Friday, October 17, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిదేశ పౌరుల కష్టార్జితం, మోడీ వ్యక్తిగత ప్రతిష్ట కోసమా?

దేశ పౌరుల కష్టార్జితం, మోడీ వ్యక్తిగత ప్రతిష్ట కోసమా?

- Advertisement -

ఆరెస్సెస్‌ ఆలోచనా ధోరణి గల గాడ్సే వారసులు, గాంధీజీ హత్యతో సంతృప్తి పడలేదు- దేశంలో నిరంతరం వారు ఎన్నో అఘాయిత్యాలు చేస్తూనే ఉన్నారు. హిందుత్వ పేరుతో ఒక తీవ్రవాదాన్ని దేశంలో విస్తరింపజేసి, దేశ పౌరుల్ని భయభ్రాంతుల్ని చేస్తున్నారు. దీనికి సామాన్యులు, మైనార్టీలే కాదు, ఉన్నత పదవుల్లో ఉన్న దళితులు కూడా బలవుతున్నారు. ఇటీవలి కాలంలో వారెంతకు తెగిస్తున్నారో చూస్తున్నాం కదా? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీదికి బూటు విసిరే ప్రయత్నం చేశారు. తనకు అలా చేయమని ”దైవశక్తి” ప్రేరణ ఇచ్చిందని – ఆ అఘాయిత్యానికి పాల్పడ్డ అడ్వొకేట్‌ చెప్పుకున్నాడంటే దానివెనక ఎవరున్నారో తెలియడం లేదా? ఆరెస్సెస్‌ వారికి బూట్లే ఎప్పుడూ స్ఫూర్తినిస్తున్నాయి. ఒకప్పుడు బ్రిటీషు అధికారుల బూట్లు వీరిని ఆకర్షించాయి. ఇప్పుడు తమ మెదడులో నుండి హిందుత్వ బూట్లు తీసి విసురుతున్నారు. ఎంతసేపటికీ వీరి ఆలోచనలు అక్కడే బూట్ల దగ్గరే ఉంటున్నాయి. పైకి ఎదగడం లేదు. ప్రతి మనిషి తలలో ఒక మెదడు అనేది ఉంటుంది, దాన్ని ఉపయోగించాలి- అని ఈ అంధభక్తులు ఇక ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో తెలియడం లేదు.

ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రధాని మోడీ పదహారవవాడు. ఇతని కన్నా ముందు పదిహేనుమంది దేశ ప్రధానులుగా పనిచేశారు. వారు విదేశాలకు పోతే అక్కడి ప్రధానులతోనో, అధ్యక్షులతోనో అధికారిక సమావేశాల్లో పాల్గొని తిరిగి వచ్చేవారు. ఒప్పందాలు, ఒడంబడికలు, విదేశీ వ్యవహారాలన్నీ అక్కడే చక్కదిద్దుకునే వారు. ఇప్పుడే ఈ ప్రధాని వచ్చాక ఏ దేశానికి పోతే ఆ దేశంలో ఉన్న భారతీయులతో (డయాస్పోరా) సమావేశాలు కావాలనే తప్పక ఏర్పాటు చేసుకుంటున్నాడు. వారు రోడ్లమీద నిలబడి ”మోడీ-మోడీ అని అరుస్తారు. విదేశీ కళాకారులు భారతీయ నృత్యాలు చేస్తారు. సంస్కృతంలో శ్లోకాలు చదివి భారత ప్రధానిని ఆహ్వానిస్తారు. అలా అరవండని వారికి చెప్తున్నదెవరూ? విదేశీయులకు భారతీయనృత్యాలు, సంస్కృత శ్లోకాలు ఎలా వస్తున్నాయి? ఎవరో పనిగట్టుకుని వారికి అవి నేర్పించి, శిక్షణనిచ్చి ఒక ప్రదర్శన ఏర్పాటు చేసి, రక్తి కట్టించడం లేదు కదా? సహజంగా ఎవరికైనా అనుమానం వస్తుంది. ఈ తతంగమంతా పదకొండేండ్లుగా ఎలా జరుగుతోందన్నది ఈ దేశ ప్రజలకు తెలియనివ్వడం లేదు.

అలాంటి ఆర్భాటాలకు విదేశాల్లో ఖర్చుపెట్టేదంతా భారత దేశపు డబ్బు. భారతపౌరులు టాక్సులు కట్టగా వచ్చిన డబ్బు. ప్రధాని మోడీ అలా అధికార దుర్వినియోగం చేస్తున్నాడన్నమాట! తన విదేశీ ఆరెస్సెస్‌- బీజేపీ- మనువాద కార్యకర్తల ద్వారా పెద్ద పెద్ద ఆడిటోరియంలలో జనాన్ని పోగేయించుకోవడం – సాంస్కృతిక కార్యకలాపాలు జరిపించుకోవడం -ఎయిర్‌ పోర్ట్‌ నుండి మెయిన్‌ రోడ్డు దాకా – అక్కడి నుండి ఆడిటోరియం దాకా భారతీయుల కష్టార్జితాన్ని వెదజల్లుతూ మోడీ తన వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకుంటున్నాడు. పదకొండేండ్లుగా ఆయన చేసిన, చేస్తున్న దేశసేవ ఇదే! ఎందుకిలా చేస్తున్నాడూ అంటే- తను స్వాధీనం చేసుకున్న ప్రముఖ మీడియా సంస్థల ద్వారా అలాంటి వార్తల్ని ప్రసారం చేయించి, ఈ దేశపౌరుల్ని ప్రభావితం చేయడానికి! దేశంలో అమాయకులు, అజ్ఞానులు, అవివేకులు ఎక్కువ కదా? వీరితో పాటు చదువుకున్న మూర్ఖుల సంఖ్య కూడా ఎక్కువే! వీరినందరినీ తన గోడీమీడియా ట్రాప్‌లో పడేసుకుని రెండు రకాల లాభాలు పొందుతున్నాడు.

ఒకటి: తన ఇమేజ్‌ను అనూహ్యంగా పెంచుకోవడం! రెండు: ఎలక్షన్లలో లబ్ధి పొంది, అధికారంలో కొనసాగుతూ ఉండడం! ఇంతచేసినా అనుకున్న ఫలితాలు రావడం లేదని తెలుసుకోగానే, ఇవియంల మాయాజాలం, ఓట్‌చోరీకి కూడా సిద్ధపడడం మనం చూశాం. అంతగొప్పగా ఎదిగిన ప్రపంచ నేత అయితే మరి విదేశీ ఛానళ్లు ఈయన ‘అరేంజ్డ్‌ ప్రోగ్రామ్స్‌’ ఎందుకు ప్రసారం చేయడం లేదూ? సరే, మరొక ఉదాహరణ చూడండి! ప్రసార భారతి ప్రసారం చేసే ప్రధాని ‘మన్‌కీ బాత్‌’ ప్రసంగాలు పిల్లలకు తప్పక వినిపించాలని నవోదయ స్కూళ్లకు, కేంద్రీయ విద్యాసంస్థలకు ప్రైమ్‌ మినిస్టర్స్‌ ఆఫీసు నుండి అధికారిక ఉత్తర్వులు పంపించారు కదా? అలాంటి పనులు అవసరమా? ప్రధాని స్థాయిలో ఉన్న పెద్ద మనిషి, సొంతడబ్బా ఇంతలా కొట్టుకోవాలా? విద్యార్థులకు తప్పక వినిపించాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు పంపడం దేనికీ? ప్రధాని ప్రీతిపాత్రమైన వాడయితే, ఆయన మాట్లాడే విషయాల్లో ఏమైనా సారముంటే విద్యార్థులేమిటీ? దేశ ప్రజలంతా చెవులు రిక్కించి వినేవారుకదా? అబద్దాలు, ఆర్భాటాలూ పక్కన పెట్టి ప్రజలకు ఉపయోగపడే పనులు కొన్నయినా చేస్తే ఎంతబావుండేదీ?

ఇక్కడి డబ్బు విదేశాల్లో వెదజల్లి, అక్కడ తను ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాలు ఇక్కడ చూయించి ఎన్నికలను ప్రభావితం చేయాలనుకున్న బీజేపీ ప్రభుత్వపు దుర్భద్ధి బట్టబయలైంది. ఒకవేళ ప్రతిపక్ష నేత విదేశాల్లో ఉపన్యసిస్తూ, దేశపరిస్థితి వివరిస్తే మాత్రం దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని, దేశ ప్రతిష్ట దిగజారుస్తున్నాడనీ బీజేపీ నేతలంతా మూకుమ్మడిగా దాడిచేస్తారు. వారు చేస్తున్న అఘాయిత్యాలు గోప్యంగా ఉంచాలని ప్రయత్నిస్తారు. కానీ, ప్రపంచ వ్యాప్తంగా తిరుగుతూ, నిజాల్ని సేకరిస్తూ పనిచేస్తున్న కొందరు స్వతంత్ర జర్నలిస్టులు, రచయితలు ఎప్పటికప్పుడు ప్రపంచ పౌరులకు విషయాలు చేరవేస్తూనే ఉన్నారు. చెప్పుకోవాలంటే ఈ పదకొండేండ్లలో భారతదేశానికి ఏ దేశంతోనూ సంబంధాలు గొప్పగా బలపడలేదు. గత ప్రభుత్వాలెప్పుడూ ప్రచారార్భాటాలకు ప్రాధాన్యమివ్వలేదు. గత భారత ప్రధానులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందంటే- వారు తీసుకున్న నిర్ణయాల వల్ల, వారి విజ్ఞత వల్ల, వారి ఉపన్యాసాల వల్ల ప్రపంచాన్ని ఆకర్షించారు.

ఇప్పుడున్న మన టెలిప్రాంప్టర్‌ ప్రధానికి గుజరాతీ, హిందీ తప్ప మరో భాషే రాదు. ఇంగ్లీషు భాష రాకపోవడం నేరమేమీ కాదు కానీ, ఆ వచ్చిన భాషల్లోనైనా ఒక అర్థవంత మైన, వివేకవంతమైన మాట మాట్లాడాలి కదా? ఒక దార్శనికుడిగా, రాజనీతిజ్ఞుడిగా, హుందాగా తన పదవి స్థాయిని, తన స్థాయిని నిలుపుకునే విధంగా ప్రవర్తిస్తూ ఉండాలి కదా.. ఏదీ మరీ? ఊరికే పండిట్‌ నెహ్రూ పట్ల అవాకులు, చవాకులూ మాట్లాడితే సరిపోతుందా? మాట్లాడిన దానికి రుజువేదని అడుగుతారు కదా ఈ దేశపౌరులు? కొన్ని రోజుల క్రితం జరిగిన విషయం చూడండి. తనకు 75 ఏండ్లు నిండాయని – ” పి.యం. మోడీకి శుభాకాంక్షలు తెలపండని – తన ఆఫీసు నుండి దేశవిదేశాల్లో ఉన్న సెలబ్రిటీలకు ఉత్తరాలు రాయించాడు. ఇలా ఎవరైనా శుభాకాంక్షలు అడుక్కుంటారా? విడ్డూరంగా ఉంది కదా? అదయిపోగానే ఇప్పుడు గుజరాత్‌ సీఎంగా, దేశ ప్రధానిగా మొత్తం కలిపి 25 ఏండ్లు అధికారంలో ఉన్నందుకు మరొక వేడుక జరుపుకుంటున్నారు. ఎన్నేండ్లు అధికారంలో ఉన్నామన్నది కాదు గదా – ప్రజలకు ఎంత మేలు చేశామన్నది కదా చూస్కోవాలి! వీటికి తోడు ఆరెస్సెస్‌ వందేండ్ల ఉత్సవాలు మరోవైపు ఘనంగా జరుపుకుంటున్నారు.

”ఆరెస్సెస్‌ – అంటే విజయం! ఆరెస్సెస్‌కు దేశమే ముఖ్యం. దేశసేవ చేయడానికి సంఫ్‌ు పరివార్‌ ఎప్పుడూ ముందుంటుంది. దేశమే ప్రథమం-అనేది ఆరెస్సెస్‌ విధానం ” అని అన్నారు ప్రధాని నరేంద్రమోడీ. ”దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఆరెస్సెస్‌ పాల్గొని విజయవంతంగా స్వాతంత్య్రం సాధించింది – అని కూడా ఆయన నిర్భయంగా మరో ఆబద్దాన్ని ప్రచారంలోకి తెచ్చారు. అయితే, ఇది తప్పు – అని చెప్పడానికి ప్రసిద్ధ చరిత్రకారులు అక్కర లేదు. ఇంగిత జ్ఞానం ఉన్న ఈ దేశ పౌరులందరికీ ఇది అబద్ధమని తెలుసు. ఆరెస్సెస్‌ లేకపోతే, ఈ పాటికి చైనా, పాకిస్థాన్‌లు మన దేశాన్ని ఆక్రమించేవి – అని ఒక దుష్ప్రచారం దేశంలో మొదలైంది. ఆరెస్సెస్‌ ప్రభోదించే ”దేశభక్తి” ఎలాంటిదంటే- 1.బ్రాహ్మణాధిపత్యం సుస్థిరం చేసుకోవడం 2.మనుధర్మాన్ని అమలు చేయడం 3.వారి ఎజెండా, వారు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతూ ఉంటే చాలు! 4.దేశ ప్రజల కష్టనష్టాలతో వారికి పనిలేదు.

ఆరెస్సెస్‌-బీజేపీ భక్తుల్ని అందభక్తులని ఎందుకంటారంటే వారికి ఆత్మ విమర్శ అనేది ఉండదు. నిజాలు తెలుసుకోరు. ఉదాహరణకు అంబానీ సంపద 97.4 బిలియన్లు. ఆదానీ సంపద 122.6 బిలియన్లు, అంధభక్తుల సంపద- ఐదు కిలోల రేషన్‌ కాకుండా ఆవుపేడతో పాటు ఆవు మూత్రం అదనం. అయినా అంధ భక్తులు నిజాలు గ్రహించరు. వాస్తవ ప్రపంచంలోకి రారు. ఈ మధ్య ఒక ప్రకటన కనిపించింది. అది ఇలా ఉంది. ” ఒక కొత్త సినిమా వస్తోంది. అందులో హీరో వయసు డెబ్బయి పైనే. ఇల్లూ ముంగిలి ఉండదు. భార్యాపిల్లలూ ఉండరు. 78 ఏండ్ల ఆదాయాన్ని పదకొండేండ్లలో ఊర్చేసి, దేశాన్ని అప్పులపాలు చేసిన ఘనుడు” – ఎవరో తెలుసుకోండి చూద్దాం! తెలుసుకున్న వారి ఖాతాలో 15లక్షలు వేస్తాం!! -అని – అందువల్ల ప్రయత్నించి తెలుసుకోదలిచిన వారు, తెలుసుకోవచ్చు- ”మోడీ ఈజ్‌ మై ఫ్రెండ్‌!” – అని ప్రకటించుకుంటూనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, భారతదేశంపై అధిక సుంకాలు ఎందుకు విధిస్తున్నాడు? హెచ్‌ 1బి వీసాల మీద, ఎందుకంత కక్ష సాధిస్తున్నారూ? అంటే – ట్రంపునకు కొంత టెంపరితనముందని వదిలేయలేం.

ఆయన లెక్క ఆయనకున్నట్లుంది. మోడీని స్నేహితుడని ప్రకటిస్తూనే పాకిస్థాన్‌ మిలట్రీ ఛీఫ్‌ను తన వైట్‌హౌస్‌కు ఆహ్వానించి, విందు ఏర్పాటు చేసి ఎందుకు గౌరవించాడూ? ”ఇండియా-పాకిస్థాన్‌ యుద్ధం నేనే ఆపాను” అని ట్రంప్‌ పదిసార్లు ప్రకటించినా మోడీ ప్రభుత్వం నోరు మెదపలేదెందుకూ? అమెరికాలోనూ, ఇతర దేశాల్లోనూ ఇండియన్‌ డైయోస్పొరాతో మోడీ డబ్బులు వెదజల్లి సమావేశాలు ఏర్పరుచుకుంటున్నాడని ట్రంప్‌ గ్రహించలేడా? వారి నిఘా సంస్థలు ఎంత సమర్థవంతంగా పనిచేస్తాయో బిన్‌ లాడెన్‌ను చంపినపుడే ప్రపంచం అర్ధం చేసుకుంది కదా? పనికిరాని వ్యక్తిగత ప్రతిష్టకు మోడీ ఇంతంత డబ్బు ఖర్చు చేస్తున్నాడయితే మాకు సుంకాలు (టారిఫ్‌లు) చెల్లించడానికి ఏమొచ్చింది? అని ట్రంప్‌ అనుకున్నాడేమో కదా! ట్రంప్‌ తనదేశం అమెరికా గురించి ఆలోచిస్తున్నాడనుకుందాం. మరి మనదేశ ప్రధాని మన దేశం గురించి, దేశ పౌరుల గురించి ఏం ఆలోచిస్తున్నాడూ? ప్రభుత్వం విఫలమైనంత మాత్రాన దేశపౌరులు విఫలం కాకూడదు కదా? ఇక తప్పదు – మనం, మన గురించి, మన రాబోయే తరాల గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది. తగిన కార్యాచరణకు పూనుకోవాల్సిన అవసరం కూడా వచ్చింది.
(ఈ దేశ ప్రధాని 25 ఏండ్లుగా అధికారంలో ఉన్న సందర్భంగా)
వ్యాసకర్త: నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ సలహా సంఘ
మాజీ సభ్యుడు-సాహితీవేత్త

డాక్టర్‌ దేవరాజు మహారాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -