాలు’ పడుతున్న అక్రమార్కులు
ఏయేటికాయేడు పడిపోతున్న పాడి సంపద
డిమాండ్‌కు తగ్గట్టు లేని ఉత్పత్తి
మార్కెట్లో ఏరులై పారుతున్న కల్తీ పాలు
రసాయనాల మిశ్రమంతో ప్రజారోగ్యం చిన్నాభిన్నం
పర్యవేక్షణ కరువైన తనిఖీ వ్యవస్థ
కేరళ తరహా కఠిన నిర్ణయాలు ఇక్కడా అవసరం

రాజమండ్రిలో కల్తీ పాలు తాగి ఐదుగురి ప్రాణాలు గాల్లో కలవడం, మరో ఎనిమిది మంది మృత్యువుతో పోరాడుతుండటం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను ఉలిక్కిపడేలా చేసింది. కేరళ వంటి రాష్ట్రాలు ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నాణ్యత లేని డెయిరీలపై ఉక్కుపాదం మోపుతుంటే, మన దగ్గర మాత్రం పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. రాష్ట్రంలో పాడి సంపద తగ్గినా.. పాల ప్యాకెట్ల అమ్మకాలు మాత్రం పెరుగుతున్నాయి.

బ్రాండెడ్‌ కంపెనీల పాల ప్యాకెట్లతోపాటు అనేక వందల కంపెనీల పాల ప్యాకెట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేకపోవడం అక్రమార్కులకు వరంగా మారింది. అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ‘వైట్‌ పాయిజన్‌’ మాఫియా నెమ్మదిగా ‘చాప కింద నీరులా’ అంతటా విస్తరిస్తోంది. పర్యవసానంగా వ్యాపారుల కాసుల కక్కుర్తి పాపాలు, సామాన్యుడి గ్లాసులో విషాన్ని నింపుతున్న వైనంపై ‘ప్రత్యేక’ కథనం..

నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రమాణాల ప్రకారం ప్రతి మనిషికి రోజుకు కనీసం 180 మిల్లీలీటర్ల పాలు అవసరం. రాష్ట్రంలో రోజుకి సుమారు 20లక్షల లీటర్ల పాలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న పాలు రాష్ట్ర అవసరాలను తీర్చే స్ధాయిలో లేవు. పాడి పశువుల సంఖ్య తగ్గడం వల్ల పాల ఉత్పత్తిలో గణనీయమైన కోరత వచ్చిందని అధికారులు అంటున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని 33 లక్షల జనాభా లెక్కన చూస్తే, రోజువారీ అవసరాలకు దాదాపు 5.5 లక్షల నుంచి 6.5 లక్షల లీటర్ల పాలు కావాలి. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. ఉమ్మడి జిల్లాలోని గణాంకాలను పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి.

జిల్లాలో ఉన్న సుమారు 5.12 లక్షల పాడి పశువుల (గేదెలు, ఆవులు) ద్వారా ఉత్పత్తి అవుతు న్నది కేవలం 1.80 లక్షల నుంచి 2.20 లక్షల లీటర్లు మాత్రమే. శుభకార్యాలు, టీ కొట్లు, ఇతర వ్యాపార అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ డిమాండ్‌ 6.5లక్షల లీటర్లవరకు ఉంటుంది. అంటే డిమాండ్‌కు,సరఫరాకు మధ్య సుమారు 4 లక్షల లీటర్ల భారీ అగాధం ఉంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్యాకెట్‌ పాలు కొంతమేర భర్తీ చేస్తున్నా, మిగిలిన లక్షల లీటర్ల పాలు ఎక్కడి నుంచి వస్తున్నా యన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఈ భారీ లోటును పూడ్చడానికి బయటి ప్రాం తాల నుంచి వచ్చే ప్యాకెట్‌ పాలు, ప్రయివేట్‌ డెయిరీలే దిక్కవుతున్నా ఈ ఖాళీని పూరించడానికే అక్రమార్కులు ‘కల్తీ’ అస్త్రాన్ని వాడుతున్నారనేది స్పష్టమవుతోంది.

కనుమరుగవుతున్న పశుసంపద
పశుగణనలో పశువుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2019లో అవుల సంఖ్య 42,32,383 ఉండగా ఇప్పుడు 30,69,524కు తగ్గింది. గేదెల సంఖ్య 42,26,603 నుంచి 30,52,102కి తగ్గాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా లో పశువుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. పదేండ్ల క్రితం 8 లక్షలకు పైగా ఉన్న ఆవులు, గేదెల సంఖ్య ఇప్పుడు 5.12 లక్షలకు పడిపోయింది. హార్వెస్టర్ల వాడకం పెరగడంతో గడ్డిని పొలాల్లోనే కాల్చివేస్తున్నారు. ఫలితంగా పశుగ్రాసం కొరత ఏర్పడింది. మరోవైపు దాణా ధరలు ఆకాశాన్ని తాకడం, ప్రభుత్వం నుంచి అందుతున్న రాయితీలు, రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన (ఆర్‌కే వీవై) వంటి పథకాలు నిలిచిపోవడంతో రైతులు పాడిని భారంగా భావించి విక్రయిస్తున్నారు.

అటకెక్కిన తనిఖీలు.. అధికారుల ఉదాసీనత
రాజమండ్రి ఘటన తర్వాత అయినా అధికారులు మేల్కొనాల్సిన అవసరం ఉంది. ఆహార నియంత్రణ విభాగం నామమాత్రంగానే పనిచేస్తోందనే విమర్శలు ఉన్నాయి. కరీంనగర్‌ ఫుడ్‌ సేఫ్టీ అధికారి ఇన్‌చార్జిగా ఉండటం వల్ల పర్యవేక్షణ కరువైంది. బల్దియా పరిధిలోనూ ప్రజారోగ్య విభాగం హోటళ్లు, డెయిరీలపై దాడులు చేయడం మర్చిపోయింది. ఫలితంగా వారం రోజుల పాటు నిల్వ ఉండే ప్యాకెట్‌ పాలు, నాణ్యత లేని గడ్డ పెరుగు విచ్చలవిడిగా మార్కెట్లోకి వస్తున్నాయి.

కల్తీ ‘కెమిస్ట్రీ’ ఇదే!
కేవలం 10 లీటర్ల పాలను 20 లీటర్లుగా మార్చే అద్భుత విద్యను కల్తీ మాఫియా కనిపెట్టింది. ఇందులో వాడే పదార్థాలు వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. చిక్కదనం కోసం యూరియా, వరి పిండి, గంజి పౌడర్‌, చివరకు డిటర్జెంట్లను కూడా వాడుతున్నారు. పాల నిల్వ కోసం, పాలు విరిగిపోకుండా ఉండేందుకు ఫార్మలిన్‌, సోడియం హైడ్రాక్సైడ్‌ వంటి ప్రమాదకర రసాయనాలను కలుపుతున్నారు. పాల దిగుబడి కోసం పశువులకు నిషేధిత ‘ఆక్సిటోసిన్‌’ ఇంజక్షన్లు ఇచ్చి పాలను పిండుతున్నారు.

దీనివల్ల పాలు తాగే చిన్నారుల్లో హార్మోన్ల అసమతౌల్యం ఏర్పడి అకాల యవ్వనం, ఇతర సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్నిచోట్ల అసలు పాలు లేకుండానే పాల పొడి, జంతువుల కొవ్వు, నూనెలు కలిపి తెల్లటి ద్రవాన్ని తయారుచేసి మార్కెట్లోకి వదులుతున్నారనే వార్తలూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి పాలు తాగుతున్న వారిలో సింహభాగం జనం కిడ్నీ వైఫల్యం, కాలేయ వ్యాధులు, క్యాన్సర్‌ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కేేరళ తరహా కఠిన నిర్ణయాలు అవసరం
ఇటీవల కేరళ ప్రభుత్వం తమ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యత లేని కొన్ని డెయిరీ కంపెనీలను ఏకంగా నిషేధించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా అటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ప్రముఖులు సూచిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కల్తీ చేసేవారికి జీవిత ఖైదు వంటి కఠిన శిక్షలు పడేలా చూడాలి. జిల్లాల్లో తగ్గుతున్న పశుసంపదను పెంచేందుకు రాయితీలు పునరుద్ధరించాలి. గతంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను తిరిగి పట్టాలెక్కించాలి. ప్రతి డెయిరీ, ప్యాకేజింగ్‌ యూనిట్‌ వద్ద నిరంతరం తనిఖీలు నిర్వహించాలి.

కల్తీ పాలు..నిశ్శబ్ద హంతకి
పాలలో కలుపుతున్న పలురకాల రసాయనాలు నేరుగా జీర్ణకోశాన్ని దెబ్బతీసి, కాలేయ, మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తాయి. పాలు విరిగిపోకుండా వాడే ఫార్మలిన్‌, సోడియం హైడ్రాక్సైడ్‌ వంటి రసాయనాలు దీర్ఘకాలంలో క్యాన్సర్‌కు ప్రధాన కారణమవుతున్నాయి. పశువులకు ఇచ్చే ఆక్సిటోసిన్‌ ఇంజక్షన్ల వల్ల ఆ పాలు తాగే చిన్నపిల్లల్లో హార్మోన్ల మార్పులు జరిగి, అకాల యవ్వనం వంటి తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయి. -డాక్టర్‌ సిలివేరి తిరుపతి, జనరల్‌ ఫిజిషియన్‌, కరీంనగర్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -