ొ ‘సెక్షన్ 17ఎ చట్టబద్ధత’పై
సుప్రీం భిన్నాభిప్రాయాలు
న్యూఢిల్లీ : ప్రభుత్వ అధికారులపై విచారణకు ముందస్తు అనుమతి తప్పనిసరా, కాదా అనే అంశంపై సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. ముందస్తు అనుమతి తప్పనిసరి అని అవినీతి నిరోధక చట్టంలోని 17ఎ సెక్షన్ పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఈ సెక్షన్ చట్టబద్ధతపై బెంచ్ సభ్యులు భిన్నంగా స్పందించారు. అవినీతి నిరోధక చట్టం-1988లోని సెక్షన్ 17ఎను చట్టవిరుద్ధమని జస్టిస్ బి.వి. నాగరత్న తేల్చగా, లోక్‌పాల్ లేదా లోకాయుక్త వంటి స్వతంత్ర సంస్థల ద్వారా ఈ అనుమతిపై నిర్ణయించాలని మరో న్యాయమూర్తి జస్టిస్ కె.వి.విశ్వనాథన్ పేర్కొన్నారు. 2018లో చట్ట సవరణ ద్వారా తీసుకువచ్చిన ఈ నిబంధన, నిజాయితీపరులను రక్షించడానికి బదులుగా అవినీతి అధికారులపై క్రిమినల్ కేసులను అణచివేయడానికి ఉపయోగపడుతోందని అన్నారు. వాస్తవానికి నిజాయితీపరులైన అధికారులకు ఇటువంటి సెక్షన్ల ద్వారా ఎటువంటి రక్షణ అవసరం లేదని జస్టిస్ నాగరత్న అభిప్రాయపడ్డారు. అయితే ఈ నిబంధనను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించి, కొట్టివేయడమంటే, పసిబిడ్డకు స్నానం చేయించి, ఆ నీటితో పాటూ బిడ్డను కూడా విసిరేసినట్లే అవుతుందని జస్టిస్ విశ్వనాథన్ వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ ఉద్యోగి అధికారికంగా తన విధులను నిర్వర్తించే సమయంలో చేసిన సిఫార్సులపై సంబంధిత అధికారుల నుండి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి విచారణ లేదా దర్యాప్తు నిర్వహించరాదని సెక్షన్ 17ఎ పేర్కొంటోంది. ఈ సెక్షన్‌ను సవాలు చేస్తూ సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ అనే ఎన్‌జిఒ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఈ ఎన్‌జిఓకు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రభుత్వం నుండి అనుమతులు రాకపోతే ఈ నిబంధనలు అవినీతి నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేసినట్లేనని ప్రశాంత్ భూషణ్ వాదించారు. అప్పుడు ఆ సెక్షన్ ప్రభుత్వాన్ని జడ్జిగా మారుస్తోందని అన్నారు. అందువల్ల దాన్ని కొట్టివేయాల్సిందేనన్నారు. సిబిఐకి సంబంధించిన కేసుల్లో సుమారు 40శాతం మాత్రమే సెక్షన్ 17ఎ కింద దర్యాప్తు కోసం ముందస్తు అనుమతి పొందాయని ప్రశాంత్ భూషణ్ కోర్టుకు తెలిపారు. ”దేశానికి తమ ప్రాణాలను అర్పించే అధికారులు ఉన్నారు. అటువంటపుడు వారి అధికారాల నిర్వహణలో భాగంగా వారు చేసిన సిఫార్సులు లేదా చర్యల వల్ల వారు బూటకపు ప్రాసిక్యూషన్లకు బలి కాకుండా మనం ఎలా హామీ కల్పించగలమని జస్టిస్ విశ్వనాధన్ గతేడాది ఆగస్టులో ఈ కేసు విచారణ చివరి రోజున వ్యాఖ్యానించారు.
సెక్షన్ 17ఎ ఒక రక్షణ కవచం వంటిదని, అది లేకపోతే ప్రభుత్వ ఉద్యోగిపై ద్వేషం వున్నవారెవరైనా ఎన్‌జిఒ ద్వారా ఆ అధికారిపై కేసులు నమోదు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మరియు అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి పేర్కొన్నారు.
ప్రభుత్వ అధికారుల ప్రాసిక్యూషన్‌కు ముందస్తు అనుమతి అవసరమా ?
- Advertisement -
- Advertisement -



