భారత ఎన్నికల సంఘం(ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా) విశ్వసనీయత కోల్పోతున్నదని ప్రపంచ వ్యాపితంగా మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. బీహార్‌లో ‘సర్’ తతంగంతో మొదలైన ఈ చర్చ ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ కర్నాటకకు సంబంధించి ముందుకుతెచ్చిన వాస్తవాలతో మరింత తీవ్రరూపం దాల్చింది. ఇందుకు సమాధానం ఇవ్వకపోగా సిఇసి రాహుల్‌గాంధీపైన దాడి ప్రారంభించింది. గడువులు విధించి బెదిరింపులకు దిగింది. మరోవైపున బీజేపీ అధినేతలు అధికార ప్రతినిధులు ఇసి కన్నా తీవ్రంగా దాన్ని సమర్థించే పని మొదలుపెట్టారు.ఆ విధంగా అనుమానాలకు ఆజ్యం పోస్తున్నారు. ఉదాహరణకు ఇటీవల లండన్ పర్యటన సందర్భంలో రాహుల్ ఫైనాన్షియల్‌టైమ్స్‌కు ఇంటర్య్వూ ఇస్తూ మొదటిసారిగా దేశంలో ఎన్నికల ప్రక్రియ సందేహాస్పదమైపోయిందనీ, ప్రజల ఆమోదం లేనివారు అధికారం చేపట్టడానికి సాధనమవుతున్నదనీ విమర్శించారు. ఆ వె ంటనే బీజేపీ నేతలు ఇది దేశ వ్యతిరేకమైన చర్యగా ధ్వజమెత్తారు. ఓట్ చోర్,ఓట్‌చోర్‌కీ చౌకీదార్, ఓటు దొంగలకు ఇసి రక్షణ వంటి ఆయన నినాదాలు రాజకీయ సంచలనానికి దారితీస్తుంటే అటు బీజేపీ రాజకీయంగానూ ఇసి చట్టభాషలోనూ ఎదుర్కొవడానికి తంటాలు పడుతున్నాయి. వాస్తవానికి ఎన్నికల సంఘం ఏం చేసినా అందరినీ కలుపుకొని చర్చించి చేయవలసి ఉంటుంది. కానీ ప్రస్తుతం అలాంటివేమీ లేకుండా కేవలం ఏకపక్షంగా ముందుకుపోతున్నది. బీజేపీ తప్ప మిగిలిన అన్ని పార్టీలూ వ్యతిరేకిస్తున్నాయంటేనే అది ఎవరికి మేలు చేసే విధంగా ఉందో అర్థమైపోతుంది. ఆఖరుకు ఆరెస్సెస్ కూడా మరింత బాహాటంగా ఇసిని వెనకేసుకువచ్చింది. దేశంలో జనాభా పొందిక మారిపోకుండా చూడటంలో ఇసి పాత్ర కీలకమైందని ప్రశంసలు కురిపించింది. కానీ ప్రతిపక్షాలపైన ఇలాంటి ఎన్ని దాడులు చేసినా ఇసిపై విమ ర్శలు ఆగకపోగా కొత్త కొత్త ఆధారాలు లభిస్తున్నాయి. కర్నాటకలోని మహదేవ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపునకూ బీజేపీ విజయానికి సంబంధం ఉందని రాహుల్ వాదించారు. అలాగే అలండ్ నియోజక వర్గంలో 6018 ఓట్ల తొలగింపుకోసం కుట్రపూరితంగా దరఖాస్తులు అందాయని ఆయన సాక్ష్యాధారాలు మీడి యాకు అందజేశారు. కాంగ్రెస్ అక్కడ అధికారంలో ఉంది గనక తాము కోరినా ఇసి నుంచి సరైన సమాధానం రాలేదని కూడా వెల్లడించారు.
బాధ్యతా రాహిత్యం
దీనిపై జరగాల్సిందేమిటి? స్వతంత్ర ఎన్నికల పరిశీలకుడు యోగేంద్రయాదవ్ చక్కగా వివరించారు. ‘మీ యంత్రాంగం లోపభూయిష్టంగా ఉంది. తప్పుపేరుతో లేనిఫోన్ నెంబర్‌తో ఒక వ్యక్తి వేల ఓట్ల తొలగింపు కోరవచ్చునని తేలింది. ఆ పనిచేసిన వ్యక్తి ఎవరు పూర్వాపరాలేమిటి తేల్చడానికి ఇసి ఎందుకు సహకరించడం లేదు?అని యాదవ్ ప్రశ్నించారు. ఆన్‌లైన్ ద్వారా ఏ వ్యక్తి ఓట్ల తొలగింపు చేయలేడని ఎన్నికల సంఘం చెబు తున్న మాట ఎంతవరకూ సరైందో తేల్చడం ఎలా? ఒకవైపున మేమే ఈ విషయంలో మొదట ఫిర్యాదు చేశా మని ఇసి అంటున్నది. ఏ తప్పుజరక్కపోతే మీరెందుకు ఫిర్యాదు చేయాల్సి వస్తుంది?’ అని యాదవ్ నిలదీస్తున్నారు. ‘మీరు ఎఫ్‌ఐఆర్ దాకా వెళ్లివుంటే రాష్ట్ర సిఐడి 18 లేఖలు రాసినా ఎందుకు జవాబివ్వలేదు?ఆ వివరాలు పంచుకోవడానికి అభ్యంతరమేమిటి?’ అంటూ యోగేంద్రయాదవ్ గుప్పిస్తున్న ప్రశ్నలు అర్థవంతమైనవి, తోసిపుచ్చలేనివి.ఆ దొంగ దరఖాస్తులు ఏ నెంబర్‌నుంచి వచ్చాయో చెప్పాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపైనే ఉందనడం నిస్సందేహం.రాహుల్‌గాంధీపై రాజకీయదాడి చేసినా, రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘం పవిత్రత గురించి బీజేపీ సుద్దులు చెప్పినా ఎవరూ తీవ్రంగా తీసుకోరు. ఎందుకంటే సుప్రీంకోర్టుతో సహా అన్ని రాజ్యాంగ వ్యవస్థలపైన రోజూ దాడిచేస్తున్నది బీజేపీనే. ఈ మధ్యనే ఉపరాష్ట్రపతి విషయంలో కూడా ఏం చేశారో చూశాం.
సందేహాలతోనే ‘సర్’
కర్నాటక కన్నా ముందు బీహార్‌లో ‘సర్’తతంగంతో ఈ వివాదం మొదలైంది. వాస్తవానికి రాజ్యాంగంలో సర్ పేరే లేదు, ఎన్నికల సంఘం నిబంధనల్లోనూ సర్‌కు ఇంత ప్రాధాన్యత లేదు. బీహార్ సర్‌పై సుప్రీంకోర్టు కూడా సందేహాలు సవాళ్లు లేవనెత్తింది. నెల రోజులలోపు పదకొండు పత్రాల్లో ఒకటి చూపించితేనే ఓటు హక్కు నిలబడుతుందని బెదిరించిన ఇసి ఆధార్‌కార్డును ఎందుకు తీసుకోలేదు? ఒకటికి రెండుసార్లు అత్యున్నత న్యాయస్థానం వెంటపడిన తర్వాతనే ఆధార్ కూడా చూపించవచ్చునని అంగీకారం తెలిపింది. ఆధార్ కార్డు దేశంలో నివసిస్తున్నట్టు చెబుతుందే గానీ భారత పౌరులని చెప్పదు.అయితే ఓటు హక్కు పౌరసత్వం లింకు రాజ్యాంగంలో లేదే? ఆ పరీక్ష మరో విధంగా చేయాలి, ఈ రెంటినీ కలిపి మైనార్టీ మతాలపై ద్వేషం, ఓట్ల తొలగింపు చేయాలన్నది సంఘ పరివార్ భావన అయితే ఇసి చర్చ ఖచ్చితంగా ఆదిశలోనే నడిచింది. సెప్టెంబరు30న తుది ఓటర్ల జాబితా ప్రకటించాక మీరు నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలితే మేము రద్దు చేయడానికి వెనకాడబోమని సుప్రీంకోర్టు హెచ్చరించింది. అందుకోసం ఆగకుండానే దేశమంతటా సర్ అమలు చేస్తామని ఇప్పుడు ఇసి ఆదేశాలు జారీచేసింది. వచ్చే జనవరిలోగా ఎన్నికలు జరిగేవన్నీ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలే. తమిళనాడు, కేరళ, బెంగాల్ వంటివి. తెలంగాణలోనూ సర్ అమలు చేస్తామంటున్నారు. ఏపీిలో ఉండడానికి ఎన్డీయే ఉన్నా సర్ ఆఖరుదాకా ఆగకుండా ఇప్పుడే చేసేయాలని టీడీపీ కోరింది. కానీ వారు తెలంగాణలో మొదలు పెడుతున్నట్టు కనిపిస్తుంది. మొత్తం ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి ఉండకపోతే ఇసి ఇంత సులభంగా దారికి వచ్చేది కాదు. అయినా సాంకేతిక సాకులతో ఎప్పటికప్పుడు పక్కదోవ పట్టించే ప్రయత్నాలు సాగిస్తూనే ఉంటుందని మర్చిపోరాదు. దేశంలోని ఓటర్లలో సగంమంది ఏ పత్రం చూపించాల్సిన అవసరం లేదని ఇసి గొప్పగా ప్రకటించింది.అంటే సగం మంది చూపించాలనే కదా? 2002ను కొలబద్దగా తీసుకోవడమంటే గత ఇరవై ఏండ్లుగా ఓటేస్తున్నవారిని కూడా అనుమానితుల జాబితాలో చేర్చడమే అవుతుంది. సుప్రీం జోక్యం చేసుకోకపోతే మొదట ఇసి ఆదేశాల ప్రకారం ఆధార్ చెల్లుబాటయ్యేది కాదు. ఈ నిర్ణయాలన్నీ ఏ దురుద్దేశం లేనివని అనుకోగలమా? ఇప్పటికైనా అన్నీ సక్రమంగా జరిగిపోతాయని విశ్వసించడం ఎలా? సత్సంకల్పమే అయితే తేదీతో సహా సర్ ప్రారంభానికి సిద్ధం కమ్మని చెప్పిన ఇసి దేశమంతా ఇంత పెద్ద ప్రక్రియ చేసేప్పుడు ఎందుకని ముందే అఖిలపక్షం జరిపి సలహాలు సూచనలు తీసుకుని ఉండేది కదా? పైకి ఏమీ అనలేకపోయినా అంతగా మోసే టీడీపీ వంటి పార్టీ కూడా కేంద్రం ఆలోచనలనూ ఇసి పథకాలను పూర్తిగా బలపర్చడానికి సిద్ధంగా లేదు. సర్ ముందే పూర్తి చేయాలనీ పారదర్శకంగా జరగాలని అంటున్నది. వైసీపీ అధినేత జగన్ మాత్రం రాబోయే స్థానిక ఎన్నికలను కేంద్ర దళాల పర్యవేక్షణలో జరపాలని చెబుతున్నారు.
రోగమొకటి,మందొకటి
తమాషా ఏమంటే ఓట్ చోరీ, సర్ వంటి విషయాల్లో విమర్శలను బేఖాతరు చేస్తున్న ఇసి, ఎవరూ ఇప్పుడు అడగని సంస్కరణలనూ మార్పులు చేర్పులను ముందుకుతెచ్చి హడావుడి చేస్తున్నది. ఇవిఎంలలో వివిపాట్‌లు వందశాతం వినియోగించాలని, దాని సర్క్యుట్‌లో ఓటు నమోదు తర్వాత వివిపాట్ రావాలని సూచన వస్తే పట్టించుకోవడం లేదు. కానీ అభ్యర్థుల బొమ్మలు రంగులో పెద్ద సైజులో పెట్టడం గొప్ప మా ర్పుగా చెబుతున్నది. మంచిదే కావచ్చు గానీ అదేమీ కీలకం కాదు. తర్వాత రిజిస్టర్డు పార్టీల జాబితాలోంచి కొన్నిటిని రద్దుచేసింది. గుర్తులనూ అటూ ఇటూ మార్చింది. ఇక ఇప్పుడు పోస్టల్ బ్యాలట్ లెక్కింపులో ముందు వెనకలు చేసి ఇది 30వ సంస్కరణగా ప్రకటించుకుంటున్నది. ఎప్పటినుంచో పోస్టల్ బ్యాలట్‌లెక్కింపు ముందు జరుగుతుంటే దాన్ని మార్చింది ఇసినే. నిరసనల తర్వాతనే ఆచరణలో దాన్ని సవరించుకుంది. బీహార్ ఎన్నికలతో మొదలుపెట్టి ఇవిఎంల చివరి దఫా లెక్కింపు ముందే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కావాలని తాజా నిర్ణయం తీసుకుంది. అసలు వదలి కొసరు చూపించినట్టు ఓట్ల చౌర్యం, తొలగింపు, ఇవిఎంల తారుమారు వంటి ఆరో పణలపై సూటిగా చర్చలు చేయకుండా ఇలాంటి వాటితో మురిపించాలనుకుంటే చెల్లుబాటవు తుందా? చాలాసార్లు ఎన్నికల సంఘం సమాధానాలు, ప్రకటనలూ కూడా రాజ్యాంగ భాషలో గాక రాజకీయ భాషలో ఉండటం, చర్యలు తీసుకుంటామని బెదిరించడం విమర్శకు గురవుతున్నది.
జమిలి జపం మామూలే!
ఇవన్నీ చాలక మోడీ సర్కార్ అసలైన ఆలోచన జమిలిపైనా కసరత్తు కొనసాగిస్తూనేవుంది. కొంతమంది మాజీ న్యాయమూర్తులు కూడా ఇందుకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. తాజాగా ఈ అంశంపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ సంఘం(జెఎసి) ఆర్థికవేత్తల అభిప్రాయం సేకరించింది, యుపిఎ హయాంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడుగా పనిచేసిన మాంటెక్ సింగ్ ఆలూవాలియా వ్యతిరేకించారు. జమిలి వల్ల ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందనే వాదనతో ఆయన ఏకీభవించలేదు. ఇప్పటివరకూ జమిలి లేకపో యినా ఆర్థికరంగం బాగానే పనిచేస్తున్నదని ఆయన న్నారు. పైగా ఒకేసారి అన్ని ఎన్నికలు జరపడం వల్ల రాష్ట్ర సమస్యలు మరుగున పడిపోయి ప్రజల అవసరాలు వెనకపట్టుపడతాయని ఆయన అభిప్రాయ పడ్డారు. మరోవైపు బీజేపీకి అనుకూలమైన ఆర్థికవేత్త అరవింద్ పనగారియా జమిలిని ఆకాశానికెత్తారు. మాటిమాటికీ ఎన్నికల వల్ల జనాకర్షక పథకాల ప్రకటనలతో ఆర్థిక భారాలు పెరిగిపోతాయని వ్యాఖ్యానించారు. ఈ చర్చలన్నీ కూడా రాజ్యాంగ మూలస్ఫూర్తి అయిన సమాఖ్య విధానాన్ని పట్టించుకోకపోవడం విశేషం. సర్వం పిఎంవో నుంచే జరగాలని చూస్తున్న మోడీరాజ్‌కు ఇది బాగా సరిపోయే ప్రతిపాదన. అన్యథాశరణం నాస్తి అంటూ మోడీనే పట్టుకు ఊరేగుతున్న సంఘపరివార్, బీజేపీలు వచ్చే రెండు ఎన్నికలకు కూడా ఆయనే తమ ప్రధాని అభ్యర్థి అంటుంటే సీనియర్ నాయకుడు రాజ్‌నాథ్‌సింగ్ ఏకంగా 2047లో కూడా మోడీనే తమ ప్రధాని అని సెలవిచ్చారు. ఒకే దేశం,ఒకే కార్డు, ఒకే పన్ను, ఒకే మతం, ఒకే భాష, ఒకే పార్టీ, ఒకే నేత, ఒకే మోడీ అనడం బీజేపీకి అవసరం కావచ్చు. కానీ రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ ఎందుకు ఒప్పుకుంటాయి? ఆ దిశలో పనిచేసుకు పోతున్న ఎన్నికల సంఘం పోకడలను ఎందుకు సహిస్తాయి?
తెలకపల్లి రవి
ఇసి విన్యాసాలతో విశ్వసనీయత సాధ్యమా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES