Friday, April 10, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలురైతు కమిషన్‌ ఖతం ?

రైతు కమిషన్‌ ఖతం ?

- Advertisement -

పనితీరుపై సీఎం సానుకూలమే..రాజకీయ ఒత్తిళ్ల ప్రభావం
గడ్డిమందు నిషేధంలో రైతు కమిషన్‌దే కీలక పాత్ర
ములుగు రైతులకు నష్టపరిహారం ఇప్పించడంలోనూ ప్రధాన భూమిక
తెలంగాణ విత్తన ముసాయిదా చట్టం రూపకల్పన
తరుచూ రైతు సంఘాలతో కమిషన్‌ భేటీ
కొందరికి కంటగింపుగా రైతు కమిషన్‌ పనులు
శాఖలో కమిషన్‌ జోక్యంపై మంత్రి గుస్సా

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గడువు తీరిన తర్వాత రైతు కమిషన్‌ను ఎత్తేసే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. కమిషన్‌ చైర్మెన్‌, సభ్యుల పనితీరుపై సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా ఉన్నప్పటికీ.. కమిషన్‌ను ఎత్తేయాల్సిందేనన్న రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. రైతులు, సామాన్య ప్రజల ప్రాణాలను హరిస్తున్న గడ్డిమందును నిషేధించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సక్సెస్‌ కావడం, ములుగు రైతులకు నష్టపరిహారం ఇప్పించడంలో విజయం సాధించడం, తెలంగాణ విత్తన ముసాయిదా చట్టం రూపకల్పనం చేయడం, తురుచూ రైతు సంఘాలతో భేటీ అవుతూ వ్యవసాయ రంగం బలోపేతం కోసం సలహాలు, సూచనలు స్వీకరిస్తుండటం, వాటిని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుండటం వంటి చర్యలు సంబంధింత శాఖను చూసే మంత్రికి ఏ మాత్రం గిట్టడం లేదని తెలుస్తోంది. వ్యవసాయ శాఖలో కమిషన్‌ జోక్యంపై సదరు మంత్రి గుస్సా అయినట్టు కూడా ప్రచారం జరుగుతున్నది. వ్యవసాయ శాఖలోనూ రైతు కమిషన్‌ చేస్తున్న పనులు కంటగింపుగా మారాయనే చర్చ నడుస్తున్నది.

పంజాబ్‌ తర్వాత దేశంలో రైతు కమిషన్‌ ఏర్పాటైనది తెలంగాణలోనే. కమిషన్‌ ఏర్పాటైన కొత్తలో చైర్మెన్‌, సభ్యులు కనీసం కూర్చోవడానికి చాంబర్లు, కుర్చీలు లేని పరిస్థితి. చివరకు బీఆర్‌కే భవన్‌లో కమిషన్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి రైతులకు కమిషన్‌ భరోసాగా నిలుస్తూ వస్తున్నది. ములుగు విత్తనోత్పత్తి రైతులకు ఆయా సంస్థల నుంచి నష్టపరిహారం ఇప్పించడంలో రైతు కమిషన్‌ విజయం సాధించింది. పారాక్వాట్‌ గడ్డిమందు నిషేధంలోనూ కీలక భూమిక పోషించింది. డాక్టర్ల సంఘాలతోనూ, ఇటు రైతు సంఘాలతో వరుస భేటీలు, రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించి గడ్డిమందును నిషేధించాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలోనూ, అసెంబ్లీలో గడ్డిమందును తాత్కాలికంగా నిషేధిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడంలోనూ కమిషన్‌ పాత్ర కీలకమైనది.

కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న విత్తన ముసాయిదా చట్టం…విత్తనోత్పత్తి కేంద్రంగా ప్రసిద్ధి పొందిన తెలంగాణకు తీవ్ర నష్టదాయకంగా ఉందనీ, రైతులు విత్తనం మీద హక్కును కోల్పోయేలా, విత్తన రైతులకు నష్టం జరిగేలా, విత్తన కంపెనీలు లాభం కలిగే ఉన్న విషయాన్ని ఎత్తిచూపుతూ రైతుసంఘాలన్నింటితోనూ వరుసగా సమావేశాలు నిర్వహించింది. తెలంగాణకు ప్రత్యేకంగా విత్తన చట్టం ఉండాల్సిందేనంటూ విత్తన ముసాయిదా చట్టాన్ని రూపొందించి సర్కారుకు అందజేసింది. తక్కువ కాలంలోనే అనేక కార్యక్రమాలతో రైతుల్లో విశ్వాసం చూరగొన్నది. రైతు కమిషన్‌ ఉన్నంతలో చేస్తున్న మంచి పనులు కొందరికి కంటగింపుగా మారినట్టు తెలుస్తోంది. అన్నీ కమిషన్‌ చేస్తే మంత్రిగా నేనేం చేయాలి అంటూ రుసరుసలు ఆడినట్టు కూడా తెలుస్తోంది. సంబంధింత శాఖకు చెందిన ఓ కీలక అధికారి సచివాలయం కేంద్రంగా రైతు కమిషన్‌ను నిర్వీర్యం చేసేందుకు చక్రం తిప్పుతున్నట్టు తెలుస్తోంది.

దీనికి మంత్రి కూడా సహకరిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుత కమిషన్‌ చైర్మెన్‌, సభ్యుల పదవీ కాలం మరో ఆరునెలల్లో ముగియనున్నది. కమిషన్‌ పదవీకాలం పూర్తయిన తర్వాత మొత్తానికే దాన్ని క్లోజ్‌ చేయాలనే కుట్రలు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. చట్టబద్దత లేని కమిషన్‌ ఉన్న లేనట్లేనన్న ప్రచారాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. అదే సమయంలో కమిషన్‌లో జరిగే ప్రతి విషయాన్ని అప్డేట్‌ చేసేలా ఒక యంత్రాంగం పనిచేస్తుందనే చర్చ నడుస్తున్నది. కమిషన్‌కు పేరు రాకుండా అడుగడుగునా అడ్డంకులు పడుతున్నట్టు తెలుస్తున్నది. మూడు, నాలుగు లక్షలు పెట్టి కమిషన్‌కు వెబ్‌ సైట్‌ డిజైన్‌ చేస్తే నేటికీ టెక్నికల్‌ సపోర్టు ఇవ్వకుండా వెబ్‌సైట్‌ను అటకెక్కించిన దుస్థితి. ఏ విషయంలో ముందుకెళ్దామన్నా ప్రొవిజన్‌ లేదని కమిషన్‌ అధికారులు అడ్డుకుంటున్న పరిస్థితి. సీఎం సొంత గ్రామంలో రైతు కమిషన్‌ నిర్వహించిన కార్యక్రమానికి నిధుల విడుదలకూ ఆటంకం కలిగించారు. అధికారుల వ్యవహారంపై రైతు కమిషన్‌ చైర్మెన్‌ కోదండరెడ్డి కూడా ఆగ్రహంతో ఉన్నారు. పలుమార్లు హెచ్చరించినా అధికారులు తీరు మార్చుకోవడం లేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -