Wednesday, February 4, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిమరో అణ్వాయుధ పోటీ ప్రారంభం కానుందా?

మరో అణ్వాయుధ పోటీ ప్రారంభం కానుందా?

- Advertisement -

అమెరికా – రష్యా మధ్య కుదిరిన వ్యూహాత్మక ఆయుధ తగ్గింపు ఒప్పందం (స్టార్ట్‌) గడువు బుధవారం రాత్రితో (ఫిబ్రవరి నాలుగు) ముగియనుంది. పునరుద్ధరణకు అవకాశాలు లేనందున ప్రపంచంలో నూతన ఆయుధ పోటీకి తెరలేచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఏ రూపంలో ముందుకు వస్తుందో, ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుందో అన్న చర్చ ప్రారంభమైంది. ఆయుధ రంగంలో ముందున్న అమెరికా తాపీగా ఉంది. ఇటీవల ఒక మీడియా సంస్థతో మాట్లాడినపుడు అడిగిన ప్రశ్నకు ట్రంప్‌ జవాబిస్తూ ఒకవేళ ఒప్పందం గడువు తీరితే, అది ముగిసిపోతుంది అంతే అని స్పందించాడు. అమెరికా, రష్యా రెండు దేశాలూ పాతబడిన ఆయుధాలను తొలగించుకొనేందుకు గతంలో కుదిరిన ఒప్పందాన్ని వినియోగించుకున్నాయి తప్ప కొత్తవాటిని తయారు చేయటం మానుకోలేదనే విమర్శ ఉంది. ఆ రెండు దేశాల దగ్గర ప్రపంచంలో ఉన్న అణ్వాయుధాలలో 87శాతం ఉన్నాయి. గతంలో 2002లో కుదిరిన ఒప్పందాల ప్రకారం ఆయుధాలను 1,700 మరియు 2,200కు పరిమితం చేసుకోవాల్సి ఉంది. దాని స్థానంలో 2010లో పదేండ్లపాటు అమల్లో ఉండే నూతన ఒప్పందం ప్రకారం మరింతగా తగ్గించేందుకు అంగీకరించాయి.దీని గడువు పొడిగింపు వ్యవధి కూడా ముగిసిపోనుంది. ఉన్నవాటిని నవీకరించుకొనేందుకు, వాటికి అవసరమైన కేంద్రాల నిర్వహణ వంటి వాటికి అమెరికాకు రెండు లక్షల కోట్ల డాలర్లమేర ఖర్చు అవుతుందని అంచనా వేశారు. రష్యా పరిస్థితి కూడా అటూఇటూగా అంతే. పోనీ ఇంత ఖర్చు చేసినా అమెరికా కలలుగన్న ప్రపంచాధిపత్యం సాధ్యం కాలేదు, పూర్వపు సోవియట్‌, తరువాత రష్యాకు యావత్‌ దేశాలను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలన్న లక్ష్యం లేకపోయినా అమెరికాను అడ్డుకొనేందుకు భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఒప్పందం లాంఛనంగా ఫిబ్రవరి ఐదుతో ముగియనున్నప్పటికీ ఆ ప్రక్రియ 2023లోనే ప్రారంభమైంది. సమాచార మార్పిడి, తనిఖీల వంటి వాటిని రష్యా పక్కన పెట్టింది.



భవిష్యత్‌లో ఆయుధ నియంత్రణ ఒప్పందాలంటూ జరిగితే వాటిలో చైనా కూడా చేరాల్సిందేనని అమెరికా పట్టుబడుతున్నది, ససేమిరా కుదరదని బీజింగ్‌ పలుసార్లు స్పష్టం చేసింది. ఒప్పందాల్లేకపోతే జరిగేదేమిటి? ఆయుధ పోటీ మరింత పెరుగుతుందని వేరే చెప్పనవసరం లేదు. కొద్ది నెలల్లోనే రష్యా 60, అమెరికా వందశాతంపైగా అణ్వాయుధాలను పెంచుకుంటాయని, రిజర్వులో ఉంచిన వాటిని సిద్ధం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
రెండవ ప్రపంచ యుద్ధం నాటికి ఒక్క అమెరికా దగ్గరే అణ్వాయుధాలు ఉన్నాయి.అవసరం లేకపోయినా జపాన్‌ మీద ప్రయోగించి ప్రపంచాన్ని భయపెట్టింది.దాంతో మిగిలిన దేశాలు కూడా వాటిని సమకూర్చుకున్న కారణం గానే దాని దూకుడు తగ్గింది. అయినప్పటికీ దాని దగ్గర ఉన్న ఆధునిక ఆయుధాలుండటంతో అనేక దేశాలను ఇతరంగా బెదిరిస్తూనే ఉంది, దాడులు, దురాక్రమణలకు పాల్పడుతూనే ఉంది. ఎర్రగీత దాటితే అణ్వాయు ధాలను మోహరిస్తానని ఉక్రెయిన్‌ పోరులో రష్యా హెచ్చరించిన కారణంగానే నాటో దేశాలు అదుపులో ఉన్నాయి. ఆర్థిక రంగంలో తనకు సవాలు విసురుతున్న చైనా మీద అనేక కట్టుకథలను ప్రచారంలో పెట్టి ఇతర దేశాలను తన వెనుక సమీకరించుకొనేందుకు అమెరికా పూనుకుంది.వచ్చే నాలుగు సంవత్సరాల్లో బీజింగ్‌ తన అణ్వాయుధాలను వెయ్యికి పెంచుకోనుందని, వాటిని మోహరించటానికి ఏర్పాట్లు చేస్తున్నదనే ప్రచారం దానిలో భాగమే. ప్రతిదేశం మాదిరే చైనా కూడా తన పాటవాన్ని పెంచుకుంటున్నది. చైనా, పాకిస్తాన్‌లను బూచిగా చూపి మనదేశాన్ని కూడా ఆయుధ పోటీలోకి పశ్చిమదేశాలు దించుతున్నాయి. అవసరం లేకుండా శక్తికి మించి ఆయుధాలకు ఖర్చుచేస్తే పాక్‌ మాదిరి దివాలా తీయటం ఖాయం. ఆయుధాలను అమ్ముకొనే వారు రకరకాల కుట్ర సిద్ధాంతాలను ముందుకు తెస్తే వేర్వేరు ముసుగుల్లో ఉన్న వారి ఏజెంట్లు వాటికి మసాలా దట్టిస్తారు. ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో మనదేశం రక్షణ బడ్జెట్‌ను పెద్ద మొత్తంలో పెంచిన తీరు చూశాము.

ఆయుధ నియంత్రణ ఒప్పందం లేకపోవటంతో భారత్‌కు ఇబ్బంది వచ్చిందనే కొత్త పల్లవి కొందరు అందుకున్నారు. నిజానికి ఆ ఒప్పందంలో చైనా లేదు, అయినప్పటికీ ఇప్పుడు సరికొత్తగా ఆయుధాలు పెంచుకొనేందుకు పూనుకున్నందున మనం కూడా ఆలోచించాలని చెబుతున్నారు. చైనా సహకారంతో పాకిస్తాన్‌ కూడా అమ్ములపొదిని విస్తరించు కోవచ్చంటున్నారు. మన జాగ్రత్తలో మనం ఉండాలనటంలో ఎలాంటి సందేహం లేదు, కానీ చైనాతో పోటీపడాలని చెప్పటం సరైందేనా! మన దేశం నుంచి ముప్పు ఉందనే కారణంతో చైనా తన ఆయుధాలను పెంచుకోవటం లేదు, దాని కేంద్రీకరణ అంతా అమెరికా, దాని మిత్రదేశాలైన జపాన్‌, దక్షిణ కొరియా, తదితర దేశాల మీదనే. అమెరికాతో అవసరానికి మించి ఆయుధ పోటీకి దిగటం కూడా సోవియట్‌ దెబ్బతినటానికి ఒక కారణంగా కొందరు చెప్పటాన్ని, చైనా, మన ఆర్థికశక్తిని విస్మరించకూడదు.

వర్తమాన కాలంలో మిలిటరీ శక్తిలో అణ్వాయుధాలు ప్రముఖ పాత్రపోషిస్తున్నప్పటికీ రానున్న రోజుల్లో కృత్రిమ మేథ(ఎఐ) ఆయుధ పోటీని గణనీయంగా ప్రభావితం చేయనుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో ముఖ్యమైన సెమీకండక్టర్ల రంగంలో అమెరికా-చైనా పోటీపడుతున్నాయి. ఏ రంగంలోనైనా అవి లేకుండా గడిచే స్థితి లేదు.శత్రువుల కదలికలను పసిగట్టటం, స్థావరాలను స్పష్టంగా ఫొటోలు తీయటంలోనూ అవి కీలకంగా మారాయి. చైనా తన సత్తాను చాటేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న పూర్వరంగంలో సెమీకండక్టర్ల రంగంలో ప్రస్తుతం తూర్పు ఆసియాలోని తైవాన్‌ ప్రాంతం, జపాన్‌, దక్షిణ కొరియాలు ప్రధానంగా ముందుండగా అమెరికా, ఐరోపా దేశాలు కూడా గణనీయ భాగాన్ని కలిగి ఉన్నాయి. ఆధునిక పరిజ్ఞానాన్ని, సెమికండక్టర్లను చైనాకు అందకుండా అమెరికా అన్ని ప్రయత్నాలూ చేస్తున్నది. విడిగా ఉంటున్న తైవాన్‌ విలీనం 2049 నాటికి పూర్తి చేస్తామని చైనా ప్రకటించగా అడ్డుకొని తీరతామని, రక్షణగా సిలికాన్‌ షీల్డ్‌ ఏర్పాటు చేస్తామని అమెరికా చెబుతున్నది. ఒక వేళ బలవంతంగా విలీనం చేసుకుంటే అంతిమంగా అక్కడ ఉన్న సెమికండక్టర్‌ పరిశ్రమలన్నింటినీ పేల్చివేస్తామని వాషింగ్టన్‌ బెదిరించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ చైనా ఎప్పటికప్పుడు తైవాన్‌ తమదే అని వెనక్కు తగ్గేదిలేదని ప్రకటిస్తున్నది, తాను విధించిన గడువు చాలా సంవత్సరాలు ఉన్నందున ఎలాంటి మిలిటరీ చర్యకు పాల్పడటం లేదు. ప్రస్తుతం అమెరికా వద్ద ఆధునిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ ప్రపంచ చిప్స్‌ తయారీలో కేవలం పన్నెండు శాతమే అక్కడ ఉత్పత్తి అవుతున్నాయి. దాని అవసరాల కోసం ఎక్కువగా తైవాన్‌ మీద ఆధారపడుతున్నది. చైనాలో విలీనాన్ని అడ్డుకోవటానికి ఇది కూడా ఒక ప్రధాన కారణమే. మొత్తం మీద ప్రపంచ ఉత్పత్తిలో తైవాన్‌ సగం, ఆధునిక చిప్స్‌లో తొంభై శాతం కలిగి కీలకమైన స్థానంలో ఉంది. పరిశ్రమలను అక్కడి నుంచి తరలించేందుకు ఏమాత్రం అవకాశం ఉన్నప్పటికీ ఈ పాటికి అమెరికా ఆ పనిచేసి ఉండేది, అది సాధ్యం కాదని, వాటిలో పనిచేసే నిపుణులు కూడా తైవాన్‌లో గణనీయంగా ఉండటమే అని చెబుతున్నారు.మొత్తం 66శాతం ఉత్పాదక సంస్థలు తూర్పు ఆసియాలో 292 చోట్ల ఉన్నాయి.

మిలిటరీ రంగంలో ఏఐ లేదా క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ చిప్స్‌ వినియోగం గురించి ఇంకా అనేక పరిశోధనలు జరగాల్సి ఉంది. ప్రస్తుతం ప్రయోగశాలలు సాధారణ ఉష్ణోగ్రతల వద్ద వాటిని పరీక్షించారు, అయితే అధిక వేడి, శీతల ప్రాంతాల్లో వాటి పనితీరును చూడాల్సి ఉంది. అవసరమైన సంఖ్యలో తయారు చేసే సంస్థల అవసరం కూడా ఒక సమస్యే. జోబైడెన్‌ హయాంలో చైనాకు అవసరమైన ఆధునిక చిప్స్‌ను ఎగుమతి చేయరాదంటూ నివిడియా కంపెనీ మీద ఆంక్షలు విధించారు. అయితే దాన్ని సవాలుగా తీసుకొని భారీ మొత్తాలను కేటాయించిన డ్రాగన్‌ తనకు అవసరమైన వాటిని ఉత్పత్తి చేయటమే కాకుండా ఆధునిక రకాల కోసం పరిశోధనలు చేస్తున్నది. ఈ పూర్వరంగంలోనే ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత నిషేధాన్ని సడలించి ఎగుమతులకు అనుమతులు ఇచ్చినప్ప టికీ నివిడియా ఉత్పత్తి హెచ్‌-200రకం చిప్స్‌ తమకు అవసరం లేదని చైనా ప్రకటించినట్లు వార్తలు. క్వాంటమ్‌ సాంకేతిక పరిజ్ఞాన విషయంలో కూడా అమెరికా ఆంక్షలు విధించటం తెలిసిందే.ఒకవైపు పన్నుల యుద్ధం మరోవైపు సాంకేతిక రంగంలో అమెరికా దాడిని తట్టుకొనేం దుకు చైనా తన ప్రయత్నాలను ముమ్మరం చేయటమే గాక అనేక విజయాలను సాధించి స్వయం సమృద్ధి కోసం ప్రయత్ని స్తున్నది.చాట్‌జిపిటికి పోటీగా చాలా తక్కువ ఖర్చుతో డీప్‌సీక్‌ను తయారు చేసిన సంగతి తెలిసిందే. తన అవసరాలకు ప్రపంచ సరఫరా గొలుసు మీద ఆధారపడ టాన్ని క్రమంగా తగ్గించుకుంటున్నది. ఎప్పుడైనా తైవాన్‌ విలీనం చేసుకుంటానంటూ చేస్తున్న ప్రకటనలతో సెమీకండక్టర్లకు దానిమీద ఎక్కువగా ఆధారపడిన అమెరికాకు దడపుట్టిస్తున్నది. బహుశా అందుకే తమ దేశంలో ఉత్పత్తి చేసే విధంగా 250 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు తైవాన్‌ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది.

ముందే చెప్పుకున్నట్లుగా అమెరికా, ఇతర పశ్చిమ దేశాల కుట్రలను వమ్ము చేసేందుకు కృత్రిమ మేథలో ఇతరుల మీద ఆధారపడకుండా చైనా పూనుకుంది.2025 ఏప్రిల్‌లో కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో ప్రత్యేకంగా సమావేశం జరిపి కర్తవ్య నిర్దేశం చేసింది. ప్రభుత్వం దేశీయంగా ఉన్న పెద్ద కంపెనీలను ప్రోత్సహిస్తున్నది. సెమికండక్టర్లను స్వయంగా తయారు చేస్తున్నప్పటికీ అమెరికాలోని నివిడియా కంపెనీ మాదిరి ఆధునిక డిజైన్లలో అది ఇంకా వెనుకబడే ఉంది. సాంకేతిక అంతరాన్ని క్రమంగా తగ్గిస్తున్నది. ప్రపంచ నిపుణులను ఆకర్షించేందుకు అమెరికా మాదిరి సౌకర్యాలు కల్పిస్తూ 2025 అక్టోబరు నుంచి కె వీసాలను జారీ చేస్తున్నది.అమెరికాలో ఉన్న తన జాతీయులైన వారిని స్వదేశానికి రప్పిస్తున్నది. గతంలో అమెరికా విసిరిన సవాళ్లన్నింటినీ అధిగమించి ముందుకు పోయిన చైనా కృత్రిమ మేథలో కూడా విజయం సాధిస్తునటంలో ఎలాంటి సందేహం లేదు!

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -