Thursday, October 30, 2025
E-PAPER
Homeజాతీయంఅంబానీ, అదానీలకు ఆస్తులు కట్టబెట్టడమే అభివృద్ధా..?

అంబానీ, అదానీలకు ఆస్తులు కట్టబెట్టడమే అభివృద్ధా..?

- Advertisement -

ఓట్ల కోసం ప్రధాని ఎంతకైనా తెగిస్తారు.. : రాహుల్‌గాంధీ
దర్బంగా :
‘బడా వ్యాపారవేత్తలైన ముకేశ్‌ అంబానీ, గౌతమ్‌ అదానీలకు ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టడమే అభివృద్ధా..?’ అని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలప్రచారంలో భాగంగా బుధవారం దర్భంగాలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో రాహుల్‌గాంధీ.. మోడీ సర్కారుపై నిప్పులు చెరిగారు.
భూమిలేని నిరుపేదలకు భూమి ఇవ్వడానికి భూమి కొరత ఉన్నదని కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా చెబుతున్నారని, మరి అదే నిజమైతే అదానీకి ఒక్క రూపాయికే కట్టబెడుతున్న భూమి ఎక్కడిదని రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. అది బీహార్‌ రైతుల భూమి కాదా..? అని ప్రశ్నించారు. అంబానీ, అదానీ కావాలనుకుంటే భూమి దొరుకుతుందని, రెండు నిమిషాల్లో రైతుల నుంచి లాక్కుని వారికి కట్టబెడుతారని ఆరోపించారు. కానీ పేద రైతు తన బిడ్డ ఉపాధి కోసం భూమి అడిగితే బీహార్‌లో భూమి ఎక్కుడుందని అమిత్‌ షా దబాయిస్తున్నారని రాహుల్‌గాంధీ మండిపడ్డారు. ధారవిలో ఎంతో మంది బీహారీలు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారని, అయితే లక్షల కోట్ల విలువ చేసే ఆ భూమిని లాక్కుని మోడీ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అదానీకి కట్టబెట్టిందని విమర్శించారు.
మోడీ సర్కారు దృష్టిలో అభివృద్ధి అంటే ఇదేనని రాహుల్‌గాంధీ ఎద్దేవా చేశారు. అంబానీ, అదానీలకు ఆస్తులను కట్టబెట్టడమే అభివృద్ధి అని విమర్శించారు. బడా వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు తీసుకున్న కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేయడమే అభివృద్ధి అని మండిపడ్డారు.

లౌకికవాద శక్తులను గెలిపించండి..
బీహార్‌ ఎన్నికల్లో లబ్దిపొందడానికి ప్రధాని మోడీ ఏదో ఒక డ్రామా ఆడతారని రాహుల్‌గాంధీ విమర్శించారు. ఛత్‌ పూజ సందర్భంగా ప్రధాని యమునా నదిలో స్నానం చేస్తానని చెప్పారని, అయితే నదిలో కాకుండా నది పక్కన ఒక కుంటను తవ్వించి, అందులో పైప్‌ ద్వారా స్వచ్ఛమైన నీళ్లను నింపించి స్నానం చేశారని తెలిపారు. ఈ చర్య ద్వారా యమునా నదిలో మురుగు నీరు ప్రవహిస్తుందనే నిజాన్ని దేశానికి తెలియజెప్పారని ఎద్దేవా చేశారు.
ఎన్నికల కోసం ప్రధాని ఈ డ్రామా ఆడారని, అయితే కుంటలోకి స్వచ్ఛమైన నీళ్లను వదిలేందుకు ఏర్పాటు చేసిన పైపు ఫొటో బయటపడటంతో ఆ డ్రామా బెడిసికొట్టిందని రాహుల్‌ చెప్పారు. తర్వాత జరిగే ప్రధాని ప్రచార సభలో ఓ 200 మంది లేచి ఓట్ల కోసం డ్యాన్స్‌ చేయాలని ప్రధానిని కోరితే వెంటనే డ్యాన్స్‌ మొదలవుతుందని రాహుల్‌గాంధీ ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ ఏకంగా భరతనాట్యమే చేస్తారని ఆయన విమర్శించారు. బీహార్‌లో జరిగే ఎన్నికల్లో లౌకిక, ప్రజాస్వామ్య శక్తులను గెలిపించాలని రాహుల్‌ కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -