పిల్లల బాధ్యత తల్లిదండ్రులది అయినప్పుడు తల్లి దండ్రుల బాధ్యత పిల్లలది కాదా! అంటే ‘కాదు’ అనే అంటున్నారు కొంత మంది యువత. మరికొందరైతే ‘మేమైనా వాళ్లని కని పెంచమన్నామా? విద్యా బుద్దులు నేర్పించమని అడిగామా? వాళ్లకు పిల్లలు కావాలి కాబట్టి కన్నారు. కన్నారు కాబట్టి పెంచారు. మామూలుగా పెంచితే సమాజంలో వారి పరువు పోతుందనే ఉద్దేశంతో చదివించారు. అందులో మా తప్పేముంది’ అనే వారు కూడా ఉన్నారు. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నానంటే అలాంటి కేసు గురించే ఈరోజు మీరు ఐద్వా అదాలత్(ఐలమ్మ ట్రస్ట్)లో తెలుసుకోబోతున్నారు.
రంగమ్మకు సుమారు 60 ఏండ్లు ఉంటాయి. భర్త అంజయ్యకు 65 ఏండ్లు ఉంటాయి. ఇద్దరూ కలిసి ఐలమ్మ ట్రస్ట్‌కు వచ్చారు. అంజమ్మ పరిస్థితి చూడటానికి దారుణంగా ఉంది. ‘ఈ వయసులో మేము ఎవరిపై ఆధారపడి జీవించాలి. వయసులో ఉన్నప్పుడు ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బు, ఆస్తి, బంగారం అంతా మా కొడుకులు తీసుకున్నారు. మేము కష్టపడి సంపాదించి కట్టుకున్న ఇల్లు కూడా మాకు లేకుండా చేశారు. మా ఇంట్లో నుండి మమ్మల్నే బయటకు పంపించేశారు. ప్రస్తుతం నేనూ, నా భర్త ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక మీ దగ్గరకు వచ్చాము. మాకు ఎలాగైనా నాయ్యం చేయండి’ అంటూ ప్రాధేయపడ్డారు.
‘అసలు ఏం జరిగింది, మీ పిల్లలు మిమ్మల్ని ఇంట్లో నుండి ఎందుకు పంపించారో చెబితే మేము వాళ్లను పిలిచి మాట్లాడతాము’ అంటే, వారు చెప్పింది ఏమిటంటే ‘మీ తర్వాత ఎలాగూ మీ ఆస్తి మొత్తం మాకే వస్తుంది. కాబట్టి మీరు పోయిన తర్వాత మాలో మేము గొడవ చేసుకోకుండా మీరు ఉన్నప్పుడే ఎవరికి ఎంత అనేది రాసి ఇస్తే బాగుంటుంది కదా!’ అన్నారు. దానికి ఒప్పుకొని మా ఇల్లు మొత్తం ఐదేండ్ల కిందట నా కొడుకులిద్దరికీ రాసి ఇచ్చాము. ఇన్ని రోజులు బాగానే ఉన్నారు. ఇప్పుడు మాత్రం ‘నా ఇంట్లో ఎందుకు ఉన్నారు. వాళ్ల ఇంట్లో ఉండొచ్చు కదా’ అంటూ ఒకరిపై ఇంకొకరు వంతులు వేసుకుంటున్నారు. మాకు వచ్చే పెన్షన్ కూడా వాళ్లే తీసుకుంటున్నారు’ అన్నారు.
అంజయ్య ఆరోగ్యం బాగోలేదు. ఆస్పత్రికి కూడా తీసుకెళ్లడం లేదు. ‘పోనీ మా పెన్షన్ డబ్బులు మా దగ్గరే ఉంటే నేనే ఎలాగో ఆస్పత్రికి తీసుకెళ్లేదాన్ని. మా ఇద్దరికీ కనీసం ఇంత అన్నం పెట్టడానికి కూడా మా కోడలు ఎన్నో మాటలు అంటుంది’ అంటూ రంగమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. దానికి మేము ‘మీ కొడుకులను పిలిచి మాట్లాడతాము’ అని చెప్పి పంపించాము. తర్వాత రోజు వాళ్ల పిల్లలు రమేష్, సురేష్‌లను పిలిచి మాట్లాడాము. రమేష్ చిన్న వ్యాపారం చేస్తున్నాడు. అతనికి ఇద్దరు పిల్లలు. భార్య ప్రయివేటు సంస్థలో ఉద్యోగం చేస్తుంది. అతనితో మాట్లాడితే ‘నేను చేసే వ్యాపారం చాలా చిన్నది. నేనూ నా భార్య ఇద్దరం కలిసి సంపాదిస్తున్నా మాకు సరిపోవడం లేదు. ఈ పరిస్థితుల్లో అమ్మానాన్న ఇద్దరినీ చూసుకోవాలంటే మాకు చాలా కష్టంగా వుంది. నా పిల్లలు పెద్ద చదువులు చదువుతున్నారు. వాళ్లకు ఫీజులు కట్టుకోవడానికే సరిపోతుంది. అదే సురేష్‌కి, చిన్న పిల్లలు. వాళ్లకు అంత ఖర్చు ఉండదు. అందుకే వాళ్ల దగ్గర ఉండమంటున్నా’ అన్నాడు.
సురేష్‌తో మాట్లాడితే ‘మా అన్న వ్యాపారం చేస్తున్నాడు. వదిన ఉద్యోగం చేస్తుంది. పిల్లల చదువు కూడా పూర్తి కావస్తుంది. ఇంకో ఆరు నెలల్లో ఉద్యోగంలో చేరతారు. కానీ నా పరిస్థితి అలా కాదు. నేను నా భార్యా ఇద్దరం కూడా ప్రయివేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాము. మాకు వచ్చే జీతం కూడా చాలా తక్కువ. పిల్లలను కూడా చూసుకోవాలి. అందుకే అమ్మానాన్నలను అన్నయ్య దగ్గర వుండమని చెప్పాను. అందులో తప్పేముంది’ అన్నాడు.
దానికి మేము ‘మరి వాళ్ల పెన్షన్ డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు’ అంటే మా సంపాదన మాకు సరిపోవడం లేదు. అందుకే తీసుకుంటున్నాము. మీరే అర్థం చేసుకోండి మా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో’ అన్నారు. దానికి మేము ‘పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వారి బాగోగులు చూసే బాధ్యత తల్లిదండ్రులకు ఎలాగైతే ఉంటుందో అలాగే పిల్లలు పెరిగి పెద్దయ్యాక తల్లిదండ్రులను చూసుకోవాలి. కాబట్టి మీరిద్దరూ ఒక్కో నెల ఒక్కక్కరు మీ అమ్మానాన్నలను చూసుకోండి. అలా కాకపోతే మీరు వాళ్ల ఇంట్లో వుంటున్నారు కాబట్టి వారికి ప్రతి నెల ఇంటి కిరాయి ఇవ్వండి. లేదంటే ఇల్లు ఖాళీ చేసి వేరే ఇల్లు చూసుకోండి. ఆ ఇల్లు అమ్మేసి వచ్చిన డబ్బుతో వాళ్లు హాయిగా ఉంటారు’ అన్నాము.
దానికి రంగమ్మ వెంటనే ‘అయ్యో ఇల్లు అమ్మితే పిల్లలు ఎక్కడ ఉంటారమ్మా? మేము పోయిన తర్వాత ఎలాగో ఇల్లు వాళ్లదే కదా! అప్పటి వరకు మీరు చెప్పినట్టు బయట కిరాయికి ఉండమని చెప్పండి. వాళ్లు ఇంట్లో ఉంటే మాకు కిరాయి ఎలాగూ ఇవ్వరు. ఇప్పటి వరకు మా వీలుమామా మార్చుకోవచ్చనే విషయం మాకు తెలియదు. ఇప్పుడు మార్చి రాస్తాము’ అన్నారు.
‘సరే రంగమ్మ, మీకు నచ్చినట్టు చేద్దురుగానీ. ఎలాగో మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. మిమ్మల్ని చూసుకోవడం లేదని వాళ్లపై కేసు కూడా పెట్టే హక్కు మీకుంది’ అన్నాము. దానికి ఆమె ‘అయ్యే కేసుల వరకు ఎందుకమ్మా? మీరే ఎలాగో వాళ్లకు అర్థమయ్యేలా చెప్పండి’ అంది.
‘చూశారా, మీరు వాళ్లకు ఇంత తిండి పెట్టడానికి కష్టపడుతున్నారు. కానీ వాళ్లు ఇప్పటికీ మీ గురించే ఆలోచిస్తున్నారు. మీ కోసమే ఇల్లు అమ్మేందుకు ఇష్టపడడం లేదు, మీ మంచి కోరి కేసు వద్దుంటున్నారు. మీరు మాత్రం వాళ్లను చూసుకోవడానికి ఇలా వంతులు వేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారు. మీకు తెలుసో లేదో తల్లిదండ్రులను చూడని పిల్లలకు ఆస్తిలో వాటా తీసుకునే హక్కు లేదు. మీకు రెండు నెలలు సమయం ఇస్తున్నాము. ఈ రెండు నెలల్లో ఇల్లు ఖాళీ చేసి వేరే ఇల్లు చూసుకోండి. వచ్చిన అద్దెలు, పెన్షన్‌తో మీ తల్లిదండ్రులు బతుకుతారు. వాళ్లకు ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. వాళ్లకు తోడుగా ఒక అమ్మాయిని పెట్టుకుంటారు’ అన్నాము. ఆరు నెలల తర్వాత రమేష్, సురేష్ ఇద్దరూ ఐలమ్మ ట్రస్ట్‌కు వచ్చి ‘మేడం బయట కిరాయిలు బాగా ఎక్కువగా ఉన్నాయి. మీరు చెప్పి నట్టు మేమే మా అమ్మానాన్నలను చూసుకుంటాము. అప్పుడు మీరు చెబితే మేము వినలేదు. ఇప్పుడు మా అమ్మానాన్న మమ్మల్ని రావొద్దంటున్నారు. మీరే ఎలాగైనా వాళ్లతో మాట్లా డండి. ఇకపై వాళ్లను ప్రేమగా చూసుకుంటాం’ అన్నారు. దానికి మేము మీరే మీ అమ్మానాన్నలను ఒప్పించండి. ప్రస్తుతం వాళ్లు హాయిగా ఉంటున్నారు. ఈ విషయంలో వాళ్లను మేము బలవంతం చేయలేము’ అని చెప్పి పంపించాము.
వై వరలక్ష్మి, 9948794051