Saturday, May 24, 2025
Homeఆటలుమహ్మద్‌ షమి కష్టమే?

మహ్మద్‌ షమి కష్టమే?

- Advertisement -

ఫిట్‌నెస్‌ సమస్యతో ఇంగ్లాండ్‌ టూర్‌కు దూరం
నేడే ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు భారత టెస్టు జట్టు ఎంపిక

న్యూఢిల్లీ : మరో పది రోజుల్లో ఐపీఎల్‌ హంగామా ముగియనుండగా.. ఆ వెంటనే రెడ్‌బాల్‌ జోరు ఊపందుకోనుంది. జూన్‌ 11 నుంచి ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జరుగనుండగా.. జూన్‌ 20 నుంచి భారత్‌, ఇంగ్లాండ్‌లు ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌లో పర్యటించే టీమ్‌ ఇండియా టెస్టు జట్టును నేడు (శనివారం) ఎంపిక చేయనున్నారు. ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సమావేశం కానున్న ఆల్‌ ఇండియా సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ.. మధ్యాహ్నం 1.30 గంటలకు మీడియా ముందుకు రానుంది. ఐదు మ్యాచుల సిరీస్‌కు భారత టెస్టు జట్టును సెలక్షన్‌ కమిటీ చైర్మెన్‌ అజిత్‌ అగార్కర్‌ ప్రకటించనున్నాడు.
కొత్త కెప్టెన్‌ ఎవరు?
సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఎదుర్కొంటున్న కీలక సవాళ్లలో కెప్టెన్సీ ఒకటి. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి టెస్టులకు అనూహ్యంగా వీడ్కోలు పలికారు. దీంతో టాప్‌ ఆర్డర్‌లో రెండు బ్యాటింగ్‌ స్థానాలు సహా కెప్టెన్సీ సమస్యకు పరిష్కారం చూపించాల్సిన బాధ్యత సెలక్షన్‌ కమిటీపై పడింది. యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌, పేస్‌ దళపతి జశ్‌ప్రీత్‌ బుమ్రా కెప్టెన్సీ రేసులో ఉన్నారు. కొత్త కెప్టెన్‌తో కలిసి సెలక్షన్‌ కమిటీ మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
షమికి లేదు చోటు?
భారత పేస్‌ విభాగంలో కీలక పేసర్‌ మహ్మద్‌ షమి. ఫిట్‌నెస్‌ సమస్యలతో బాధపడుతున్న మహ్మద్‌ షమి ఈ ఏడాది ఐపీఎల్‌లో తేలిపోయాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఐపీఎల్‌18లో ఆడుతున్న మహ్మద్‌ షమి రెడ్‌బాల్‌ ఫార్మాట్‌కు అవసరమైన ఫిట్‌నెస్‌ సాధించలేదని సమాచారం. శుక్రవారం లక్నోలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఉండగా.. షమి ఫిట్‌నెస్‌ పర్యవేక్షణకు బీసీసీఐ ఓ వైద్యాధికారిని అక్కడికి పంపినట్టు సమాచారం. సుదీర్ఘ స్పెల్స్‌ పాటు బౌలింగ్‌ చేయగల ఫిట్‌నెస్‌ షమలో లేదని వైద్య నివేదికలో తేల్చిగా.. షమిని ఇంగ్లాండ్‌ టూర్‌కు ఎంపిక చేయటం లేదని సమాచారం.
కుర్రాళ్లకు చాన్స్‌
విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ రిటైర్‌మెంట్‌తో టెస్టు జట్టులో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ, నం.4 బ్యాటర్‌గా విరాట్‌ కోహ్లి స్థానాలను భర్తీ చేయటం కుర్రాళ్లకు కఠిన సవాల్‌. శుభ్‌మన్‌ గిల్‌ను నం.4 స్థానంలో ఆడించి.. ఓపెనర్‌గా, నం.3 బ్యాటర్‌గా సాయి సుదర్శన్‌, అభిమన్యు ఈశ్వరన్‌లకు అవకాశం కల్పించే సూచనలు కనిపిస్తున్నాయి. టెస్టు క్రికెట్‌కు అవసరమైన నిలకడ, ఏకాగ్రత సాయి సుదర్శన్‌లో పుష్కలంగా ఉన్నాయి. ఐపీఎల్‌లోనూ అద్భుత ప్రదర్శన చేస్తున్న సాయి సుదర్శన్‌ తొలిసారి భారత టెస్టులో చోటు ఆశిస్తున్నాడు. అజిత్‌ అగర్కార్‌ ప్యానల్‌ సైతం సాయి సుదర్శన్‌ను ఇంగ్లాండ్‌కు పంపించేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది!.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -