Thursday, April 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డబ్బులు ఉంటేనే న్యాయం.. లేకపోతే అన్యాయం?

డబ్బులు ఉంటేనే న్యాయం.. లేకపోతే అన్యాయం?

- Advertisement -

– పోలీస్ శాఖ తీరుపై కుల వ్యతిరేక పోరాట సంఘం ఆరోపణలు
నవతెలంగాణ – కాటారం 

డబ్బులు ఉంటేనే న్యాయం… లేకపోతే అన్యాయం తప్పదా?— పోలీస్ శాఖ తీరు పై కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్కూరు శ్రీధర్ మాట్లాడుతూ.. కాటారం పోలీస్ స్టేషన్‌లో పేద ప్రజలకు న్యాయం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పేదలు, బలహీన వర్గాలకు చెందిన బాధితులు స్టేషన్‌ను ఆశ్రయించినప్పటికీ, వారి ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని, డబ్బున్న వారికే ప్రాధాన్యం ఇస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన దొంగతనాల కేసుల్లో కూడా పోలీసుల వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉందని, బాధితులకు సరైన సమాచారం ఇవ్వకుండా “కేసులు పెడుతున్నాం” అంటూ నోటీసులు ఇవ్వకుండా పంపిస్తున్నారని ఆరోపించారు.

దొంగతనాల కేసుల్లో దర్యాప్తు సరైన దిశలో సాగడం లేదని, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారని ఆరోపించారు.  అదేవిధంగా, కాటారం మండల కేంద్రం లో పలు చోరీలు జరిగినప్పటికి ఇప్పటివరకు సరైన దర్యాప్తు జరగకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇలాంటి కీలక ఘటనలపై స్పందించని పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతున్నట్లు పేర్కొన్నారు. 

ఇంకా, విలాసాగర్ ఇసుక క్వారీలో అక్రమంగా నడుస్తున్న ట్రాక్టర్లను పట్టుకొని అధికార పార్టీ నాయకులు ఫోన్ చేస్తే వదిలేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారం పోలీస్ శాఖ పనితీరుపైతీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.

అలాగే, అత్యవసర సమయంలో కూడా సామాన్యులు పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేస్తే అధికారులు స్పందించడం లేదని, ప్రభుత్వ ఫోన్ నంబర్లకు కాల్ చేసినప్పటికీ ఫోన్ ఎత్తకపోవడం దారుణమని విమర్శించారు. ప్రజల సేవ కోసం ఏర్పాటు చేసిన అధికారిక నంబర్లకు స్పందించకపోతే, ప్రజలు ఎలా సహాయం పొందుతారని ప్రశ్నించారు.

ఇక వేసవి కాలంలో పోలీస్ స్టేషన్‌కు వచ్చే సామాన్యులకు కనీసం తాగడానికి శుద్ధి చేసిన నీరు కూడా అందుబాటులో లేకపోవడం మరింత బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు గంటల తరబడి స్టేషన్‌లో ఉండాల్సి వచ్చినా కనీస సౌకర్యాలు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.

కాటారం పోలీస్ స్టేషన్‌పై వస్తున్న ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, సమగ్ర విచారణ జరిపించాలని కుల వివక్ష పోరాట సమితి డిమాండ్ చేసింది. తప్పులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని, బాధితులకు న్యాయం చేయాలని, పోలీస్ వ్యవస్థపై ప్రజల నమ్మకం పెరిగేందుకు సహకరించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -