No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeఎడిట్ పేజిమళ్లీ అధర్మమేనా?

మళ్లీ అధర్మమేనా?

- Advertisement -

కర్నాటక ధర్మస్థలంలో దారుణాలు, మానవ మహిళా కంకాళాల అన్వేషణ దేశంలోనే తీవ్ర సంచలనం కలిగించింది. అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవలసి వచ్చింది. సనాతన ధర్మ పరిరక్షకులుగా ఊరేగేవాళ్లు వూరుకున్నా.. వామపక్షాలు, మహిళా, ప్రజా సంఘాలు ఆందోళన చేశాయి. ఒకటికి రెండు సిట్‌లను నియమించిన ప్రభుత్వం తవ్వకాల పనిలో పడింది. పదకొండు చోట్ల తవ్వితే ఒకచోటనే అస్తిపంజరం బయటపడిందంటూ తర్వాత సన్నాయి నొక్కులు మొదలైనాయి. ఈ దారుణాలను బయటపెట్టిన మాజీ పారిశుధ్య కార్మికుడి ఉద్దేశాలపై కథనాలు మొదలెట్టారు. హిందూ పుణ్యక్షేత్రమైన మంజునాథ ఆలయం ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర అనీ అసలు ఆ ఆలయం జైన ధర్మకర్తల చేతుల్లో వుండటమేమిటని మరో మీమాంస లేవనెత్తారు. పోలీసు స్టేషన్లలో కేసుల మూసివేత నుంచి చుట్టుపక్కల ఇళ్లలో తప్పిపోయిన వారి గురించిన ఫిర్యాదుల వరకూ ఎన్ని వున్నా అక్కడ పెద్దగా ఏమీ దొరకలేదనే కథలు వ్యాప్తిలో పెట్టారు. సీపీఐ(ఎం) వంటివి గట్టిగా ఈ విషయంపై నిజాలు తేల్చాలని పట్టుపడుతున్నా పాలక పార్టీలు మౌనముద్ర దాల్చాయి. పాలక పార్టీగా వున్న కాంగ్రెస్‌ కూడా జంకుతోనే అడుగులు వేసింది. బీజేపీ-ఆరెస్సెస్‌ల హడావుడి చూసి అదీ వెనక్కు తగ్గుతున్నది. ఇక చివరగా ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌ వచ్చిన ఫిర్యాదుపైనే సందేహాలు వెలిబుచ్చడంతో ఇది అధికారిక విధానంగా మారింది. తమ పార్టీ రాజ్యసభ ఎంపీ వీరేంద్ర హెగ్గడే ధర్మకర్త గనక బీజేపీ ముందునుంచే వెనక్కు లాగుతున్నది. నెమ్మదిగా ఈ దర్యాప్తుకు తవ్వకాలకు స్వస్తి చెబుతారనే సందేహాల మధ్య ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సంపాదకీయం రాస్తూ మత రాజకీయాల కోసం మారణహోమం ఆరోపణలను వదలిపెట్టవద్దని హెచ్చరించింది. ఈ క్రమంలో మరెన్ని ఘోరాలు ఏ రూపంలో బయటికి వస్తాయో తేల్చడం అవసరమని పేర్కొంది.

ఐపిఎస్‌కు సుప్రీం పాఠం
ఐఏఎస్‌, ఐపిఎస్‌ అధికారులుగా వున్నవారు చాలామంది నిబంధనల ప్రకారం పని చేయకుండా అధికారంలో వున్నవారి అడుగులకు మడుగు లొత్తడం, అక్రమాలకు సహకరించడం రోజూ చూస్తున్నదే. అధికార యంత్రాంగాన్ని కూడా రాజకీయ విధేయతలను బట్టి విభజించ చూస్తున్న స్థితి. ఈ నేపథ్యంలో ఓ ఐపిఎస్‌ అధికారికి సుప్రీంకోర్టు గట్టిగా మొట్టికాయలు వేసింది. మీరు రాజ్యాంగానికి విధేయంగా వుంటారా లేక రాజకీయ బాసులకా అని ప్రశ్నించింది. బీహార్‌లో అశోక్‌ మిశ్రా స్పెషల్‌ పోలీస్‌ విభాగంలో పనిచేస్తున్నారు. కొన్నేళ్ల కిందట ఒక హత్య కేసులో శిక్షననుభవిస్తున్న నిందితులను విడుదల చేయొచ్చని ఆయన సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ సమర్పించడంపై ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. గతేడాది ఒక హత్య కేసులో నిందితులను విడుదల చేయాలని హైకోర్టు తీర్పునిచ్చింది. అంతకు ముందు జిల్లాలో అధికారిగా వుండి వారిని జైలుకు పంపిన మిశ్రానే ఇప్పుడు స్పెషల్‌ బ్రాంచి తరపున ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఆ నిర్ణయం తీసుకుంది. హతుని భార్య దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్‌ అమానుల్లా ధర్మాసనం మిశ్రా తీరును తప్పుపట్టింది. మీరే అధికారిగా వుండి పోలీసు దర్యాప్తు జరిపిన దానికి భిన్నంగా ఇప్పుడెలా చెబుతారని ఆక్షేపించింది. లేఖ ద్వారా ఆయన క్షమాపణ చెబితే కుదరదని సముఖానికి రప్పించింది. చివరకు అన్ని విధాల క్షమాపణ చెబు తున్నానని, ఎవరో చెప్పింది వినడం వల్ల సమాచార లోపంతో ఈ పొరబాటు చేశానని ఆ ఎస్పీ మొరపెట్టుకున్నారు. ఈసారికి వదిలేస్తున్నాం గానీ దీన్నించి మీరు నేర్చుకోవలసింది నేర్చుకోండని న్యాయమూర్తులు ఆమె అభ్యర్థన ఆమోదించారు.

తెలుగు తమిళ పోరాటమేంటి?
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరపున సి.పి రాధాకృష్ణన్‌ పోటీ చేస్తుండగా ఇండియా వేదిక వామపక్షాల నుంచి జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి రంగంలో వున్నారు. మొదట ఇండియా వేదిక తరపున కూడా తమిళనేత అన్నాదురై వంటి వారిని నిలబెట్టాలని సూచనలు వచ్చినా చివరకు నిలవలేదు. కరుడుగట్టిన ఆరెస్సెస్‌ వాది సి.పిని తాము బలపర్చే ప్రసక్తి లేదని డిఎంకె తేల్చిచెప్పడంతో ఈ ఘట్టం ముగి సింది. జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి దక్షిణాది వారే కావడం, న్యాయమూర్తిగా నేపథ్యం పోటీ స్వరూపాన్నే మార్చేశాయి. మానవ హక్కులు, రాజ్యాంగం వంటివి ముందుకొచ్చి నిలిచాయి. అయితే ఇప్పటికీ కొంతమంది కావాలని ఇదేదో తమిళ తంబికి తెలుగు పెద్దకు మధ్య యుద్ధమన్నట్టు చిత్రించేందుకు విఫలయత్నం చేస్తున్నారు. అయితే వాస్తవానికి తెలుగువారిగా ఆయనను ప్రాంతీయ పార్టీలు తప్పక బలపర్చాలి కదా? కానీ తెలుగుదేశం, జనసేన, ఎన్‌డిఎ భాగస్వాములుగా మొదటే సి.పి ని మోయడం మొదలెట్టాయి. ఇక సుదర్శనరెడ్డి తెలంగాణకు చెందినవారు గనక ఎప్పటికప్పుడు ప్రాంతీయ కార్డు తీసే బీఆర్‌ఎస్‌ ఎన్డీయేలో భాగస్వామి కూడా కాదు. అయినా బలపర్చాలి కదా? అంటే సూటిగా చెప్పకుండా మీనమేషాలు లెక్కపెడుతున్నది. చివరకు తటస్తంగా వుండొచ్చని కూడా సంకేతాలు వదులుతున్నది. ఏపీలో వైసీపీ అధినేత జగన్‌దీ ఇదే పరిస్థితి. కాకపోతే ఆ పార్టీ సూటిగా మద్దతు ప్రకటించేసింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నిక జరగాలని వారు ఒక వింత వాదన చేస్తుంటారు. ఈ మద్దతుకుగాను కేంద్రం నుంచి రాష్ట్రావసరాలేవీ సాధించుకోలేదని ఒకరినొకరు అనుకునేవారు గానీ ఇప్పుడు ఇద్దరూ పోటీపడి మోయడానికే సిద్ధమైనారు. మరో వంక చంద్రబాబు, కేసీఆర్‌, పవన్‌, జగన్‌ కూడా సుదర్శన్‌ రెడ్డికే మద్దతునివ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. కానీ అది లాంఛనమే నని అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీతో ఎప్పుడో బ్రహ్మముడి బిగించుకున్నాయి కదా?
– పీపీ

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad