అసోం సీఎం బిశ్వశర్మ వీడియోపై దుమారం
మత విద్వేషాలను పెంచుతోందంటూ ఆగ్రహం
ముఖ్యమంత్రిపై సీపీఐ(ఎం) పిటిషన్
అత్యవసర విచారణకు సుప్రీం ఆమోదం
సీఎంగా హిమంత అనర్హుడు : మాజీ ఎంపీ బృందా కరత్
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ మలేషియాలో పర్యటిస్తున్న సమయంలోనే అసోంలో బీజేపీ ఒక వివాదాస్పద వీడియోను పోస్ట్ చేసి ఆ తర్వాత దానిని తొలగించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ముస్లింలపై కాల్పులు జరుపుతున్నట్టు ఆ వీడియోలో చూపించారు. మలేషియా దేశం తన అధికార మతంగా ఇస్లాంను గుర్తిస్తోందన్న విషయం తెలిసిందే. హిమంత బిశ్వశర్మ రాష్ట్రంలోని ముస్లింలను మతపరంగా వేధింపులకు గురి చేస్తున్న విషయమూ విదితమే. అగ్నికి ఆజ్యం పోసిన చందంగా బిశ్వశర్మ వీడియో మత హింసను మరింత ప్రేరేపిస్తోందని, వీడియోను తొలగించి నంత మాత్రాన సరిపోదని విద్యావంతులు, మేధావులు, రాజకీయ పార్టీల నేతలు వ్యాఖ్యానించారు. బిశ్వశర్మ ఎయిర్ రైఫిల్‌ను గురి పెట్టినట్టు కన్పించే అసలు చిత్రాన్ని కృత్రిమ మేధ సాయంతో వేరే వీడియోతో కలిపి చూపించారు. ఎయిర్ రైఫిల్ నుంచి వచ్చిన తూటాలు టోపీలు, గడ్డాలు ఉన్న పురుషులను తాకుతున్నట్టు ఆ వీడియోలో చూపారు. ఈ చిహ్నాలు ఆ వ్యక్తుల మత విశ్వాసాలను ప్రతిబింబించేవిగా ఉన్నాయి. బిశ్వశర్మను ఓ పాశ్చాత్య చిత్రం హీరోగా చిత్రీకరిం చారు. ‘విదేశీయులు లేని అస్సాం’ అని ఆ చిత్రంపై రాసి ఉంది. ‘కనికరం లేదు’, ‘మీరు పాకిస్తాన్‌కు ఎందుకు వెళ్లలేదు?’, ‘బంగ్లాదేశీ యులకు క్షమాపణ లేదు’ అని అస్సామీ భాషలో రాసి ఉన్న వాక్యాలు కూడా ఆ వీడియోలో కన్పిస్తు న్నాయి. ‘ఈ రోజుల్లో దేశంలోని రాజకీయ నాయకుల ద్వేషపూరిత ప్రసంగాలను చూస్తుంటే హేమంత్ బిశ్వశర్మ ప్రసంగంలోని దుష్టత్వం దేశ ప్రజలను దిగ్భ్రాంతి పరుస్తోంది’ అని రిటైర్డ్ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఐఎఫ్‌ఎస్‌లతో కూడిన రాజ్యాంగ ప్రవర్తనా బృందం ఒక ప్రకటనలో విమర్శించింది. గతంలో కోర్టులు ఇచ్చిన ఆదేశాలను శర్మ ప్రసంగం ప్రత్యక్షంగా ఉల్లంఘించినందున, ఆయన కోర్టు ధిక్కరణకు పాల్పడినందున సుమోటోగా తీసుకొని విచా రించాలని సుప్రీంకోర్టును అభ్య ర్థించింది. కాగా బిశ్వశర్మ వీడి యోపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు సంధించాయి.
ముఖ్యమంత్రిపై సీపీఐ(ఎం) పిటిషన్.. విచారణకు సుప్రీంకోర్టు ఆమోదం
మతతత్వాన్ని రెచ్చగొట్టేలా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన ప్రసంగాలు, ఇటీవల తొలగించబడిన సోషల్ మీడియా పోస్టుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ సీపీఐ(ఎం) పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు మంగళవారం అంగీకరించింది. ముస్లింలుగా కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తుల యానిమేటెడ్ చిత్రాలకు ఆయన తుపాకి గురి పెడుతున్నట్టు ఉన్న ఆ పోస్టులో పక్కనే ‘పాయింట్ బ్లాంక్ షాట్’, ‘నో మెర్సీ’ వంటి పదాలు కూడా వున్నాయి. దీనిపై సత్వరమే విచారణ జరపాలని న్యాయవాది నిజామ్ పాషా మౌఖికంగా ప్రస్తావించిన వెంటనే చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఆమోదం తెలిపారు. రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ హిమంత బిశ్వ శర్మ ఇటువంటి ప్రసంగాలు చేశారని సీపీఐ(ఎం) తన పిటిషన్‌లో పేర్కొంది. అసోంలో నివసిస్తున్న ముస్లింలను లక్ష్యంగా చేసుకుని, వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ, వారిపై బహిరంగ హింసకు పాల్పడుతూ, ఘర్షణలు రెచ్చగొట్టే వాతావరణాన్ని సృష్టిస్తున్నారని తెలిపింది. ”హిమంత బిశ్వ శర్మ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలుసందర్భాల్లో పలు బహిరంగ ప్రసంగాలు చేశారు. స్టేట్‌మెంట్‌లు ఇచ్చారు. ఇవన్నీ ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వేదికలపై బాగా వ్యాప్తి చెందాయి. ఈ స్టేట్‌మెంట్‌లు విద్వేషాన్ని కలిగించేలా, మైనారిటీలను కించపరిచేలా ఉన్నాయి. తప్పుడు, స్టీరియోటైప్ ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. సామాజిక, ఆర్థిక బహిష్కరణలను రెచ్చగొడుతున్నాయి. వారిని వెలివేసే, హింసకు పాల్పడేలా ప్రోత్సహిస్తున్నాయి” అని పిటిషన్‌లో పేర్కొంది. ఫిబ్రవరి 7న వచ్చిన వీడియో రూపంలోని ఈ సోషల్ మీడియా పోస్టు బీజేపీ అషీషియల్ హ్యాండిల్ నుంచి వచ్చిందనీ, తీవ్ర వ్యతిరేకతలు వ్యక్తం కావడంతో వెంటనే ఆ వీడియోను తొలగించారని అప్పటికే ఆ వీడియో బాగా వైరల్ అయిందని సీపీఐ(ఎం) తెలిపింది.
సీఎంగా హిమంత అనర్హుడు మాజీ ఎంపీ బృందా కరత్
అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆ పదవికి అనర్హుడని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సీనియర్ నాయకురాలు బృందాకరత్ విమర్శించారు. శర్మ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మంగళవారం జంతర్ మంతర్‌లో సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర కమిటీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ నిరసనను ఉద్దేశించి మాజీ ఎంపీ బృందా కరత్ మాట్లాడుతూ బీజేపీ అసోం రాష్ట్ర కమిటీ అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచి విడుదలైన అభ్యంతరకరమైన వీడియోను తప్పుబట్టారు. ఈ వీడియోలో శర్మ మైనారిటీ ముస్లింలను లక్ష్యంగా చేసుకుని తుపాకీతో కాల్చడం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. అంతేకాక ఆయన తరుచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఆయన ముఖ్య మంత్రిగా అనర్హుడన్నారు. ఈ ఘటన మైనార్టీ సమాజంపై దాడి మాత్రమే కాదని, భారత రాజ్యాంగంపైనే కాల్పులు జరపడంతో సమాన మన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి హింస, మత విద్వేషాన్ని బహిరం గంగా ప్రదర్శించడం దేశ ప్రజా స్వామ్య, లౌకిక స్వరూ పానికి తీవ్రమైన ముప్పు అని ఆమె పేర్కొన్నారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి, ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేసి, తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవా లని బందాకరత్ డిమాండ్ చేశారు.
బీజేపీ అధికారిక హ్యాండిల్ పోస్టులో ఏమున్నదంటే..
2026 ఫిబ్రవరి 7న ఎక్స్‌లోని బీజేపీ అధికారిక హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో ఆ తర్వాత విస్తృతంగా ప్రచారం చేయబడింది. ఈ వీడియో అత్యంత స్పష్టమైన, ఆందోళన కలిగించే సాక్ష్యాధారంగా పేర్కొంది.



