నిపుణుల కమిటీ తుది తనిఖీ నేడు
బెంగళూరు (కర్నాటక) : ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్‌కు చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుందని నిర్వాహకులు బుధవారం షెడ్యూల్ విడుదల చేసినా, నేడు ప్రభుత్వ నిపుణుల కమిటీ ఇచ్చే తుది నివేదికపై మ్యాచ్ నిర్వహణ ఆధారపడి ఉంది. చిన్నస్వామి స్టేడియంలో దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి అందించినా..నివేదిక అందజేసే ముందు నిపుణుల కమిటీ తుది తనిఖీ నేడు చేయనుంది. మ్యాచ్‌ల సమయంలో స్టేడియంలోకి ప్రవేశించే, నిష్క్రమించే అభిమానుల రద్దీని క్రమబద్దీరించేందుకు కర్నాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కెఎస్‌సీఏ) ఇప్పటికే అదనంగా ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేసింది.
ఆఫ్‌లైన్ టికెట్ల కౌంటర్ల దగ్గర రద్దీ తగ్గించేందుకు.. ఎంట్రీ గేట్ల వద్ద క్యూఆర్ టెక్నాలజీని వినియోగించే ఆలోచన సైతం ఉంది. స్టేడియం ఆధునీకరణ, ప్రేక్షకుల భద్రతను పెంచేలా అదనపు ఏర్పాట్లు ఈ నెల 15లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్‌లైన్ విధించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2026 ఈ నెల 28న చిన్నస్వామి స్టేడియంలో తొలి మ్యాచ్‌తో ఆరంభం కానుంది. సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.



