వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహం
పలు జిల్లాల్లో నిరసనలు
అమరావతి : ప్రజాఉద్యమ నేత, అనకాపల్లి జిల్లా సిపిఎం నాయకులు ఎం.అప్పలరాజుపై పీడీ చట్టం బనాయించి, అరెస్ట్ చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ తీరుపై పలు జిల్లాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రజలు ఎక్కడికక్కడ గురువారం ఆందోళనలు చేపట్టారు. గూండాలు, రౌడీషీటర్లు, ఆడ పిల్లలను అమానుషంగా కబళించే మానవ మృగాలపై సైతం పెట్టని ఈ చట్టాన్ని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించే నేతపై బనాయించడాన్ని పలువురు తప్పుపట్టారు.
విశాఖలోని జగదాంబ జంక్షన్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం మాట్లాడుతూ అప్పలరాజును తక్షణం భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 20 సంవత్సరాల నుండి ప్రజల కోసం అప్పలరాజు ఎన్నో ఉద్యమాలు నిర్వహించారన్నారు. రైతు సమస్యలపై పోరాడారని తెలిపారు. అప్పలరాజుపై పెట్టిన 19 కేసుల్లో 13 కేసులను కోర్టు రద్దు చేసిందని గుర్తు చేశారు. సిపిఎం సీనియర్ నాయకులు సిహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ గంజాయి, ఎర్ర చందనం స్మగ్లర్ల మీద, భూ తగదాల్లో తలదూర్చి వేలాది కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వారిమీద, వైట్ కాలర్ నేరాలు చేసే వాళ్ల మీద పెట్టాల్సిన పీడీ చట్టాన్ని ప్రజా ఉద్యమాలు చేసే అప్పలరాజు మీద పెట్టడం అన్యాయమన్నారు.



