Thursday, September 25, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఅస్మదీయుల కోసమేనా ఆరాటం?

అస్మదీయుల కోసమేనా ఆరాటం?

- Advertisement -

అలనాటి ‘మాయాబజార్‌’ సినిమా ద్వారా ‘అస్మదీయులు’, ‘తస్మదీయులు’ అనే పదాలు ప్రాచుర్యంలోనికి వచ్చాయి. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజలందరినీ సమదృష్టితో చూడాలనేదే ప్రజాస్వామ్యం. ప్రభుత్వరంగ సంస్థలు, చట్టబద్ధ సంస్థలు, రాజ్యాంగ సంస్థలు ఏవైనా వివక్ష లేకుండా తమ సేవలందిస్తూ ప్రజల విశ్వాసం చూరగొని ప్రజలకు చేరువ కావాలి. కానీ ఇటీవల పరిణామలను చూస్తే వాటి పాత్ర రోజురోజుకూ విస్మరిస్తుందా అనే అనుమానం కలుగక మానదు. కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ, పారిశ్రామికవేత్త సుబ్బిరామిరెడ్డి కొంతకాలంగా వార్తల్లో లేని వ్యక్తి. ఆయన గాయత్రి ప్రాజెక్టుల అధినేత. ఆ సంస్థ ఇంజనీరింగ్‌ కన్స్ట్రక్షన్‌ పనులు చేపడుతుంది. ప్రస్తుతం ఆ సంస్థ బాగా అప్పుల్లో కూరుకుపోయిందని నెలవారీ జీతాలు సిబ్బందికి ఇచ్చే పరిస్థితి లేదని, అందుకు కూడా అప్పు చేస్తున్నారన్న వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఆ కంపెనీ దివాలా తీసినట్టు బ్యాంకులకు తెలిపారు. బ్యాంకుల నుండి రూ.8100 కోట్లు రుణం తీసుకోగా నేషనల్‌ కంపెనీ ట్రైబ్యునల్‌ ఆ రుణంలో 5700 కోట్లు మాఫీ చేసి కేవలం 2400 కోట్లు వన్‌ టైం సెటిల్మెంట్‌ కింద అంటే ఒకసారి చెల్లిస్తే పూర్తి రుణమాఫీకి కోర్టు ఆమోదించింది. కెనరా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఇండిస్టియల్‌ డెవలప్మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తదితర సంస్థలు గాయత్రి సంస్థకు రుణం ఇవ్వగా ఇప్పుడు ఎన్‌సిఎల్‌టి ఆ రుణమాఫీ చేసింది. సాధారణంగా ఇంటి కోసం బ్యాంకులోన్‌ తీసుకున్నవారు ఒక నెల ఈఎంఐ ఆలస్యమైతే నోటీసులు, రెండు మూడు నెలలు కట్టకపోతే ఇంటిని స్వాధీనం చేసుకునే బ్యాంకు అధికారులు సుబ్బరామిరెడ్డి పట్ల ఇంత ఉదారత ప్రదర్శించడానికి తెరవెనుక జరిగిన ‘తతంగం’ ఏమిటో?

వేలకోట్లు మాఫీ చేయడం మామూలు విషయం కాదు. ఆ భారమంతా తిరిగి సామాన్యుడు మీదనే బాదుతారు సదరు బ్యాంక్‌ అధికారులు. రైతులను నమ్మని, ఉద్యోగు లను చిన్నచూపు చూసే బ్యాంకులు దివాలా తీసిన సంస్థకు మాత్రం అంత పెద్ద మొత్తం మాఫీ చేసి వన్‌ టైం సెటిల్మెంట్‌ అడగడం మనం ఏ విధంగా భావించాలి? ఎందుకు ఇంత పక్షపాతం? ఆయన ఆస్తులు ఎందుకు జప్తు చేయలేదో సదరు బ్యాంకు అధికారులే జవాబు చెప్పాలి. ఆయన కంపెనీని వేలంలో కొనడానికి కూడా ఏ ఇతర కంపెనీ ముందుకు రాకపోవడం గమ నార్హం. చట్టంలోని లొసుగులు ఉపయోగిం చుకుని వారు బ్యాంకులను బురిడీ కొట్టించి మోసగించి పబ్బం గడుపుకుం టున్నారు. సమాజంలో పేరుండి పెద్ద మనుషులుగా చలామణి అయ్యే వారే ఈ విధంగా ప్రజల సొమ్మును దోచుకోగలుగుతారు. వారికి ప్రభుత్వ బ్యాంకులు కూడా తమ వంతు సహకారాన్ని అందజేయడం దారుణం. విజరు మాల్యా గురించి దశాబ్దం క్రితం విన్నాం. విదేశాల్లో విలాసాలలో మునిగితేలుతున్న మాల్యాను మన దేశానికి కూడా తిరిగి రప్పించలేకపోతున్నాయి మన ప్రభుత్వాలు.

కానీ సుబ్బిరామిరెడ్డి మన కండ్లముందే తిరుగాడుతున్న మరో మాల్యా. సామాన్యుడి నుండి చిన్న మొత్తం అప్పును కూడా ప్రతిపైసా ముక్కుపిండి వసూలు చేసే బ్యాంకులు పెద్దమనుషులకు, బడా పారిశ్రామికవేత్తలకు, పలుకుబడి ఉన్నవారి విషయంలో ఈ విధంగా వ్యవహరించడం ఆశ్చర్యకరం. ఈ భారమంతా చివరికి తమ వినియోగదారులపైనే చాలా తెలివిగా వడ్డించే బ్యాంకు అధికారులు తమ చర్యలను ఏ విధంగా సమర్ధించుకుంటారు? సామాన్యుడికి సెక్యూరిటీ మొత్తంపై 80శాతం మాత్రమే రుణం మం జూరు చేసే బ్యాంకులు రూ.8100 కోట్ల మంజూరుకు ఏ విధమైన సెక్యూరిటీ పెట్టుకోలేదా అనేది సామాన్యుడి ప్రశ్న.

అలాగే హైదరాబాదు నగరంలో పరిసరాల్లో హైడ్రా సృష్టిస్తున్న ప్రకంపనలు మామూలుగా లేవు అదేమీ విచిత్రమో కానీ హైడ్రాకు శని, ఆదివారాలు సెలవులు రాగానే రంగంలోకి దిగి తన కూల్చివేతల కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నది. ఈ విషయమై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అనేకమార్లు చివాట్లు పెట్టినా హైడ్రా తీరు మారలేదు. హైడ్రాను స్థాపించింది హైదరాబాదు నగరంలోని ఆక్రమణలు చేసిన అక్రమార్కుల ఆట కట్టించడం, చెరువులు, నాలాలను పునరుద్ధరించడం కోసం. కానీ దానికి అస్మదీయుల పట్ల అవ్యాజమైన ప్రేమ, అనురాగం ఉన్నది. అధికార పార్టీకి సంబంధించిన వారి అక్రమ కట్టడాల జోలికి పోదు. పేదవారి గుడిసెలు చూస్తే దానికి ఆకలేసి బుల్డోజర్‌ రూపంలో వాటిని కూల్చివేసి బీద బిక్కిని రోడ్లపాలు చేస్తుంది. దయాదాక్షిణ్యాలు, కరుణా కటాక్షాలు లేకుండా వారి పట్ల కర్కశంగా ప్రవర్తించి కట్టుబట్టలతో వారి బతుకులను బజారుపాలు చేయడం దాని ముఖ్యమైన విధి! కానీ అదే గుడిసెల పక్కన ఉన్న పెద్దవారి ఆక్రమణల పట్ల చాలా మర్యాదగా ప్రవర్తిస్తుంది.

అవసరమైతే వారికి నోటీసులు జారీ చేస్తూ తగిన సమయమిస్తూ కాలయాపన చేస్తుంది. ఆక్రమిత ప్రభుత్వ భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం సబబే. సహజ వనరుల కబ్జాలు తప్పక నిరోధించవలసిందే. వర్షాలను నిరోధించలేం, ప్రకృతి వైపరీత్యాలను ఆపలేం. కానీ వరదలను నిరోధించవచ్చు.. హైడ్రాకు పండుగ పబ్బంతో సంబంధం లేదు. కోర్టుకి వెళ్లి స్టే తెచ్చుకోలేని వాళ్ల ఇండ్లను కూల్చివేసి నిరాశ్రయులను చేస్తుంది. వారికి దసరా సరదా లేకుండా చేసింది. తనపై వచ్చిన ఫిర్యాదులను కూడా అది పరిష్క రించిన దాఖలాలు లేవు. గాజుల రామారం చుట్టూ ఉన్న అనేక బస్తీలు కాలనీల్లో రెండు రోజుల క్రితం జరిగిందిదే. అదే సర్వే నెంబర్లో కనబడే ప్రభుత్వంలోని పెద్దల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను మాత్రం చూసీ చూడనట్టు వదిలేస్తున్నది హైడ్రా.
అదే విధంగా రీజనల్‌ రింగ్‌ రోడ్డు పేరుతో మరొక దందాకు తెరలేపుతున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఎనిమిది జిల్లాలు, 33 మండలాలు, 163 గ్రామాల గుండా పోయే ట్రిపుల్‌ఆర్‌ ప్లాన్‌లో చిన్న రైతుల నుండి భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తూ పెద్ద పెద్ద ఆసాముల, అస్మదీ యుల భూములకు రెక్కలు వచ్చే విధంగా రీ అలైన్మెంట్‌ ప్రతిపాదనలు చేస్తున్నది. అభివృద్ధి పేరున జరిగే ఈ ప్రతిపాదనలో పేద ప్రజలు భూ బాధితులుగా మారి వారి బతుకులు మరింత దిగజారిపోయే ప్రమాదముంది.

చిన్న రైతులకు కనీస నష్టపరిహారం అందేది కూడా అనుమానా స్పదమే. కానీ అస్మదీయుల భూములకు మంచి ధర పలికే విధంగా రీ అలైన్మెంట్‌ జరుగుతున్నది. ప్రతిపక్ష పార్టీలు పాత అలైన్మెంట్‌ ప్రకారమే రీజనల్‌ రింగ్‌ రోడ్‌ నిర్మించాలని కోరడమే కాదు పోరాటాలకు కూడా సిద్ధమవుతున్నాయి. దీన్నిబట్టి చూస్తే అస్మదీయుల కోసం పాలకులు, అధికారులు ఎంతకైనా తెగించడం చూస్తున్నాం. అందుకు సామాన్యుడు అంతిమంగా బాధితుడు అవుతున్నాడు. తమ వారి క్షేమం, సంక్షేమం మాత్రమే వారికి ముఖ్యం. సగటు మానవుడి సంక్షోభం అధికారంలోని పెద్దలకు రేఖమాత్రమైన లెక్కలేదు. చట్టబద్ధ సంస్థలు, రాజ్యాంగ సంస్థలు, స్వతంత్ర సంస్థలు ఈ విధంగా ఆశ్రిత పక్షపాతంతో వ్యవహరిస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నాయి.అధికారంలో ఉన్న వారి జేబు సంస్థల్లాగా ప్రవర్తిస్తున్నాయి. ఓట్లు చోరీ అయినా, బ్యాంకుల రుణమాఫీ అయినా, ఆక్రమణల పేరుతో ఇండ్లు కూల్చినా సామాన్యుడి జీవితం మరింత దుర్భరమే. తమవారికో నీతి, ఇతరులకు మరోనీతి అన్నట్లుంది వీరి రీతి. ‘అందరూ సమానమే..కొందరు మాత్రం ఎక్కువ సమానం’ అన్న జార్జ్‌ ఆర్వెల్‌ మాటలు మన ప్రభుత్వాలు నిజం చేస్తున్నాయి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతున్నది. ప్రజలారా..బహుపరాక్‌!

శ్రీశ్రీ కుమార్‌
9440354092

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -