Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుఓటరు జాబితాలో పేరు లేకుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నట్టా?

ఓటరు జాబితాలో పేరు లేకుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నట్టా?

- Advertisement -

దేశంలో అర్థవంతమైన చర్చ జరగాలి
– ప్రమాదంలో ప్రజాస్వామ్యం.. ఎదుర్కోవాల్సిన సమయమిదే
కేసీఆర్‌ నా సన్నిహితుడే
చంద్రబాబు దార్శనికత కలిగిన నాయకుడు : మీట్‌ ది ప్రెస్‌లో ఇండియా బ్లాక్‌ ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ బి సుదర్శన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం తెలంగాణ స్టేట్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ (టీయూడబ్య్లూజే) ఆధ్వర్యంలో హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక పౌరసత్వం కంటే ముందే ప్రజలు ఓటర్లుగా నమోదయ్యారని గుర్తుచేశారు. నాడు ఓట్ల జాబితా ముసాయిదా రూపకల్పన కోసం ప్రజల నుంచి సరైన స్పందన లేని పరిస్థితుల్లోనూ ముందుగా దాన్ని రూపొందించారని తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఓటర్ల జాబితా నుంచి ఓటర్లను తొలగించేదెలా? అనే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కులమతాలతో భేదం లేకుండా ఉండేవి ఓటర్ల జాబితాలని విశ్లేషించారు. ఓటరు గుర్తింపును కోల్పోతున్నామనే భావన కల్పిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మాట్లాడుతూ, నిలబడి, ఎదుర్కోవాల్సిన సమయం ఇదేనని తాను భావిస్తున్నానన్నారు. తన అభ్యర్థిత్వం ప్రతిపాదించినప్పటి నుంచి తాను 63.7 శాతం జనాభాకు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిగా మారిన క్రమాన్ని ఆయన వివరించారు. తాను ఢిల్లీకి విమానంలో వెళ్లకముందే ఇండియా కూటమి అభ్యర్థిగా ప్రకటించారని తెలిపారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) మద్ధతు తెలిపిందన్నారు. దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్య మంత్రులు, రాజకీయ నాయకులతో తాను మాట్లాడు తున్నానని చెప్పారు. జార్కండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌కు దేశంలో నెలకొన్న పరిస్థితులపై పూర్తి అవగాహన ఉందనీ, శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న భయం పోగొట్టే దిశగా ఒక అర్థవంతమైన చర్చ జరగాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. దేశం తొలినాళ్లలో పని చేసినట్టుగా ఎలక్షన్‌ కమిషన్‌ ఇప్పుడెందుకు పని చేయడం లేదని ప్రశ్నించారు.

విప్‌ జారీ తెలీదు
ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు విప్‌ జారీ చేయడంపై అడిగిన ప్రశ్నకు సుదర్శన్‌రెడ్డి బదులిస్తూ రాజ్యాంగపరంగా అదెలా సాధ్యమో తెలియదన్నారు. రాజ్యసభ చైర్మెన్‌ నిష్పక్షపాతంగా ఉండి తమ గొంతును వినిపించే అవకాశమిస్తున్నారని భావిస్తే ఆందోళనకర పరిస్థితులను తగ్గించవచ్చన్నారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థులుగా తనతో పాటు తన ప్రత్యర్థి ఒకేసారి ప్రజల ముందు కనిపిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తీకరించారు. సమకాలీన అంశాలపై తమ అభిప్రాయాలు దేశ ప్రజలు తెలుసుకునే అవకాశముంటుందన్నారు.

ఏ రాజకీయ పార్టీలో లేను
తాను ఏ రాజకీయ పార్టీలో లేనని జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిగా బరిలో ఉన్నట్టు తెలిపారు. తన అభ్యర్థి త్వానికి మద్ధతునివ్వాలని అందరిని కలుస్తా నని చెప్పారు. తెలుగు వారి ఆత్మగౌరవం అనే వారినీ, తెలంగాణే నా ఉచ్ఛ్వాస, నిఛ్ఛాస అనే వారందరిని కలిసి మద్ధతు కోరుతానని తెలిపారు. అపాయింట్‌ మెంట్‌ ఇస్తే నేరుగా కలుస్తాననీ, లేకుంటే ఫోన్లో కోరతానని తెలిపారు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు ప్రభుత్వంలో ప్రభుత్వ న్యాయవాదిగా పని చేశాననీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దార్శనికత కలిగిన నాయకులని సుదర్శన్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కూడా తనకు సన్నిహితుడేనని తెలిపారు. ఓటుకు యూరియా బస్తాలివ్వమంటే మాత్రం తాను నిస్సహాయుడ్ని అని ఛలోక్తి విసిరారు. తనకు నచ్చిన రాజకీయ నాయకులు సజీవంగా లేరన్నారు. ఈ సమావేశంలో మీడియా అకాడమీ చైర్మెన్‌ కె.శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్‌ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.విరహత్‌అలీ, కె.రాంనారాయణ పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad