Tuesday, March 31, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఅదే పరిష్కారమా?

అదే పరిష్కారమా?

- Advertisement -

పశ్చిమాసియా ఉద్రిక్తతలు మన వంటగదిలోనూ మంటపెట్టాయి. హర్మూజ్‌ జలసంధిలో చమురు రవాణాకు అంతరాయం ఏర్పడటంతో దేశంలో గ్యాస్‌, ఇంధనాల కొరత నానాటికీ తీవ్రమవుతోంది. వంటగ్యాస్‌ (ఎల్పీజీ) సిలిండర్లకు తీవ్ర కొరత ఎదురవుతోంది. ఇప్పటివరకు అదంతా హంబక్‌ అంటూ కొట్టి పారేసిన కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీకి పీఎన్జీ, కిరోసిన్‌ను ప్రత్యామ్నాయంగా చూపే ప్రయత్నం చేస్తోంది. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాలలోనూ గ్యాస్‌ వాడకం పెరిగింది. అక్కడ గ్యాస్‌ సరఫరా మరింత అస్తవ్యస్తంగా ఉంటుంది. కాగా, అందుబాటులో ఉన్న పైప్‌ గ్యాస్‌ విధానానికి మారాలని కేంద్ర ప్రభుత్వం వినియోగదారులకు సూచించింది. లేనిపక్షంలో ఎల్పీజీ సరఫరా నిలిపివేసే అవకాశం ఉన్నట్లు కూడా హెచ్చరించింది. దీనికోసం మూడు నెలలు గడువిచ్చింది.

మార్చి 24న కేంద్ర పెట్రోలియం,సహజవాయువుల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మార్పు ఐచ్ఛికం కాదని, తప్పనిసరని ఆ ఉత్తర్వులలో స్పష్టం చేసింది. తాజాగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అన్ని రాష్ట్రాలకు కిరోసిన్‌ పంపిణీ చేయాలని చమురు మంత్రిత్వశాఖ ఆగమేఘాల మీద గెజిట్‌ నోటిఫికేషన్‌ సైతం విడుదల చేసింది. దీన్నిబట్టి దేశంలో గ్యాస్‌, ఇంధన కొరత ఉందన్న విషయాన్ని కేంద్రప్రభుత్వం పరోక్షంగా అంగీకరించినట్టే. తగిన మౌలిక సదుపాయాలు పట్టణాలలోనే అన్నిచోట్లా లేవు. ఆ ప్రాథమిక సదుపాయాలు ఉన్న ఫళాన కల్పించడం అసాధ్యమని ప్రభుత్వానికి తెలుసు. అయినా పీఎన్జీకి మారిపోండని చెప్పడం మోడీ ప్రభుత్వ బూటకాలలో మరొకటి మాత్రమే. పశ్చిమాసియా సంక్షోభం వల్ల నౌకాయానానికి ఇబ్బంది ఉండొచ్చునని ప్రభుత్వం ముందే ఊహించి తగిన ఏర్పాట్లు చేసి ఉంటే గొడవే ఉండేది కాదు.

అసలు ప్రతిపక్షాలతో ఈవిషయం చర్చించనే లేదు. అదేమీ చేయకుండా జనం అనవసరపు ఆందోళన వల్ల అవసరం లేకపోయినా సిలిండర్లు తెప్పించుకుంటు న్నారంటూ నెపం జనం మీదకు నెట్టే ప్రయత్నం చేస్తుంది.సరైన విదేశాంగ విధానం, ఇంధన విధానం రూపొందిం చడంలో విఫలమైన ప్రభుత్వ వాదనల తీరు ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా ఉంది. అంతా సవ్యంగానే ఉందని చెప్తున్న ప్రభుత్వం చీకటి బజారును, దొంగ నిలవలను ఎందుకు ఆపలేకపోతోందన్నదీ ఓ ప్రశ్నే.ప్రభుత్వం ఎల్పీజీ బదులు పీఎన్జీ వాడాలని చెప్తోంది. అయితే దానికి సిద్ధంగా ఉన్నామా?అది తక్షణ పరిష్కారం అవుతుందా? అన్న ఆలోచన ప్రభుత్వంలో కనిపించడం లేదు. పీఎన్జీ సరఫరా చేయడానికి అన్ని నగరాల్లో ఏ ఏర్పాటులేదు. పూర్తిగా పీఎన్జీ మీద ఆధారపడిన నగరాలు ఏపాటి గనక!
పీఎన్జీకి మారడం వల్ల ప్రయోజనాలు, ధర కూడా తక్కువన్న మాట నిజమే.

కానీ, మౌలిక సదుపాయాలు లేవన్నది అంతకంటే నిజం. పీఎన్జీ మరింత సురక్షితమైనదని చెబుతున్న కేంద్ర ప్రభుత్వానికి దానికి తగిన వ్యవస్థ లేదన్నది తెలియదా? ఆ సదుపాయాలు సమకూర్చకుండా లేడికి లేచిందే పరుగు అన్నట్టు పీఎన్జీకి మారిపోండని ఉచిత సలహా ఇవ్వడమంటే మరో బూటకాన్ని ప్రచారంలో పెట్టడమే. ఇది కుదిరే వ్యవ హారం కాదని ఇట్టే అర్థమవుతోంది. పీఎన్జీ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి ఒక్కో ఇంటికి ఐదు నుంచి తొమ్మిది వేల రూపాయల ఖర్చవుతుంది. అంత ఖర్చు ఒకే విడతలో భరించడం ఎన్ని కుటుంబాలకు సాధ్యం? దేశంలో చమురు కొరత లేదని కేంద్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. సరఫరాపై ఆంక్షలు పెడుతోంది. గతంలో ఇరవై రోజులకు ఉన్న గ్యాస్‌బుకింగ్‌ ఇప్పుడు మరో ఐదు రోజులకు పెంచింది. అప్పుడు మాత్రమే వినియోగదారులు గ్యాస్‌ బుకింగ్‌ చేసుకోవాలని ఆదేశించింది.

హోటళ్లు, పారిశ్రామిక అవసరాలకు సరఫరా నిలవడంతో ఇప్పటికే కొన్ని హోటళ్లు, మెస్‌లు, రెస్టారెంట్లు మూసివేశారు. హాస్టళ్లు, మెస్‌లపై ఆధారపడిన విద్యార్థులు, చిరుద్యోగులు అవస్తలు పడుతున్నారు. నిరంతరం ధరల పెరుగుదల, క్షీణిస్తున్న వాస్తవ ఆదాయాలతో కుంగిపోతున్న మధ్య తరగతి, శ్రామికులకు ఈ పరిణామాలు శరాఘాతం. తన ప్రజావ్యతిరేక విధానాలను కట్టిపెట్టి పెంచిన ధరలను కేంద్రం తగ్గించాలి. వంటగ్యాస్‌పై పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని వదులుకోవాలి. ఆ మేరకు ప్రజల భారం తగ్గిం చాలి. అమెరికా సామ్రాజ్యవాద విధానాల ముందు లొంగిపోయిన మోడీ ప్రభుత్వం… పశ్చిమాసియా వివాదమే గ్యాస్‌ కొరతకు, ధరల పెంపునకు కారణమని సమర్థించు కోవడం దాని స్వయంకృత అపరాధాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నమే. యూఎస్‌-ఇజ్రాయిల్‌ యుద్ధోన్మాద విధానాలను ప్రతిఘటించాలి. పెట్రోలు, వంట గ్యాస్‌ కొరతను నివారించడంతో పాటు ధరల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఇప్పటికైనా కాలయాపన చేయకుండా సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానిదే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -