అల్ట్‌మిన్ సంస్థతో అగ్రిమెంట్‌లో అడ్డగోలు అవినీతి
రూ. 2250 కోట్ల ఒప్పందంపై శ్వేతపత్రం విడుదల చేయాలి
సింగరేణి పరిరక్షణకు మరో ఉద్యమం:కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సింగరేణిలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అవినీతిపై విచారణకు సిద్ధమా? అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ”సేవ్ సింగరేణి” రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కార్మికుల కారుణ్య నియామాకాలపై కాకుండా ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని కొంత పూడ్చేందుకు గత ప్రభుత్వం కొన్ని సడలింపులతో 20 వేల మంది కార్మికులకు ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పారు. గత ప్రభుత్వ పాలసీపై ఎంక్వైయిరీ ఎలా చేస్తారని ప్రశ్నించారు.
రాజస్థాన్ ప్రభుత్వంతో సింగరేణి సంస్థ రూ.11 వేల కోట్ల ఒప్పందం చేసుకుందని కవిత చెప్పారు. ఒక మెగావాట్ విద్యుత్‌కు అయ్యే ఖర్చుకు మూడు రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టే విధంగా ఆ ఒప్పందం ఉందని తప్పుపట్టారు. అదే విధంగా లిథియం రిఫైనరీ అంటూ అల్ట్ మిన్ అనే చిన్న కంపెనీతో రూ. 2,250 కోట్ల ఒప్పందం చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 27 లక్షలు కూడా ఆదాయం లేని సంస్థతో రూ. 2,250 కోట్ల ఒప్పందం ఎలా చేసుకున్నారని ఆమె ప్రశ్నించారు. డీజిల్ కుంభకోణంలో రూ.250 కోట్లు, అదనపు ఛార్జీలు వసూలు చేయలేక రూ.వెయ్యి కోట్లకు పైగా, లీకేజీ కారణంగా రూ.24 కోట్లు, నిబంధనల ఉల్లంఘనల కారణంగా రూ.74 కోట్లు సింగరేణికి నష్టం చేశారని కవిత చెప్పారు. ఈ విషయాన్ని కాగ్ నివేదిక వెల్లండించిందని తెలిపారు. సింగరేణి ఓబీ కాంట్రాక్టర్లు, నాయకులు, అధికారులు, సింగరేణిలో బొగ్గు మింగిన వారిపై ముందు విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని నిలదీశారు.
ప్రభుత్వం దాదాపుగా రూ.47 వేల కోట్లు సింగరేణికి బకాయిలు చెల్లించకపోవటంతోనే ఆ సంస్థ నిర్వహణ భారంగా మారిందని కవిత తెలిపారు. ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తే ఆ డబ్బుతో వచ్చే వడ్డీతో సంస్థ సజావుగా సాగుతుందన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెళ్లి ప్రభుత్వంతో మాట్లాడగానే సింగరేణిలో బొగ్గు ప్రొడక్షన్ తగ్గించారని కవిత చెప్పారు. సింగరేణిలో డింపెండెంట్ ఉద్యోగాలు, అలియాస్ పేర్ల అంశం, పాత వీఆర్‌ఎస్ స్కీమ్ ను కొనసాగించాలనీ, మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలనీ, గతంలోనే వైద్య పరీక్షల్లో పాసైన 350 మంది అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇవ్వాలనీ, ఖాళీగా ఉన్న క్లర్క్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కవిత డిమాండ్ చేశారు. లైఫ్ రిస్క్ సెక్టార్‌గా సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు ఇన్‌కం ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని కోరారు. సమస్యలను పరిష్కరించకుంటే సింగరేణి పరిరక్షణ కోసం మరో ఉద్యమం చేపడతామని ఆమె హెచ్చరించారు.
ఈ సమావేశంలో ”కేంద్రం లేబర్ కోడ్‌కు సంబంధించి తెచ్చిన నాలుగు నల్ల చట్టాలను అమలు చేసేది లేదని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలి. అసెంబ్లీలో తీర్మానం చేయాలి. మెడికల్ బోర్డును మానవతా దృక్పథంతో ఆలోచించి వెంటనే ఏర్పాటు చేయాలి. పెండింగ్ కేసులు పరిష్కరించాలి. అలియాస్ నేమ్స్ సమస్యను పరిష్కరించాలి. వీటికి లీగాలిటీ వర్తించదు. పొలిటికల్ విల్ ఉంటే సమస్య పరిష్కారం చేయవచ్చు. సింగరేణి సంస్థ అల్ట్ మిన్ కంపెనీతో కంపెనీతో రూ.2,250 కోట్లతో చేసుకున్న ఒప్పందంపై శ్వేత పత్రం విడుదల చేయాలి. నైనీ, తాడిచర్ల వంటి బొగ్గు గనులను కొత్తగా వచ్చే గనులను కూడా సింగరేణి సంస్థయే ఆపరేట్ చేయాలి….” అని తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సెంట్రల్ కమిటీ మెంబర్ ప్రసాద్, ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ ప్రతినిధులు, సింగరేణి కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.



