Thursday, March 12, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅణు యుద్ధం అంచున ప్రపంచం?

అణు యుద్ధం అంచున ప్రపంచం?

- Advertisement -

ఇజ్రాయిల్‌ను షాక్‌కు గురి చేస్తున్న ఇరాన్‌ దాడులు
రక్షణ వ్యవస్థను దాటుకొని మరీ మిసైల్‌ ఎటాక్స్‌
నెతన్యాహు పట్ల ఇజ్రాయిలీల్లో తీవ్ర వ్యతిరేకత
తీవ్ర ఒత్తిడిలో ప్రధాని
ఆఖరి చర్యగా అణు ఆయుధాలు వాడే ప్రమాదం!
ఇలాంటి పరిస్థితుల్లో రష్యా, చైనా జోక్యం అవసరం
అవి మాత్రమే విపత్తును అడ్డుకోగలవు : పరిశీలకులు, విశ్లేషకుల అభిప్రాయం

వాషింగ్టన్‌, టెహ్రాన్‌ : అమెరికా- ఇజ్రాయిల్‌ దాడులతో ఇరాన్‌ యుద్ధం తీవ్రంగా ముదిరింది. ఇరాన్‌ క్షిపణి దాడులు ఇజ్రాయిల్‌ రక్షణ వ్యవస్థలను దాటుతున్నాయి. ఇరాన్‌ యుద్ధ వ్యూహాలు అమెరికా, ఇజ్రాయిల్‌లను షాక్‌కు గురి చేస్తున్నాయి. ఇక యుద్ధమే ఆయుధంగా ప్రధాని పదవిని నిలబెట్టుకునే పద్దతిని అవలంభిస్తున్న ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహును తాజా పరిస్థితులు ఒత్తిడికి గురి చేస్తున్నాయి. దీంతో చివరి అస్త్రంగా ఇజ్రాయిల్‌ అణు ఆయుధాలు వాడితే… అది అణుయుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో రష్యా, చైనాలు మాత్రమే ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయగలవని వారు చెప్తున్నారు.

ఈనెల 8న ఉదయం అమెరికా, ఇజ్రాయిల్‌లు ఇరాన్‌పై చేసిన దాడులతో మధ్యప్రాచ్య యుద్ధం అత్యంత ప్రమాదకర దశలోకి ప్రవేశించింది. ఈ యుద్ధం అణుయుద్ధంగా మారితే పెద్ద విపత్తు సంభవించే ప్రమాదం ఉందని విశ్లేషకులు ప్రేమ్‌ శంకర్‌ ఝా హెచ్చరిస్తున్నారు. మార్చి 8న అమెరికా.. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌, సమీప నగరం కరాజ్‌ వద్ద ఉన్న చమురు శుద్ధి కర్మాగారాలపై భారీ దాడులు చేసింది. ఈ దాడులతో ఆ ప్రాంతంలో గాలి విషపూరితంగా మారింది. ఇరాన్‌ ప్రభుత్వం వెంటనే ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు మాస్కులు ధరించాలనీ, ఫ్రిజ్‌లో ఉన్న ఆహారాన్ని పారే యాలని, తాగునీటి ఫిల్టర్లు మార్చాలని సూచించింది. దీనికి ప్రతిస్పందనగా గల్ఫ్‌ దేశాలకు ప్రమాదకర సందేశాలు పంపింది. నాలుగు గంటల్లో వారి చమురు సదుపాయాలను ధ్వంసం చేస్తామని హెచ్చరించింది. తర్వాత ఇజ్రాయిల్‌లోని హైఫా బే ప్రధాన చమురు శుద్ధి కర్మాగారంపై దాడి చేసింది.

హైఫా రిఫైనరీపై దాడి ప్రభావం
హైఫా రిఫైనరీ దాడి ఇజ్రాయిల్‌కు తీవ్రమైన దెబ్బగా మారింది. ఈ రిఫైనరీ దేశానికి అవసరమైన చమురు వినియోగంలో సగానికి పైగా సరఫరా చేస్తుంది. ఈ దాడులతో యుద్ధం పూర్తిస్థాయి యుద్ధంగా మారే ప్రమాదం పెరిగిందని నిపుణులు అంటున్నారు. ఇది అణు యుద్ధానికి దారి తీస్తే ప్రపంచం భారీ ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు.

ఇజ్రాయిల్‌ రక్షణ వ్యవస్థ బలహీనత
అమెరికా అంచనాల ప్రకారం.. యుద్ధ ప్రారంభంలో ఇరాన్‌ క్షిపణుల్లో పది శాతం మాత్రమే ఇజ్రాయిల్‌ రక్షణ వ్యవస్థను దాటాయి. ఆరు రోజులకల్లా ఈ సంఖ్య 20-35 శాతానికి పెరిగింది.
ఈ యుద్ధంలో ఇరాన్‌ ఒక వ్యూహంతో ముందుకెళ్తున్నట్టు స్పష్టమవుతున్నది. ఇరాన్‌ మొదట పాత క్షిపణులు వాడి.. ఇప్పుడు కొత్త ఆధునిక క్షిపణులను ఉపయోగిస్తోంది. ఇరాన్‌ క్షిపణి కేంద్రాలు ఎక్కువగా భూగర్భంలో ఉన్నాయి. అందువల్ల అవి ప్రయోగించే వరకూ కనిపించవు. ప్రయోగ సమయంలో భారీ దుమ్ము ఎగిసిపడుతుంది, ఆ తర్వాత తెల్లని పొగ కనిపిస్తుంది. ఈ విధంగా ఇరాన్‌ అంతటా వేల సంఖ్యలో ఈ కేంద్రాలు ఉన్నాయని విశ్లేషకులు, నిపుణులు భావిస్తున్నారు.

ఇరాన్‌ వ్యూహం
అమెరికా దాడులు ఇరాన్‌ ప్రభుత్వాన్ని బలహీనపర్చటం లేదు. ఇరాన్‌ ప్రభుత్వానికి గతంలో ఉన్నదాని కంటే ఎక్కువగా ప్రజల మద్దతు పెరిగింది. ఇక ఇరాన్‌ ముందుగానే రూపొందించిన వ్యూహాన్ని అమలు చేస్తోంది. మొదట గల్ఫ్‌ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై దాడి చేసింది. అమెరికా సైనికులు ఉంటారని భావించిన హౌటళ్లపై కూడా దాడులు చేసింది. మొత్తానికి అమెరికా ఊహించని దాడులను ఇరాన్‌ చేపట్టి ప్రమాదకర సందేశాలను పంపిందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇరాన్‌ దాడులు ఈ విధంగానే కొనసాగితే ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు పెద్ద సమస్యను ఎదుర్కొంటారని వారు అంటున్నారు.

ఇజ్రాయిల్‌ ప్రజలు తమ భద్రతపై పూర్తి నమ్మకం పెట్టుకున్నారు. ఐరన్‌ డోమ్‌ వల్ల వారు సురక్షితంగా ఉన్నారని భావించారు. కానీ ఇప్పుడు ఆ నమ్మకం కదిలిపోయింది. తాజా పరిస్థితులు ఇజ్రాయిల్‌ ప్రజలలో భయాన్ని కలిగిస్తున్నాయి. జూన్‌ యుద్ధంలో మొసాద్‌ ప్రధాన కార్యాలయం దెబ్బతింది. హైఫా విమానాశ్రయం కూడా దెబ్బతింది. ఇవి ఇజ్రాయిల్‌ ప్రజలను షాక్‌కు గురి చేశాయి. రాత్రి వేళల్లో ప్రజలు బంకర్లలో ఆశ్రయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటి వరకు పాలస్తీనియన్లు మాత్రమే ఎదుర్కొన్న భయాన్ని ఇప్పుడు ఇజ్రాయిల్‌ ప్రజలు కూడా అనుభవిస్తున్నారని అంటున్నారు.

రష్యా, చైనాలు హెచ్చరించాలి
ఒక దేశం అణుబాంబు వాడితే ఇతర దేశాలు కూడా స్పందించే ప్రమాదం ఉంటుంది. దీంతో అణు యుద్ధం ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి తరుణంలో రష్యా, చైనాలు చాలా కీలకంగా మారనున్నాయి. ఇవి సైనిక పరంగా, ఆర్థికంగా, ఆయుధపరంగా బలమైన శక్తులు. భారీ అణు ఆయుధాలు, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో స్థానం, అంతర్జాతీయ ప్రభావం వీటికి ఉన్నాయి. ఇలాంటి తరుణంలో అమెరికా, ఇజ్రాయిల్‌లను కట్టడి చేయాలంటే రష్యా, చైనాలు జోక్యం చేసుకోవాలని విశ్లేషకులు చెప్తున్నారు. వీటి జోక్యంతో ప్రపంచం అణుయుద్ధంలోకి వెళ్లకుండా ఉంటుందని వివరిస్తున్నారు. ఇజ్రాయిల్‌ అణు ఆయుధం వాడితే ప్రపంచం మొత్తం స్పందిస్తుందనే హెచ్చరికను ఈ రెండు దేశాలు పంపాలని వివరిస్తున్నారు.

ఇరాన్‌ ఆధునిక క్షిపణులు
ఇరాన్‌ ఇప్పుడు మరింత ఆధునిక క్షిపణులను ప్రయోగిస్తోంది. హైఫా రిఫైనరీపై దాడికి ‘ఖైబర్‌ శేకాన్‌’ అనే ఘన ఇంధన రాకెట్‌ను ఉపయోగించింది. ఈ రాకెట్‌ పొడవు 11 మీటర్లు. ఇది అర టన్నుకు పైగా పేలుడు సామర్థ్యం ఉన్న వార్‌ హెచ్‌ కలిగి ఉంటుంది. ఇరాన్‌ హైపర్‌సోనిక్‌ క్షిపణులు ఇజ్రాయిల్‌ రక్షణ వ్యవస్థలను సులభంగా దాటుతున్నాయని అల్‌ జజీరా వీడియోలను బట్టి చూస్తే తెలుస్తోంది. కొన్ని క్షిపణులు స్వతంత్రంగా దిశ మార్చుకునే సామర్థ్యం కలిగి ఉన్నాయి. క్లస్టర్‌ వార్‌ హెడ్‌లు కూడా ఉన్నాయి. ఇవి గాల్లో విడిపోయి చిన్న బాంబులుగా మారుతాయి. కొన్ని వెంటనే పేలకపోతే ఆ తర్వాతైనా పౌరులకు ప్రమాదం కలిగించే అవకాశం ఉంది.

చివరి అస్త్రంగా అణు ఆయుధాలు
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత యుద్ధంలో పైచేయి సాధించడానికి ఇజ్రాయిల్‌ ఎంత వరకైనా తెగించొచ్చు. ఇజ్రాయిల్‌ అధికారికంగా అంగీకరించకపోయినా.. అంతర్జాతీయ అంచనాల ప్రకారం ఇజ్రాయిల్‌ వద్ద వందకు పైగా అణుబాంబులు ఉన్నాయని సమాచారం. యుద్ధంలో ఓటమి లేదా తీవ్ర ప్రమాదం ఎదురైతే చివరి రక్షణ చర్యగా అణు ఆయుధాలు ఉపయోగించే సిద్ధాంతాన్ని కొన్ని సార్లు దేశాలు అనుసరిస్తాయి.

ఇజ్రాయిల్‌కు కొత్త షాక్‌
ఇజ్రాయిల్‌ ఇప్పటి వరకు ఇలాంటి తీవ్రమైన దాడులను ఎదుర్కోలేదు. ఇరాన్‌ కొత్త తరహా క్షిపణులను ఉపయోగించడం ఇజ్రాయిల్‌కు మొదటి షాక్‌ అని చెప్పొచ్చు. ఈ క్షిపణులు ఇజ్రాయిల్‌ ‘ఐరన్‌ డోమ్‌’ రక్షణ వ్యవస్థను కూడా ఛేదించుకుని లక్ష్యాల వైపు వెళ్తున్నాయి. ఇజ్రాయిల్‌ ప్రభుత్వం పూర్తి నష్టం వివరాలు వెల్లడించకపోయినా.. సుమారు 34 మంది వరకు మరణించారనీ, 3500 మంది గాయపడ్డారని పలు నివేదికలు చెప్తున్నాయి.

నెతన్యాహుకు తగ్గిన ప్రజాదరణ
ప్యూ సర్వే ప్రకారం 2024లోనే 58 శాతం మంది ఇజ్రాయిల్‌ ప్రజలు నెతన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. మరొక సర్వే ప్రకారం.. ఎన్నికలు జరిగితే ఇజ్రాయిల్‌లో ప్రతిపక్షమే గెలిచే అవకాశం ఉంది. 27 శాతం మంది మాత్రమే నెతన్యాహుపై విశ్వాసాన్ని ఉంచినట్టు తాజా సర్వే గణాంకాలు చెప్తున్నాయి. అయితే తాను అధికారంలో ఉండేందుకు గాజాపై యుద్ధాన్ని నెతన్యాహు ఒక సాధనంగా వాడుకున్నారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. తాజాగా ఇరాన్‌పై యుద్ధాన్ని కూడా ఆయన రాజకీయంగా తనకు అనుకూలంగా మల్చుకునేందుకు చూస్తున్నారని వారు వివరిస్తున్నారు. మరోపక్క నెతన్యాహు అవినీతి కేసుల్లో దోషిగా తేలారు. ప్రధాని పదవి వదిలితే జైలుకెళ్లే పరిస్థితి ఉంది. అందుకే యుద్ధాలను సాగిస్తూ అధికారంలో ఉండాలని ప్రయత్నిస్తున్నారని ఆయనపై విమర్శలు ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -