Saturday, July 5, 2025
E-PAPER
Homeఎడిట్ పేజికామన్‌ స్కూల్‌ సిస్టం కలేనా?

కామన్‌ స్కూల్‌ సిస్టం కలేనా?

- Advertisement -

మనదేశంలో పాఠశాలలకు కొదవలేదు. ప్రభుత్వరంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్నవి చాలానే ఉన్నాయి. ఇంకా ప్రయివేటు రంగంలోనూ కార్పొరేట్‌ శక్తుల గుత్తాధిపత్యంలో నడుస్తున్న పాఠశాలలున్నాయి. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలు ఆశించిన స్థాయిలో లేవని నివేదికలు ఘోషిస్తున్నాయి. విద్యార్థుల నమోదు కూడా కొన్ని జిల్లాల్లో తక్కువగానే ఉన్నట్టు గణంకాలు చెబుతున్నాయి. వేలాది పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు అంటే మరుగుదొడ్లు, మంచినీరు, విద్యుత్‌ సరఫరా, పక్కా భవనాల్లేక కునారిల్లున్నాయి. వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ కేటాయింపులు కాగితాలపైనే కనపడు తున్నాయి. కానీ ఫలితం మాత్రం నానాటికి తీసికట్టుగా స్పష్టమవుతున్నది. ఉపాధ్యాయుల కొరత కూడా అడ్మిషన్లను, ఫలితాలను ప్రభావితం చేయడంతో నేడు ప్రభుత్వ పాఠశాలల మనుగడ కొంత మేరకు ప్రశ్నార్ధకమవుతున్న పరిస్థితి దాపురించింది. విద్యకు చేసే కేటాయింపులను ఖర్చుగా కాక మానవ వనరుల అభివృద్ధికి చేసే పెట్టుబడిగా ప్రభుత్వాలు భావిస్తే భవిష్యత్తులో దేశం అభివృద్ధి దిశగా పయనించే అవకాశముంది.


ప్రభుత్వ రంగంలో కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలో నవోదయ, ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌, ఆవాస పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు నడుస్తున్నాయి. 2004లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు కూడా ఎస్సీ,ఎస్టీ, మైనారిటీల విద్యాశాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో సర్వ శిక్ష అభియాన్‌కు అనుబంధంగా ఏర్పాటు చేసింది. వీటిలో కొన్నింటిలో స్టేట్‌ సిలబస్‌, మరికొన్నింటిలో సెంట్రల్‌ సిలబస్‌ బోధించ బడుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్‌ పాఠశాలలు దాదాపు ప్రతి ఊరిలో విద్యార్థుల సంఖ్య నమోదును బట్టి నడుస్తున్నాయి. ఇవేకాక మోడల్‌ స్కూల్స్‌, అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ కూడా ఉన్నాయి. వీటికి తోడు ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్‌ ఐదు రకాల రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కళాశాలలు నడుస్తున్నాయి. ఇవి దాదాపు రాష్ట్రంలో 1022 ఉండగా దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు వీటిలో చదువుకుంటున్నారు.ఇదిగాక, కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కొన్ని ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో అన్ని రకాల రెసిడెన్షియల్‌ పాఠశా లలను ఒకే క్యాంపస్‌ నందు నిర్వహించే ప్రక్రియలో భాగంగా ‘యంగ్‌ ఇండియా’ ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ శంకుస్థాపనలు చేసింది. అంటే ఒకే క్యాంపస్‌లో నాలుగు లేదా ఐదు రకాల సొసైటీల విద్యా ర్థులు కలిసి చదువుకుంటారు. దీనికి ఒక్కో క్యాంపస్‌ కోసం 200 కోట్ల రూపాయల అంచనాతో భవన నిర్మాణాలకు పూనుకున్నది. ఇవి చాలవన్నట్లు తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ కూడా నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపుగా ఈ పాఠశాలన్నింటిలో ఎస్సీఈఆర్టీ నిర్దేశించిన స్టేట్‌ సిలబస్‌ ప్రమాణంగా బోధన ఉంటుంది. అయితే, ఇప్పటివరకు నడుస్తున్న విద్యాసంస్థల్ని బలోపేతం చేయాల్సిన సర్కార్‌ కొత్తవాటిపై దృష్టిపెట్టడం దేనికి?


ప్రయివేటు రంగంలో కొన్ని కార్పొరేట్‌ సంస్థలు ఆధిపత్యంతో విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఆకర్షించడానికి రకరకాల పేర్లతో విద్యాసంస్థలు నడుపుతున్నాయి. విద్యార్థుల ఆసక్తిని, తల్లిదండ్రుల బలహీనతలను సొమ్ము చేసుకునే కార్పొరేట్‌ సంస్థలు ఆకర్షణీయమైన పేర్లతో ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నాయి.ఈ పాఠశాలల్లో ఫీజు లక్షల రూపాయల్లో ఉంటుంది. సామాన్యుడికి ఇది అందని ద్రాక్ష లాంటిది, మధ్యతరగతి తండ్రిని అప్పులపాలు చేసేది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించకపోగా, ప్రయివేటుకు వంతపాడే విధానాలే అమలు చేస్తున్నది. ఇంకా హైదరాబాద్‌లో ఉన్నత వర్గాల వారి కోసం రెండు పబ్లిక్‌ స్కూల్స్‌ కూడా నడుస్తున్నాయి. వీటికి చాలా ప్రతిష్టాత్మక సంస్థలు గా పేరు. వారి పిల్లలకే కానీ ఇతరుల పిల్లలకు వీటిలో అడ్మిషన్‌ సాధ్యం కాదు. కేవలం ఉన్నత స్థాయి అధికారులకు, ఎమ్మెల్యేలు, మంత్రుల పిల్లలకు మాత్రమే ఇవి అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వం రంగంలోని పాఠశాలల్లో స్టేట్‌ సిలబస్‌ ఎస్సీఈఆర్టీ నిర్దేశిత పాఠ్యపుస్తకాలు ఉపయోగిస్తుండగా కార్పొరేట్‌ సంస్థల్లో కొన్ని స్టేట్‌ సిలబస్‌ కొన్ని సిబిఎస్‌ఇని అనుసరిస్తున్నాయి. మరి కొంతమంది ఐసిఎస్‌ఈ బోధిస్తుండగా అతి కొద్ది మంది ఐబీ సిలబస్‌ను ఆశ్రయించడం విశేషం.అసలు ఇన్ని రకాల పాఠశాలల్లో, ఇన్ని రకాల సిలబస్లు కరికులంలో అవసరమా? కేవలం రాష్ట్ర జాతీయ సిలబస్‌లు రెండు సరిపోవా?


పాఠశాలల్లో అడ్మిషన్‌ కేవలం ఆర్థిక పరిస్థితి ఆధారంగా నిర్ణయించబడుతున్నది. అటెండర్‌ కొడుకు మొదలు ఆఫీసర్‌ కొడుకు వరకు, బంట్రోతు కూతురు మొదలు ముఖ్యమంత్రి కూతురు వరకు ఒకే పాఠశాలలో చదివే అవకాశం లేదా? కేవలం డబ్బు, పరపతి, హోదా కలిగిన వారి పిల్లలే మంచి పేరు గల పాఠశాలలో చదవడం సమాజానికి ఏ రకమైన సందేశాన్ని స్తుంది? పేద వారి పిల్లలకు నాణ్యమైన విద్య ఎండమావేనా? మానవులను కులాలవారీగా, మతాల వారీగా ఆర్థిక స్థితిగతుల ఆధారంగా కాకుండా అందరినీ ఒకే రకంగా చూసే ఒక విద్యా వ్యవస్థను మన ప్రభుత్వాలు ఎందుకు విస్మరి స్తున్నాయి? విదేశాల్లో ఉన్న ఆధునికతను శాస్త్ర సాంకేతికలను దిగుమతి చేసుకుని మన నగరాలను సింగపూర్‌ సిటీలా, డల్లాస్‌లా చేస్తామంటారు మన నేతలు. కానీ గొప్ప విదేశీ యూనివర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలు లాంటివి మనదేశంలో ఏర్పాటు చేస్తామని చెప్పరు. ప్రజలందరినీ సమానంగా చూడలేని ఒక దౌర్భాగ్య స్థితిలో మన ప్రభుత్వాలు పనిచేయడం బాధాకరం. అనాధల నుండి అమాత్యుల వరకు ఒకే పాఠశాలలో చదివితే బోధించే ఉపాధ్యాయులు కూడా మరింత బాధ్యతతో పనిచేస్తారు. కానీ మన మంత్రుల పిల్లలు పబ్లిక్‌ స్కూల్స్‌లోను, ఇంకా విదేశాల్లోనూ చదువుతారు. అందుకే వారికి ప్రభుత్వ పాఠశా లలపై చిన్నచూపు, నిర్లక్ష్య భావం.అంటే తాము నడుపుతున్న వ్యవస్థపై తమకే నమ్మకం లేదన్న మాట. ఉపాధ్యాయులు ఉన్నత అధికారులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించడం ద్వారా ప్రజల్లో వాటిపై విశ్వాసాన్ని పెంచవచ్చు. మౌలికవసతుల కల్పనలో శ్రద్ధచూపి అవసరమైతే సమాజం లేదా తల్లిదండ్రుల సహకారాన్ని కోరాలి. తద్వారా వారిని కూడా పాఠశాలల నిర్వహణలో భాగస్వాములను చేయవచ్చు.


కామన్‌ స్కూల్‌ వ్యవస్థ మాత్రమే విద్యార్థుల్లో సమాజంలో సమానత్వాన్ని సాధించగలుగుతుంది. విద్యార్థుల మధ్య అంతరాలు తొలగిస్తుంది. లక్షల రూపాయలతో చదువంటే అది కేవలం ఇరవై శాతం మంది ప్రజలకు మాత్రమే సాధ్యమవుతుంది. డబ్బు, హోదా, పదవి, అధికారం ఇవన్నీ కామన్‌ స్కూల్‌ సిస్టం ద్వారా మాత్రమే అంతరించి ప్రజల మధ్య భేదభావాలు నశించి సమభావం చిగురిస్తుంది. ఇది చేయాలంటే ప్రభుత్వాలకు ఎంతో ధైర్యం కావాలి. కార్పొరేట్‌ శక్తులు తమకు అనుకూలమైన ప్రభుత్వాలు ఏర్పడటానికి ఎన్నికల్లో వందల కోట్ల రూపాయలు చేసేది తర్వాత తమ పబ్బం గడుపుకోవడానికే అనేది వాస్తవం. అందుకే ప్రభుత్వాలు కార్పొరేట్‌ సంస్థల ధనదాహానికి తమ వంతు అందజేస్తారు.ప్రజలు మాత్రం నిస్సహాయంగా ప్రభుత్వాల వంక చూడడం పరిపాటిగా మారింది. ఇన్ని రకాల పాఠశాలలు విద్యార్థులను తల్లిదండ్రులను తద్వారా సమాజాన్ని గందరగోళంలో పడవేస్తున్నాయి. అందరికీ ఒకే పాఠశాల, ఒకే సిలబస్‌ ఇది మాత్రమే అందర్నీ ఒకే తాటిపై నడిపిస్తూ ఒకే భావాన్ని కలుగజేస్తుంది. వారి మధ్య అంతరాలను, భేదభావాలను తొలగిస్తూ సమానత్వాన్ని పెంపొందిస్తుంది. ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచించాలి, అడుగులు వేయాలి.
శ్రీ శ్రీ కుమార్‌
9440354092

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -