ప్రభుత్వ సేవలకు అంతరాయం…వేలాది ఉద్యోగాలకు ఎసరు
వ్యయ బిల్లుపై రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల మధ్య కుదరని ఏకాభిప్రాయం
వాషింగ్టన్ : అమెరికా ప్రభుత్వం ఏడు సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఆర్థిక సంక్షోభంలో పడబోతోంది. ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలన్నీ స్తంభించే పరిస్థితి కన్పిస్తోంది. దీనిని నివారించాలంటే వ్యయ బిల్లుపై ప్రతిపక్ష డెమొక్రాట్లతో రిపబ్లికన్ పార్టీ చేతులు కలపాల్సి ఉంటుంది. లేకుంటే అన్నీ కాకపోయినా కొన్ని ప్రభుత్వ సేవలైనా తాత్కాలికంగా నిలిచిపోతాయి. బడ్జెట్‌పై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విభేదాలు అమెరికాలో సహజమే అయినప్పటికీ వ్యయ బిల్లు విషయంలో తలెత్తిన విభేదాలు ఉద్రిక్తతకు దారితీశాయి.
షట్‌డౌన్ అంటే…
అక్టోబరులో, ఆ తర్వాత ప్రభుత్వ సేవలకు నిధుల కేటాయింపునకు సంబంధించిన బిల్లుపై అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకే తాటిపైకి రానిపక్షంలో ఆర్థిక పరిస్థితి సంక్లిష్టమవుతుంది. బిల్లుపై అమెరికా ప్రతినిధి సభ ఏకాభిప్రాయానికి రాకపోతే అది చర్యలు తీసుకునే వరకూ ప్రభుత్వ సంస్థలు అన్ని రకాల అనవసరపు నిధుల విడుదలను నిలిపివేయాల్సి ఉంటుంది. దీనినే ‘ప్రభుత్వ షట్‌డౌన్’ అంటారు. ఈ సమస్య ఎదురైతే కొన్ని ప్రభుత్వ సేవలు నిలిచిపోతాయి. ఉద్యోగ నియామకాలు ఆగిపోతాయి. కొందరు ఉద్యోగులను తొలగించే అవకాశం కూడా ఉంది. గతంలో షట్‌డౌన్ పరిస్థితులు ఎదురైనప్పటికీ వాటితో పోలిస్తే ఇది కఠినమైనదని శ్వేతసౌధం చెబుతోంది. ప్రభుత్వ పరిమాణం తగ్గుతుందని, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో బయటికి వచ్చే అవకాశం ఉన్నదని అంటున్నారు.
బీమా సబ్సిడీలపై పట్టు
నిధుల విషయంలో రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య విభేదాలు రావడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఆరోగ్య బీమా కోసం ఇస్తున్న తాత్కాలిక పన్ను మినహాయింపును శాశ్వతం చేయాలని డెమొక్రాట్లు పట్టుపడుతున్నారు. సబ్సిడీలను కొనసాగిస్తే లక్షలాది మంది అమెరికన్లకు ఆరోగ్య బీమాపై చేస్తున్న ఖర్చు భారం తగ్గుతుందని వారు అంటు న్నారు. అయితే డెమొక్రాట్ల సూచనను రిపబ్లికన్లు అంగీకరించడం లేదు. కాంగ్రెస్‌లోని రెండు ఛాంబర్లను రిపబ్లికన్లే నియంత్రిస్తున్నారు. కానీ సెనెట్ (ఎగువ ఛాంబర్)లో వ్యయ బిల్లు ఆమోదం పొందాలంటే దానికి ఇంకా 60 ఓట్లు అవసరం అవుతాయి.
2018లో కూడా…
ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు కూడా…అంటే 2018లో సుమారు 35 రోజుల పాటు షట్‌డౌన్ జరిగింది. అది అమెరికా చరిత్రలోనే సుదీర్ఘ షట్‌డౌన్‌గా నిలిచింది. అప్పుడు 3,80,000 మంది ఉద్యోగులను తొలగించారు. 4.2 లక్షల మంది జీతం లేకుండా పనిచేయాల్సి వచ్చింది. అప్పుడు అమెరికాకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లింది. ప్రభుత్వ సేవలకు అంతరాయం ఏర్పడింది.
లక్ష ఉద్యోగాలకు ఎసరు
అమెరికా కాంగ్రెస్‌లో బిల్లు ఆమోదం పొందకపోతే లక్ష మంది ప్రభుత్వోద్యోగులు ఉపాధి కోల్పోయి వీధిన పడే ప్రమాదం ఉంది. అమెరికాలో ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీతో…అంటే మంగళ వారంతో ముగుస్తుంది. ఈ లోగా ప్రతినిధి సభలోని రెండు ప్రధాన పార్టీలు వచ్చే సంవత్సరానికి సంబంధిం చిన వ్యయ బిల్లుకు ఆమోదం తెలిపే విషయంలో ఓ ఒప్పందానికి రావాల్సి ఉంటుంది. కానీ ఆ పని జరగలేదు. ఈ నేపథ్యంలో ఏకాభిప్రాయసాధన కోసం ప్రతినిధి సభ ఒక రోజును అదనంగా కేటాయించింది. రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదరకపోతే అక్టోబర్ 7న లక్ష మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. ఇది అమెరికా చరిత్రలోనే అతి పెద్ద కుదుపు. అంతేకాదు…సంవత్సరం చివరి నాటికి మొత్తంగా మూడు లక్షల మంది ఉపాధి కోల్పోతారని అంచనా.