వికారాబాద్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డుప్రమాదం మరోసారి రవాణా వ్యవస్థలోని లోపాలను బహిర్గతం చేసింది. అధిక కంకర లోడ్‌తో వేగంగా దూసుకొచ్చిన టిప్పర్, పరిమితిని మించిన ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎదురెదురుగా ఢకొీనడంతో క్షణాల్లోనే పందొమ్మిది ప్రా ణాలు గాల్లో కలిశాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతి గుండెల్ని పిండేసింది. రోడ్డుపక్కన తల్లిదండ్రుల రోదనలు, ఆస్పత్రిలో బంధువుల కన్నీటి దృశ్యాలు ఎవరినైనా కం టతడి పెట్టించకమానవు. ఇటీవల కర్నూలులో బస్సుప్రమాదం మరవకముందే చెవెళ్ల దగ్గర జరిగిన ఈ ఘటనతో రోడ్డుమీద ప్రయాణించాలన్నా జంకుతున్న పరిస్థితి. ప్రమాదం పట్ల మన ముఖ్యమంత్రి, మం త్రులు స్పందించారు, పరిహారం కూడా ప్రకటించారు. కానీ అది వారి ప్రాణాలను తీసుకు రాగలదా? రోడ్డు భద్రతాచర్యలు సకాలంలో తీసుకుంటే, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ సరిగా ఉంటే ఇలాంటి ప్రమా దాలు జరుగునా? ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్నలివే. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే తప్ప వేరేకాదు.
నలభై టన్నుల సామర్థ్యం గల టిప్పర్ అరవై టన్నులతో రహదారిపైకి వస్తే దాన్ని పర్యవేక్షించే వ్యవస్థ మనదగ్గర లేదు. నలభై మంది ప్రయాణించాల్సిన బస్సులో డెబ్బయిమందిని నింపితే నివారించే యంత్రాంగం లేదంటే ఆశ్చర్యమే. ఇది సర్కారు బాధ్యతే కదా! దీన్ని విస్మరించి పరిహారం ప్రకటించి ప్రమా దాన్ని దాచేస్తేమంటే ఎలా? రోడ్డంతా గుంతలు, కానరాని హెచ్చరిక బోర్డులు, కాంతులు లేని దారులు, నిర్లక్ష్యంగా నడిచే వాహనాలు ఇవన్నీ కలిసి రహదారిపై మరణమృదంగం మోగిస్తుంటే అధికార యంత్రాంగం మాత్రం నిర్లక్ష్యంగా నిద్దురపోతోంది. ఏం పాపం చేశారు వీళ్లు? ఎన్నో ఆశలతో చదువు కో వాలని బయలుదేరిన విద్యార్థులు చనిపోయారు. వారి తల్లిదండ్రుల శోకాన్ని ఎవరూ ఆపగలరు? బంధు వులను చూసి తిరిగొస్తున్నవారు, కొందరు ఉద్యోగాలకు, మరికొందరు ఊళ్లకు వెళ్తున్నవారు..ఇలా ఒక్కొక్క రిది ఒక్కోగాథ. ఒకరికొకరు తెలియదు, ఎవరి గమ్యమేమిటో కూడా తెలియదు. కానీ, వీరంతా ఒకే దగ్గర చేరి మృత్యువులో ఒక్కటయ్యారు. నాలుగు నెలల శిశువు కూడా తల్లి ఒడిలోనే మరణించడంకన్నా హృదయవిదారకం ఉంటుందా?
ప్రమాదం జరిగిన తీరు ఊహకందనిది. మూలమలుపులో రోడ్డుపై ఉన్న గుంతను తప్పించపోయి ఎదురుగా వస్తున్న బస్సును టిప్పర్ ఢకొీట్టిందని తెలుస్తోంది. దీంతో ముందుభాగం చీలి డ్రైవర్ వెనుక ఉన్న సీట్లను సైతం చీల్చేసింది. లోడంతా బస్సుపై ఒరగడంతో బస్సే ఒక కంకరకుప్పగా మారింది. అందులో ప్రయాణికులు సజీవసమాధి అయ్యారు. కొంతమంది తల మాత్రమే, మరికొంతమంది చేతులు మాత్రమే కనిపిస్తూ కాపాడండి అంటూ చేసే ఆర్తనాదాలు ఆ ప్రాంగణాన్ని హోరెత్తించాయి. స్థానికులు మాత్రం మానవత్వం చాటుకుని చాలా మందిని బస్సులో నుంచి బయటకు తీశారు. అంబులెన్స్, పోలీసులకు సమా చారమిచ్చారు. కానీ ప్రభుత్వం మాత్రం కంటి తుడుపు చర్యలు, కొద్దిపాటి పరిహారం ప్రకటించి బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూడటం సరికాదు. నిండు జీవితానికి పరిహారం ఎన్ని రూపాయలతో కొలవ గలం? ప్రాణం పోయిన తర్వాత ఉదారత చాటుకోవడం కాదు, ప్రాణం నిలిచేలా ముందుగా చర్యలు తీసుకోవడం కదా ముఖ్యం. దాన్మి నిర్లక్ష్యం చేసిన ఫలితమే ఈ రోడ్డు ప్రమాదం.
2019 మోటరు వాహనాల చట్టం కఠినంగా అమలు చేస్తున్నామని పాలకులు చెబుతున్నా వేగ నియంత్రణకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో వాహనాలకు ఫిట్‌నెస్ ఉందా? అసలు పరీక్షిస్తున్నారా? ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో రేకెత్తుతున్న అనుమానాలు. ప్రయివేటు వాహనాల ఓవర్‌లోడ్‌కు యాజమాన్యాలదా బాధ్యత, ప్రభుత్వానిదా? దీన్ని అరికట్టేదెవరు? ప్రమాదం జరిగిన జాతీయ రహదారి మొత్తం నూట అరవై కిలోమీటర్ల దూరం ఉంటే అందులో నలభై కిలోమీటర్లు అధ్వానంగా, ప్రమాదకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. పైగా ఇరుకు రోడ్లతో వాహనాల ఇక్కట్లు అన్నీఇన్నీ కావు. రోడ్డు వెడల్పు పనులు చేపట్టకపోవడానికి పర్యావరణ కారణాల్ని సాకుగా చెబుతోంది సర్కార్. దాన్ని కూడా పరిష్కరించాల్సింది ప్రభుత్వమే కదా! పరిమితికి మించి రోజూ వందలాదితో బస్సులు ప్రయాణి స్తున్నాయి. కానీ వీటిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. ఇప్పటివరకు జగిత్యాల డిపోకు చెందిన ఒకే ఒక బస్సు పరిమితి దాటిందని రవాణాశాఖ చలాను విధించింది. దీన్నిబట్టే యంత్రాంగ పనితీరు అర్థమవుతోంది.
ఈ ప్రమాదాలు, రోదనలు ఆగాలంటే ముందు ప్రాణాలకు విలువివ్వాలి. దాన్ని గుర్తించని పాలన, అభివృద్ధి పేరుతో కాలయాపన చేస్తే అది ఎప్పటికీ చీకటిలోనే పయనిస్తుంది. దీన్ని గుర్తెరిగి చేవెళ్లలో పారిన ఆ కన్నీటిశోకం రాష్ట్రంలో మరెక్కడా పునరావృతం కాకుండా చూడటమే ఇప్పుడు ప్రధానం.
మరణమే మార్గమా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



