Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంబెంగాలీ విదేశీ భాషనా?

బెంగాలీ విదేశీ భాషనా?

- Advertisement -

ఢిల్లీ పోలీసుల లేఖపై పలు పార్టీల ఆగ్రహం
హోం శాఖ క్షమాపణలు
చెప్పాలని సీపీఐ(ఎం) డిమాండ్‌
జాతీయ గీతాన్ని రచించిన భాషను అవమానించడమే : స్టాలిన్‌
నిరసనలకు మమతాబెనర్జీ పిలుపు
న్యూఢిల్లీ, చెన్నై, కొల్‌కతా :
బెంగాలీ భాషను ‘బంగ్లాదేశీ భాష’గా తప్పుగా పేర్కొంటూ ఢిల్లీ పోలీసులు లేఖను జారీ చేయడాన్ని పలు పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఆ లేఖ ఢిల్లీ పోలీసుల ఆందోళనకరమైన వైఖరిని ప్రతిబింబిస్తోందని సిపిఎం పొలిట్‌బ్యూరో సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. అక్రమ బంగ్లాదేశీ ఇమ్మిగ్రెంట్లుగా అనుమానిస్తూ బెంగాలీ మాట్లాడే వ్యక్తులు అనేకమందిని వారు అరెస్టు చేస్తున్నారని, ప్రత్యేకమైన శైలితో బెంగాలీ భాష ఒక్కటే వుందనే వాస్తవాన్ని పూర్తిగా విస్మరించారని దీన్ని బట్టి తెలుస్తోందని పొలిట్‌బ్యూరో తెలిపింది. ‘భారతదేశంలోని జాతీయ భాషల్లో బెంగాలీ ఒకటి. దీన్ని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో గుర్తించారు. అటువంటి ఈ భాషను విదేశీ భాషగా ముద్ర వేస్తూ కేంద్ర హోం శాఖ పరిధిలో పనిచేసే ఢిల్లీ పోలీసులే రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. బెంగాలీ భాష మాట్లాడే వ్యక్తుల పట్ల పదే పదే తన వ్యతిరేకతను చూపించే అమిత్‌ షా నేతృత్వంలోని హోం మంత్రిత్వ శాఖ వైఖరి ఏమిటనేది దీంతో తెలుస్తోంది. పొరుగునున్న దేశంతో భాషను పంచుకుంటున్నారనే కారణంతో బెంగాలీలను చొరబాటుదారులుగా చూపించేందుకు బిజెపి ప్రభుత్వం పాల్పడుతున్న నీచమైన ఎత్తుగడను ఈ మొత్తం ప్రహసనం వెల్లడిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో, పోలీసులు బెంగాలీలను ముఖ్యంగా నిరుపేదలైన వలస కార్మికులను వేధిస్తున్నారు. వారిని అక్రమంగా నిర్బంధిస్తున్నారు. చాలామందిని వేధింపులకు గురి చేస్తూ, వారి పట్ల అసభ్యంగా వ్యవహరిస్తూ, కనీసం న్యాయబద్ధమైన ప్రక్రియను కూడా అనుసరించకుండానే వారిని తరలించేస్తున్నారు. బెంగాలీ మాట్లాడే పౌరులను వేధించడానికి కేంద్రప్రభుత్వం తక్షణమే స్వస్తి పలకాలని’ సిపిఎం పొలిట్‌బ్యూరో డిమాండ్‌ చేసింది. బెంగాలీని విదేశీ బాషగా గుర్తించినందుకు హోం మంత్రిత్వ శాఖ క్షమాపణలు చెప్పాలని, అందుకు బాధ్యులైన అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరింది.

జాతీయ గీతాన్ని రచించిన బెంగాలీ భాషను అవమానించడమే !
కేంద్ర హోం శాఖ పరిధిలోని ఢిల్లీ పోలీసులు బెంగాలీని ”బంగ్లాదేశీ భాష”గా అభివర్ణించడాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తీవ్రంగా ఖండించారు. ఇది మన జాతీయ గీతాన్ని రచించిన భాషని ప్రత్యక్షంగా అవమానించడమేనని పేర్కొ న్నారు. ఈ ప్రకటన అనుకోకుండా లేదా అజా గ్రత్తతో చేసిన తప్పు కాదని తెలిపారు. వైవిధ్యతను నిరంతరం అణగదొక్కే పాలకుల చీకటి మనస్త త్వాన్ని బయటపెడుతోందని స్టాలిన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిరసనలు తెలపండి : మమతా బెనర్జీ
ఢిల్లీ పోలీసులు బెంగాలీని బంగ్లాదేశీ భాషగా పేర్కొనడం అవమానకరమైనది, కుట్రపూరి తమైనది, జాతి వ్యతిరేకమైనది, రాజ్యాంగ విరుద్ధమైనది అని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. భారతదేశంలోని బెంగాలీ మాట్లాడే ప్రజలందరినీ అవమానిం చారని పేర్కొన్నారు. తమను కించపరిచే, హీనపరిచే ఈ రకమైన భాషను వారు ఉపయోగించలేరని అన్నారు.
”బెంగాలీ, మా మాతృభాష, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, స్వామి వివేకానందల భాష, మన జాతీయ గీతం, జాతీయ గీతం (బంకించంద్ర చటోపాధ్యాయ రాసినది) రచించబడిన భాష, కోట్లాది మంది భారతీయులు మాట్లాడే, రాసే భాష, భారత రాజ్యాంగం గుర్తించిన భాష, ఇప్పుడు బంగ్లాదేశీ భాషగా వర్ణించబడింది” అని మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బెంగాలీ వ్యతిరేక ప్రభుత్వానికి ప్రజలంతా ఏకమై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేయాలని కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad