No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeజాతీయంకొద్ది దూరానికే విమాన ప్రయాణమా?

కొద్ది దూరానికే విమాన ప్రయాణమా?

- Advertisement -

– గవర్నర్‌పై మండిపడిన మణిపూర్‌ ప్రజలు
– నిరసనలు, ఆందోళనలతో హోరెత్తుతున్న రాష్ట్రం
– కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు తాళం
ఇంఫాల్‌:
మణిపూర్‌లో నిరసనలు బుధవారం నాలుగో రోజుకు చేరాయి. మణిపూర్‌ సమగ్రతపై ఏర్పడిన సమన్వయ కమిటీ (కొకోమీ) సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ ఆందోళనను ఉధృతం చేశారు. రెండు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు తాళం వేశారు. మరోవైపు రాష్ట్రంలో జాతుల మధ్య నెలకొన్న సంక్షోభంపై దేశ రాజధాని ఢిల్లీలో సమన్వయ కమిటీ ప్రతినిధులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో చర్చలు కొనసాగిస్తున్నారు. గవర్నర్‌ అజరు కుమార్‌ భల్లా క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్‌తో చేపట్టిన రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా కొకోమీ విద్యార్థి విభాగానికి చెందిన వారు దక్షిణ ఇంఫాల్‌లో ఉన్న ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి, జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా కార్యాలయానికి తాళం వేశారు.
ఈ నెల 20వ తేదీన జరిగిన ఘటన ఆందోళనలకు దారితీసింది. ఓ ఉత్సవం నుండి పాత్రికేయులను తీసుకొస్తున్న ప్రభుత్వ రంగానికి చెందిన బస్సుపై ‘మణిపూర్‌ రాష్ట్ర రవాణా’ అని రాసి ఉంది. ఆ పదాలను తొలగించాలంటూ భద్రతా సిబ్బంది ఆదేశించడంతో వివాదం మొదలైంది. కాగా భద్రతా సిబ్బంది ఎదుటే విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఆందోళన నిర్వహించారు. ‘మణిపూర్‌కు క్షమాపణలు చెప్పండి…లేదా వెళ్లిపొండి’, ‘మణిపూర్‌ గుర్తింపును అవమానిస్తున్న రాష్ట్రపతి పాలనను నిలిపివేయాలి’ అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. ఆందోళనల నేపథ్యంలో ఇంఫాల్‌ లోయలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంఫాల్‌ విమానాశ్రయం నుండి కాంగ్లా ఫోర్ట్‌కు గవర్నరును సైనిక విమానంలో తరలించడం ప్రజాగ్రహాన్ని మరింత పెంచింది. కాంగ్లా ఫోర్ట్‌ రాజ్‌భవన్‌కు కేవలం 300 మీటర్ల దూరంలోనే ఉంది. రోడ్లను దిగ్బంధించిన నిరసనకారుల నుండి తప్పించుకునేందుకే గవర్నరును విమానంలో తరలించారని ప్రజలు మండిపడ్డారు. గవర్నర్‌ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేశారు.
రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన వైఫల్యానికి ఈ ఘటన అద్దం పడుతోందని కాంగ్రెస్‌ విమర్శించింది. విమానాశ్రయం నుండి రాజ్‌భవన్‌కు కేవలం ఆరు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉన్నదని, ఈ కొద్ది దూరానికే గవర్నరును విమానంలో తరలించడాన్ని చూస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం విఫలమైనట్లు అర్థమవుతోందని ఆరోపించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad