Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుఇప్పట్లో 'స్థానికం' కష్టమే?

ఇప్పట్లో ‘స్థానికం’ కష్టమే?

- Advertisement -

– ముంచుకొస్తున్న హైకోర్టు గడువు
– ఇంకా 25 రోజులే సమయం
– స్థానిక ఎన్నికల ప్రక్రియ ఆలోపు పూర్తి అసాధ్యమే
– తేలని 42 శాతం రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌
– పంచాయతీరాజ్‌ చట్టం-2018 సవరణకు దక్కని గవర్నర్‌ ఆమోదం
– గడువు పెంచాలని హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో రాష్ట్ర సర్కారు
– మరో రెండు, మూడు నెలల గడువు కోరే అవకాశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సెప్టెంబర్‌ 30 లోపు స్థానిక ఎన్నికల నిర్వహణ కష్టమే. హైకోర్టు గడువు ముంచుకొస్తున్నా…ఇంకా 25 రోజుల సమయమే ఉన్నా నోటిఫికేషన్‌ ఊసే లేదు. ఎన్నికల ప్రక్రియను ఆలోపు పూర్తిచేయడం అసాధ్యమే. న్యాయ నిపుణుల సలహాల పేరుతో 42 శాతం రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ పెండింగ్‌లో పెట్టడం, పంచాయతీరాజ్‌ చట్టం-2018 సవరణ బిల్లు ఇంకా గవర్నర్‌ కోర్టులో ఉండటం వల్ల రాష్ట్ర సర్కారు ముందుకెళ్లలేని పరిస్థితి. రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల అంశం చుట్టూ రాజకీయాలు నడుస్తుండటం… కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సకాలంలో యూరియా ఇవ్వకుండా రాజకీయం చేయడం…దాని ప్రభావం క్షేత్రస్థాయిలో రేవంత్‌రెడ్డి సర్కారుపై కనిపిస్తుండటం.. అకాల వర్షాల నేపథ్యంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అపార నష్టం సంభవించడం..

వంటి పరిణామాల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను మరికొంత కాలం సాగదీసే ఆలోచనలో రాష్ట్ర సర్కారు ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. సెప్టెంబర్‌ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర సర్కారును ఆదేశించిన విషయం విదితమే. హైకోర్టు నుంచి మెట్టికాయలు పడకముందే…ఓవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతుందని చెబుతూనే బీసీ ఆర్డినెన్స్‌, పంచాయతీరాజ్‌ యాక్టు-2018 చట్ట సవరణ బిల్లు పెండింగ్‌లో ఉండటం వల్ల ఎన్నికల నిర్వహణకు ఆంటకం కలుగుతుందనే బలమైన వాదనను హైకోర్టు ముందు వినిపించాలనే ఆలోచనలో రాష్ట్ర సర్కారు ఉంది. మరో రెండు, మూడు నెలల గడువు కోరే అవకాశమున్నట్టు కూడా ప్రచారం జరుగుతున్నది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం తేలని నేపథ్యంలో అవసరమైతే మరికొంత కాలం ఎన్నికలకు వెళ్లకుండా ఆగుతామనే పీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ వ్యాఖ్యలు దానికి మరింత బలం చేకూరుస్తున్నాయి. అవసరమైతే గవర్నర్‌ను మరోసారి సంప్రదించాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. 42 శాతం రిజర్వేషన్లను అడ్డుకుంటూనే మరోవైపు బీసీలను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్న బీజేపీ ఎత్తుగడను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనే ఆలోచనలో కాంగ్రెస్‌ పార్టీ ఉంది.

ఓవైపు వర్షాలు…మరోవైపు యూరియా…
అకాల వర్షాలు, క్లౌడ్‌ బరెస్ట్‌లతో రాష్ట్ర ప్రజానీకం ఇంకా కోలుకోలేదు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రజానీకంపై తీవ్రంగా ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అపార పంట నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఎన్నికలపై ప్రజలు అంతగా ఆసక్తి చూపే పరిస్థితుల్లో లేరు. ఒకవేళ ఎన్నికలు నిర్వహించినా ప్రజల మూడ్‌ ప్రతికూలంగా ఉంటే తమకే ఇబ్బందికరమనే ఆలోచనలో అధికార పార్టీ ఉంది. మరోవైపు రాష్ట్రాన్ని యూరియా కొరత అట్టుడికిస్తున్నది. తమ పంటలను కాపాడుకునేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్క యూరియా బస్తా కోసం అన్నదాతలు రోజులతరబడి లైన్లలో నిలబడాల్సిన దుస్థితి నెలకొంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు సకాలంలో యూరియాను సరఫరా చేయకుండా జాప్యం చేసిన విషయం విదితమే. ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ సర్కారుపై దాని ప్రభావం పడింది. ఓవైపు వర్షాలతో పంటలు దెబ్బతినటం, మరో వైపు ఉన్న పంటల్ని కాపాడుకోవడంలో భాగంగా యూరియా కోసం పాట్లు పడటం వంటి సున్నిత అంశం రాజకీయంగా ఇబ్బందికరంగా మారే అవకాశముంది.

బందోబస్తు నిర్వహణ కష్టమే..
తెలంగాణలో ప్రతి సందర్భంలోనూ స్థానిక సంస్థల ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించడం ఆనవా యితీగా వస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే. ప్రతి ఊర్లోనూ 90 శాతానికిపైగానే పోలింగ్‌ శాతం నమోదవుతుంది. మంచం మీద నుంచి కూడా లేవలేని స్థితిలో ఉన్నవారు, విదేశాలు, వేరే రాష్ట్రాలకు బతుకుదెరువు కోసం వెళ్లిన వారు మినహా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రతి ఊర్లోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొం టాయి. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల కంటే స్థానిక ఎన్నికల నిర్వహణ సమయంలోనే బందోబస్తు కత్తిమీద సాములా మారుతుంది. అందుకే ప్రతి జిల్లాలోనూ మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహి స్తున్నారు. అప్పుడు బందోబస్తు ప్రక్రియ చేపట్టడం కొంత సులువవుతుంది. ఇప్పుడున్న 25రోజుల వ్యవధిలో నోటిఫికేషన్‌ వేయడం.. అభ్యర్థుల నామినేషన్‌.. ఉపసంహరణ.. గుర్తుల కేటాయింపు… ప్రచారానికి సమయం కేటాయించడం.. పోలింగ్‌..ఓట్ల లెక్కింపు ప్రక్రి య పూర్తి చేయడం కష్టమే. మరోవైపు ఈ నెల 21 నుంచి నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ వేడు కలు ప్రారంభంకానుండటంతో బందోబస్తు విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. అలాగైతే ఎన్నికల నిర్వహణ సరిగా చేపట్టలేదనే అపవాదును కాంగ్రెస్‌ ప్రభుత్వం మూటగట్టుకునే ప్రమాద ముంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణకు మరో రెండు, మూడు నెలల గడువు కావా లంటూ రాష్ట్ర సర్కారు సాంకేతిక, చట్టపరమైన కారణాలను చూపెట్టే ఆలోచనలో సర్కారు ఉంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad