మండలంలో 1173 మంది అర్హులు
37 మందికే మంజూరైన సాయం
మిగతా కూలీలకు ఎదురుచూపులే
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలో చాలామంది అర్హులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఆర్థికసాయం అందలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా భూమిలేని ఉపాధిహామీ కూలీలకు సంవత్సరానికి రూ.12వేలు అందిస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా పైలెట్ ప్రాజెక్ట్ కింద మండలంలో నాచారం గ్రామం ఎంపిక చేసింది. మండలంలో 15 గ్రామాల్లో 1173 మంది కూలీలను అర్హులుగా గుర్తించారు. వీరిలో 37 మందికి రూ.12 వేల చొప్పున ఆర్థికసాయం కూడా అందించారు.మిగతా అర్హులైన ఉపాధిహామీ కూలీలు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
పథకానికి అర్హతలివే..
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది.భూమి లేని ఉపాధిహామీ కూలీలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఏడాదిలో కనీసం 20 రోజులు ఉపాధిహామీ పని చేసి ఉండాలి. మండలంలో 1173 మంది అర్హులుంటే 37 మందికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులుగా గుర్తించారు. మండల వ్యాప్తంగా 37 మంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులుగా గుర్తించారు. ఈ సంవత్సరం జనవరి 26న లబ్దిదారులకు రూ.12వేల చొప్పున అందించారు. అయితే, ఈ పథకాన్ని పైలెట్ గ్రామంగా ఎంపిక చేసిన గ్రామానికి మాత్రమే పరిమితం చేసి మిగతా గ్రామాల్లోని అర్హులను విస్మరించారు. దీంతో తమకె ప్పుడు ఆత్మీయ భరోసా? అని అర్హులంతా ఎదురు చూస్తున్నారు.
ప్రభుత్వం నుంచి నిధులు రాగానే చెల్లిస్తాం: ఉపాధిహామీ..ఎపిఓ హరీష్
ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి గ్రామాల వారీగా అర్హు లైన ఉపాధిహామీ కూలీలను ఎంపిక చేశాం. జాబితాను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించాం. పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన గ్రామానికి లబ్దిదారులకు ఆర్థికసాయం నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. మిగ తావారికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగానే చెల్లిస్తాం.



