Friday, March 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరాష్ట్ర నూతన డీజీపీగా సీవీ ఆనంద్‌కే చాన్స్‌?

రాష్ట్ర నూతన డీజీపీగా సీవీ ఆనంద్‌కే చాన్స్‌?

- Advertisement -

ప్రభుత్వ సలహాదారుడుగా శివధర్‌రెడ్డి
త్వరలో సర్కార్‌ ప్రకటించే అవకాశం

నవతెలంగాణ- ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సీవీ ఆనంద్‌ను నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ దిశగా ప్రభుత్వం కసరత్తు జరుపుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్ర నూతన డీజీపీ నియామకం కోసం సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులతో కూడిన జాబితాను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) రెండ్రోజుల క్రితం జాబితాను రాష్ట్రానికి పంపించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో 1991 బ్యాచ్‌కి చెందిన సీవీ ఆనంద్‌, 1994 బ్యాచ్‌కి చెందిన ప్రభాకర్‌ ఆప్టే, సౌమ్య మిశ్రాల పేర్లున్నాయి. కాగా ఇందులో నుంచి ఒకరిని నూతన డీజీపీగా ఎంపిక చేసుకునే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టింది. ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సుదీర్ఘ మంతనాలు జరిపి సీవీ ఆనంద్‌కే డీజీపీ పగ్గాలను అప్పగించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది.

సీవీ ఆనంద్‌ ముఖ్యంగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కావటంతోపాటు, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల అదుపు, ట్రాఫిక్‌ నియంత్రణతో పాటు క్లిష్టమైన సమయాల్లో చురుకుగా నిర్ణయాలు తీసుకునే తత్వం వెరసి డీజీపీగా ఆయనకు పగ్గాలు అప్పగించాలని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంలో ఇప్పటికే తుది నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. చివరి క్షణంలో ఏదేని అనుకోని మార్పులు సంభవిస్తే తప్ప, సీవీ ఆనంద్‌కే పగ్గాలు దక్కనున్నాయని ఐపీఎస్‌ వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఏప్రిల్‌ నెలలో ఉద్యోగవిరమణ చేయనున్న ప్రస్తుత రాష్ట్ర ఇన్‌చార్జి డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డిని ప్రభుత్వ సలహాదారుడిగా క్యాబినెట్‌ హోదాలో ముఖ్యమంత్రి నియమించనున్నారని సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -