Saturday, April 4, 2026
E-PAPER
Homeజాతీయంమీరా మాకు చెప్పేది ?

మీరా మాకు చెప్పేది ?

- Advertisement -

దేశంలోని ఏ సూచీలో కేరళం వెనకబడిందో చెప్పగలరా..?
దుర్భర దారిద్య్రాన్ని జయించిన తొలి రాష్ట్రం కేరళం
పాలన, సంక్షేమం గురించి మాకు పాఠాలు అక్కర్లేదు
మీరే స్వయంగా వచ్చి నేర్చుకోండి
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన పినరయి విజయన్‌

కేరళం గురించి ఇటీవల తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన అవమానకరమైన వ్యాఖ్యలు పూర్తి నిరాధారమని కేరళం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పష్టం చేశారు. తన స్వంత రాష్ట్రంలో పేదల ఇండ్లపై బుల్డోజర్లు ప్రయోగించే వ్యక్తి కేేరళంకు సామాజిక పురోగతి గురించి బోధించడానికి ప్రయత్నించడం విచారకరమని వ్యాఖ్యానించారు. కేరళం సుస్థిరమైన, సర్వతోముఖాభివృద్ధి నమూనాను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న వారి వాణిగా ఆయన మారారని విజయన్‌ విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

తిరువనంతపురం : ‘కేరళంలో అవినీతి, తప్పుడు పాలన గురించి ఆరోపణలు చేయడానికి ముందుగా, తెలంగాణ సీఎం తన అధికారిక డేటాను చెక్‌ చేసుకోవాలి.భారతదేశంలో అత్యంత తక్కువగా అవినీతి కలిగిన రాష్ట్రం కేరళ అని ఆయనకు తెలియదా? నిటి అయోగ్‌ ఎస్‌డీజీ సూచీ (2023-24)లో 79 పాయింట్లతో కేరళ మొదటి స్థానంలో నిలబడింది. తెలంగాణా ఆరవ స్థానంలో వుంది. ‘మీ సొంత రాష్ట్రం తప్పులు దాచిపెట్టుకోవడానికి కేరళంను ఇలా అపహాస్యం చేయడం తీవ్ర విచారకరం.’ అని కేరళం సీఎం విజయన్‌ విమర్శించారు. నిటి అయోగ్‌ ప్రకారం, కేరళం దారిద్య్ర రేటు కేవలం 0.55శాతంగా వుంది. ఇది భారతదేశంలోనే అత్యంత తక్కువ. 2025 చివరి నాటికి, భారతదేశంలో దుర్భర దారిద్య్రాన్ని సంపూర్ణంగా నిర్మూలించిన తొలి రాష్ట్రంగా కేరళం అవతరించింది.

తెలంగాణా దారిద్య్ర రేటు 5.88 శాతంగా వుంది. కేరళం 95.3 అక్షరాస్యతా రేటుతో ముందంజలో వుండగా, తెలంగాణా ఇప్పటికీ 76.9శాతంతో వెనుకబడే వుందని విజయన్‌ విమర్శించారు. కాంగ్రెస్‌కు పరోక్షంగా సాయపడేలా కేరళంలో రాజకీయ యాడ్‌లపై కోట్లాది రూపాయిలు ఖర్చు పెట్టడానికి బదులుగా తన సొంత రాష్ట్రంలో దారిద్య్రాన్ని నిర్మూలించడంపై, అక్షరాస్యతను మెరుగుపరచడంపై ఆయన దృష్టి సారించారాదా? అని విజయన్‌ ప్రశ్నించారు. కేరళంలో శిశు మరణాల రేటు (ఐఎంఆర్‌) 5కి తగ్గింది. అమెరికాలో ఈ రేటు 5.6గా వుంది. అక్కడ కన్నా కేరళంలో మెరుగైన పరిస్థితి నెలకొంది. తెలంగాణాలో ఐఎంఆర్‌ దాదాపు నాలుగు రెట్లు అధికంగా వుంది. మా క్రియాశీలమైన ప్రజారోగ్య వ్యవస్థ కారణంగా సగటు భారతీయుడి కన్నా మలయాళి ఐదు నుంచి ఏడు సంవత్సరాలు ఎక్కువగా జీవిస్తాడని విజయన్‌ పేర్కొన్నారు.

ఇటీవలనే, గతేడాది సెప్టెంబరు 16న, తెలంగాణాకు చెందిన రెవిన్యూ, సర్వే అధికారుల ఉన్నత స్థాయి బృందం కేరళంకు గర్వకారణమైన డిజిటల్‌ భూ రికార్డుల వ్యవస్థ ‘ఎంటె భూమి’ (ఐఎల్‌ఐఎంఎస్‌)ని అధ్యయనం చేయడానికి తిరువనంతపురంలో పర్యటించింది. తన సొంత ప్రభుత్వం అనుకరించడానికి ప్రయత్నిస్తున్న కేరళం పాలనా నమూనాను ముఖ్యమంత్రి బహిరంగంగా ఎద్దేవా చేయడం ఎంత కపటత్వం? అని విజయన్‌ ప్రశ్నించారు. కేరళం, కేంద్ర ప్రభుత్వం మధ్య ‘బంధం’ వుందంటూ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తి అసంబద్ధమైనవి. బీజేపీకి బీ టీమ్‌గా వ్యవహరించడమన్నది వెన్నెముక లేని కాంగ్రెస్‌ చేసే పని. కేరళం అభివృద్ధిని ఇరుకున పెడుతున్న కేంద్ర ఆర్థిక దిగ్బంధనం, రుణ పరిమితుల్లో కోతలపై ఒక్క మాట మాట్లాడడంలో కూడా కాంగ్రెస్‌ విఫలమైందని విమర్శించారు.

రాష్ట్రం పట్ల అనుసరిస్తున్న ఈ నిర్లక్ష్య వైఖరిని వ్యతిరేకిస్తూ కేరళం సాగించిన తీవ్ర పోరాటాన్ని, నిరసనలను ఆయన చూడలేదా? లేదా తమ రాష్ట్రానికి బీజేపీ చేస్తున్న ద్రోహాన్ని సమర్ధించుకుంటున్నారా?అని విజయన్‌ ప్రశ్నించారు. వేతనాలు, పెన్షన్లు ఇవ్వడంలో పదే పదే జాప్యం చేసే ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి, కేరళంకు బోధించాల్సిందేమీ లేదని విజయన్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మూతబడిన ట్రెజరీలు, నెలల తరబడి పెండింగ్‌లో వుండే సంక్షేమ పెన్షన్లతో కూడిన యూడీఎఫ్‌ శకం ఇక ముగిసింది. పాలనకు, ప్రజల సంక్షేమానికి సంబంధించి నిజమైన పాఠాలు నేర్చుకోవడానికి కేరళంకు రావాలని తెలంగాణా ముఖ్యమంత్రిని సాదరంగా స్వాగతిస్తున్నామని విజయన్‌ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -