Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంబీజేపీ బ్యాక్‌ ఆఫీస్‌గా ఈసీ?

బీజేపీ బ్యాక్‌ ఆఫీస్‌గా ఈసీ?

- Advertisement -
  • ఓట్ల చోరీదారులను పదేండ్లుగా కాపాడుతోంది
  • జీఎస్టీ సంస్కరణల్లో మా విజ్ఞప్తిని కేంద్రం పట్టించుకోలేదు
  • ప్రధాని అహం దేశాన్ని దెబ్బతీస్తోంది : ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

    నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

    కేంద్ర ఎన్నికల సంఘం ”ఓట్ల చోరీలో బీజేపీ బ్యాక్‌-ఆఫీస్‌గా” మారిందా? అంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. ఆదివారంనాడిక్కడ ఆయన మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కర్నాటకలోని అలంద్‌ నియోజకవర్గంలో ఓటర్ల మోసానికి సంబంధించిన దర్యాప్తులో వివరాలను దాచిపెట్టాలని ఈసీ తీసుకున్న నిర్ణయంపై మీడియా నివేదికను స్పందించారు. 2023 మేలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు అలంద్‌ నియోజకవర్గంలో ఓటర్ల ”భారీ తొలగింపు” జరిగిందని అన్నారు. ఫారమ్‌ 7 దరఖాస్తులను నకిలీ చేయడంతో వేలాది మంది ఓటర్ల హక్కులను తొలగించారని ఖర్గే వివరించారు. ”ఫిబ్రవరి 2023లో ఒక కేసు నమోదైంది. దర్యాప్తులో 5,994 నకిలీ దరఖాస్తులు వెల్లడయ్యాయి. ఓటర్లను మోసం చేయడానికి జరిగిన భారీ ప్రయత్నానికి స్పష్టమైన సాక్ష్యం. ఆ తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం నిందితులను పట్టుకోవడానికి సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది” అని ఆయన అన్నారు. దర్యాప్తునకు అవసరమైన కీలకమైన సమాచారాన్ని ఎన్నికల సంఘం దాచిపెట్టిందని ఆరోపించారు. ”ఓటు చోరీ” వెనుక ఉన్నవారికి ఎన్నికల సంఘం ”కవచం”గా పని చేస్తోందని విమర్శించారు. ఓటు చోరీ వెనుక ఉన్నవారిని సమర్థవంతంగా రక్షించిందని ఖర్గే ఆరోపించారు. దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన అవస రాన్ని నొక్కిచెబుతూ దర్యాప్తునకు అవసరమైన సాక్ష్యాలను అడ్డుకున్నారనే ఆరోపణలపై ఈసీ ఉద్దేశ్యాన్ని ఆయన ప్రశ్నించారు. ”ముఖ్యమైన ఆధారాలను ఈసీఐ అక స్మాత్తుగా ఎందుకు బ్లాక్‌ చేసింది? అది ఎవరిని రక్షి స్తోంది? ఈసీ.. బీజేపీ ఓటు చోరీ విభాగమా? సీఐడీ దర్యాప్తు ను పక్కదారి పట్టించడానికి బీజేపీ ఒత్తిడికి ఈసీఐ తలొగ్గుతోందా? వ్యక్తి ఓటు హక్కును కాపాడాలి. దేశ ప్రజాస్వా మ్యాన్ని కాపాడాలి”అని ఖర్గే అన్నారు.
    ప్రధాని మోడీ అహం దేశానికి దెబ్బ
    జీఎస్టీ సంస్కరణల్లో తాము చేసిన విజ్ఞప్తిని కేంద్రం పట్టించుకోలేదని, ప్రధాని మోడీ అహం దేశాన్ని దెబ్బతీస్తోందని మల్లికార్జున్‌ ఖర్గే విమర్శించారు. జీఎస్టీ సంస్కరణలను అమలు చేయడంలో జాప్యంపై మోడీ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. పరోక్ష పన్నులను సరళీకరించాలని తాము నిరంతరం డిమాండ్‌ చేస్తోన్నా మన్నారు. ”గత ఎనిమిదేండ్లుగా మేము జీఎస్టీ సంస్కరణల కోసం పోరాడుతున్నాం. కానీ మోడీ ప్రభుత్వం ఆ విజ్ఞప్తులను ఎప్పుడూ అంగీకరించలేదు” అని ఖర్గే అన్నారు. మోడీ సర్కార్‌ అహం జాతీయ ప్రయోజనాలను దెబ్బతీసిందని ఆరోపించారు. మోడీ విదేశాల్లో విదేశీ నాయకులను ప్రోత్సహించడం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇది భారతదేశ విదేశాంగ విధానానికి తప్పుడు ఉదాహరణగా నిలుస్తుందని హెచ్చరించారు. కేంద్రం పదే పదే నిర్లక్ష్యం చేసినప్పటికీ తాము ప్రజల సమస్యలను లేవనెత్తుతూనే ఉంటామని పునరుద్ఘాటించారు.
    రాష్ట్రాలకు ఐదేండ్లపాటు పూర్తిగా పరిహారం చెల్లించాలి
    కాంగ్రెస్‌ పార్టీ 2019, 2024 మ్యానిఫెస్టోలలో ”సరళమైన,హేతుబద్ధమైన” పన్ను వ్యవస్థతో జీఎస్టీ 2.0ను ప్రతిపాదించిందని, జీఎస్టీ సమ్మతిని సరళీకరించాలని డిమాండ్‌ చేసిందని ఖర్గే అన్నారు. ఇది ఎంఎస్‌ఎంఈలు, చిన్న వ్యాపారాలను ”తీవ్రంగా ప్రభావితం చేసిందని” చెప్పారు. 2005లో యూపీఏ ప్రభుత్వం జీఎస్టీ ఆలోచనను తొలిసారిగా ప్రవేశపెట్టిందని, 2011లో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ జీఎస్టీ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ దానిని వ్యతిరేకించిందని ఖర్గే గుర్తు చేశారు. ”మోడీ జీఎస్టీని తీవ్రంగా వ్యతిరేకించారు. నేడు, అదే బీజేపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లను చేస్తోంది. సామాన్యుల నుంచి పన్ను వసూలు చేయడం గొప్ప విజయం అన్నట్టుగా ప్రస్తుత ప్రభుత్వం కపటత్వాన్ని ప్రదర్శిస్తోంది” అని ఆయన ఆరోపించారు. తక్కువ పన్ను రేట్ల కారణంగా ఆదాయం తగ్గే అవకాశమున్నందున 2024-25ని బేస్‌ ఇయర్‌గా తీసుకుని రాష్ట్రాలకు ఐదేండ్లపాటు పూర్తిగా పరిహారం చెల్లించాలని ఖర్గే డిమాండ్‌ చేశారు.

    బీహార్‌లో కూలిపోనున్న డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌
    ఓట్ల చోరీకి పాల్పడుతున్న వారిని కాపాడటమే లక్ష్యంగా ఈసీ పదేండ్లుగా పని చేస్తోందని ఖర్గే విమర్శించారు. అందుకు చట్టాలను మార్చడానికి కూడా వెనకాడట్లేదని అన్నారు. నాడు కర్నాటకలో చేసిన విధంగా ప్రస్తుతం బీహార్‌లోనూ ఓట్ల చోరీకి పాల్పడేందుకు కేంద్రం, ఈసీ కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. ఓట్ల చోరీతో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఓట్ల చోరీ చేసిందనీ, బీహార్‌లో మాత్రం బీజేపీ, ఈసీని ఒక్క ఓటు కూడా చోరీ చేయనివ్వబోమని అన్నారు. త్వరలో ఎన్డీఏ డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా బీహార్‌లో చేపట్టిన ‘ఓటర్‌ అధికార్‌ యాత్ర’ దేశవ్యాప్తంగా ఉద్యమంగా మారుతున్నదని తెలిపారు.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad