యూఎస్ సుప్రీం తీర్పుపై తీవ్ర చర్చ
వీడని అనిశ్చితి భయాలు..
పలు ఉత్పత్తులపై 50 శాతం సుంకాలు కొనసాగింపు
అక్వా, టెక్స్‌టైల్, అభరణాల రంగాలకు ఉపశమనం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన కఠినమైన సుంకాల విధానంపై ఆ దేశ సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు అంతర్జాతీయ వాణిజ్య రంగంలో కొత్త చర్చకు తెరలేపింది. ఈ పరిణామం భారత ఎగుమతిదారులకు భారీ ఆర్థిక వెసులుబాటు కల్పిస్తుందని ఒక వర్గం నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తుండగా, ఇది కేవలం తుపాను ముందు ప్రశాంతత మాత్రమేనని మరోవర్గం హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి అమెరికాకు జరిగే దాదాపు 80 బిలియన్ డాలర్ల (రూ. 6.6 లక్షల కోట్లు) ఎగుమతుల భవిష్యత్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
వాషింగ్టన్/ న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు తీర్పును సానుకూలంగా చూస్తున్న ఆర్థిక విశ్లేషకులు దీన్ని భారత పారిశ్రామిక రంగానికి లభించిన అత్యంత సానుకూలాంశమని అభివర్ణిస్తున్నారు. గతంలో రష్యా చమురు కొనుగోళ్ల సాకుతో భారత్‌పై విధించిన 50 శాతం గరిష్ట సుంకాలు చట్టవిరుద్ధమని తేలడంతో.. ప్రస్తుతం యూఎస్ కోర్టు తీర్పుతో కొత్త 10 శాతం గ్లోబల్ టారిఫ్ ఎగుమతిదారులకు పెద్ద ఊరటనిస్తోంది. తగ్గిన సుంకాల వల్ల భారతీయ కంపెనీలకు ఏడాదికి సుమారు 5-6 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.50,000 కోట్లు) వ్యయం తగ్గుతుందని అంచనా. ఫిబ్రవరి 24 నుంచి పాత సుంకాలు అమల్లోకి రావడం ద్వారా ముఖ్యంగా టెక్స్‌టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, అక్వా, పాదరక్షలు, ఇంజనీరింగ్ విడిభాగాల రంగాలు ఈ తగ్గింపుతో అమెరికా మార్కెట్‌లో తిరిగి పట్టు సాధించగలవని ఆ రంగాల నిపుణులు ఆశాభావంతో ఉన్నారు. అలాగే 8 బిలియన్ డాలర్ల భారతీయ జనరిక్ మందులకు దాదాపు పూర్తి మినహాయింపు దక్కే అవకాశం ఉండటం భారత్‌కు కలిసివచ్చే అతిపెద్ద అంశంగాను నిపుణులు భావిస్తున్నారు.
అమెరికాకు ప్రతీ ఏటా 10-12 బిలియన్ల వస్త్ర ఎగుమతులపై గతంలో 50 శాతం సుంకం ఉండేది. ఇప్పుడు అది 10 శాతానికి తగ్గడంతో భారతీయ వస్త్రాలకు అమెరికా మార్కెట్‌లో డిమాండ్ పెరగనుంది. భారత్ నుంచి అమెరికాకు జరిగే సుమారు 9 బిలియన్ డాలర్ల అభరణాలు, రత్నాల ఎగుమతులకు ఉపశమనం లభించనుంది. ముఖ్యంగా కట్ అండ్ పాలిష్డ్ డైమండ్స్‌పై సుంకం తగ్గడం వల్ల సూరత్, ముంబయి వ్యాపారులకు పెద్ద ఊరట లభించింది. సుమారు 8 బిలియన్ల విలువైన భారతీయ జనరిక్ మందులకు అమెరికా సుంకాల నుంచి దాదాపు పూర్తి మినహాయింపు దక్కే అవకాశం ఉంది. ఇది సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ వంటి దిగ్గజ కంపెనీలకు సానుకూలాంశం కానుంది. 20 బిలియన్ల మార్కెట్ కలిగిన ఆటోమొబైల్ పరికరాల రంగంపై సుంకాలు 30 శాతం నుంచి 10 శాతం తగ్గడం వల్ల భారతీయ విడిభాగాల ధరలు తగ్గి.. గ్లోబల్ పోటీలో నిలబడగలుగుతాయి.
అక్వా ఎగుమతులకు ఉపశమనం..
భారతీయ సముద్రపు ఉత్పత్తుల ఎగుమతులకు అమెరికా అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ముఖ్యంగా రొయ్యల ఎగుమతుల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. గత కొన్ని నెలలుగా సుంకాల భారం వల్ల సీఫుడ్ ఎగుమతులు 38.7 శాతం మేర క్షీణించాయి. దీనివల్ల రొయ్యల సాగుదారులు తీవ్ర నష్టాల్లో ఉన్నారు. వీటిపై దాదాపు 60 శాతం నుంచి 10 శాతానికి సుంకాలు తగ్గడంతో ఈ రంగం ఎగమతులకు మళ్లీ ఉపశమనం లభించనుంది.
150 రోజుల ఉపశమనమేనా..!
యూఎస్ సుప్రీంకోర్టు తీర్పు ఉపశమనాన్ని కేవలం తాత్కాలిక విరామంగానే పరిగణించాలని అంతర్జాతీయ నిపుణులు సూచిస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు విధించిన 10 శాతం సుంకాలు సెక్షన్ 122 కింద కేవలం 150 రోజుల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఈ గడువు ముగిసిన తర్వాత అధ్యక్షుడు కాంగ్రెస్ ఆమోదంతో తిరిగి పాత పద్ధతిలో భారీ సుంకాలు విధించే ప్రమాదం ఉందని చాథమ్ హౌస్ వంటి థింక్ ట్యాంకులు హెచ్చరిస్తున్నాయి. ఒకవేళ భారత్ తన వాణిజ్య విధానాల్లో అమెరికా కోరుకున్న మార్పులు చేయకపోతే సెక్షన్ 301 వంటి ఇతర కఠిన చట్టాల ద్వారా మళ్లీ పన్నుల భారం పెరిగే అవకాశం ఉందని విశ్లేషణలు వస్తోన్నాయి. అప్పుడు భారత ఎగుమతులు మళ్లీ సంక్షోభంలో పడవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రష్యా నుండి చమురు కొనుగోళ్ల నిలిపివేతకు అమెరికా ఒత్తిడి కొనసాగవచ్చని భావిస్తున్నారు.
మున్ముందు అసలైన సవాళ్లు..
ప్రస్తుతానికి భారత్‌కు లభించిన ఈ ఉపశమనం ఒక అద్భుతమైన అవకాశమని.. అయితే ఇది శాశ్వతం కాకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా ఒత్తిళ్లకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే సాగిలపడి మధ్యంతర ఒప్పందం కుదుర్చుకున్న వేళ మున్ముందు కూడా ట్రంప్‌కు వ్యతిరేకంగా వ్యవహారించకపోవచ్చని అంచనా వేస్తోన్నారు. ట్రంప్ విధానాలపై చైనా తరహాలో ఒత్తిడి చేయకపోతే భారత ఎగుమతిదారులకు మళ్లీ గడ్డుకాలమేనని భావిస్తున్నారు. ఈ తక్కువ సుంకాల కాలపరిమితి ముగిసేలోపు భారత్ అమెరికాతో శాశ్వత వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సి ఉంటుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్‌ఐ) ప్రతినిధులు పేర్కొన్నారు.
మరికొన్ని ఉత్పత్తులపై 50 శాతం టారిఫ్‌లే..!
సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ జాతీయ భద్రత సెక్షన్ 232 కింద విధించిన కొన్ని సుంకాలు అలాగే కొనసాగే అవకాశం ఉంది. ఉక్కు, అల్యూమినియంపై ఉన్న 50 శాతం టారిఫ్ ప్రస్తుతానికి మారకపోవచ్చని తెలుస్తోంది. కొన్ని రకాల ఆటోమొబైల్ పరికరాలపై 25 శాతం వరకు సుంకాలు కొనసాగవచ్చని రిపోర్టులు వస్తోన్నాయి.



