ఫీజు బకాయిల చెల్లింపులపై తెలంగాణ ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడంతో.. విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవు తున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలూ కోల్పోతున్నారు. దీనిపై విద్యార్థి సంఘాలు దీర్ఘకాలిక పోరాటాలు చేస్తున్నా..రేవంత్ సర్కారు మౌనముద్రను వీడడం లేదు. కనీసం ప్రయివేటు కాలేజీలకు భరోసానిచ్చి విద్యార్థుల ఇబ్బందులు తొలగించే అవకాశాలున్నా, ఆ ప్రయత్నమూ చేయడం లేదు.విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్స్ చెల్లింపుల్లో గత బీఆర్‌ఎస్ పాలన, ప్రస్తుత కాంగ్రెస్ పాలనకు తేడా లేదు. గత ప్రభుత్వ తరహాలోనే ఫీజు బకాయిలు చెల్లించకుండా కాలయాపన చేయడం వల్ల ఉన్నతవిద్యకు దూరమవుతున్నారు విద్యార్థులు. తెలంగాణ వ్యాప్తంగా సుమారు రూ.8 వేల కోట్ల రూపాయల బకాయిలున్నట్లు విద్యార్థి సంఘాలు చెబుతు న్నాయి. వీటి చెల్లింపులపై ఆందోళనలూ కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వం షరామామూలే అన్నట్లుగా వ్యవహరిస్తోంది. అయితే..క్షేత్రస్థాయిలో విద్యార్థుల ఇబ్బందులను సీఎం రేవంత్ రెడ్డి కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. ప్రధానంగా డిగ్రీ,..ఇంజనీరింగ్ పాస్ అవుట్ అయిన విద్యార్థులకు ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. టీసీ ఇవ్వకపోవడంతో చిన్నాచితక ప్రయివేటు ఉద్యోగాల్లో చేరలేక, ఉన్నత విద్యకు వెళ్లలేక సతమతమౌతున్నారు. యేటా ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో యేటా సుమారు లక్ష మంది విద్యార్థులు, డిగ్రీ కాలేజీల నుండి మరో ఐదు లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తున్నా..ఇందులో కనీసం యాభైవేల మంది కూడా పీజీ చదువలేక పోతున్నారంటే అర్థం చేసుకోవచ్చు.
విద్యార్థి సంఘాల ప్రతినిధులు, ప్రయివేటు విద్యాసంస్థల ప్రతినిధులచే ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి..విద్యారంగ సమస్యలపై చర్చిండం వల్ల సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి. ఫీజు బకాయిలు, ప్రభుత్వ పరమైన ఇతర అంశాల్లో విద్యార్థులను యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేయకుండా జిల్లాల వారిగా కమిటీలు వేసి ఉన్నతాధికారులు పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలి.
ప్రాథమిక విద్యపైనా అశ్రద్ధ!
పేద, మధ్యతరగతి తల్లిదండ్రుల ఆదాయంలో మూడోవంతు పిల్లల చదువుకే ఖర్చు పెడుతున్నారు. అప్పులు చేసి మరీ ప్రయివేటు విద్యా సంస్థల్లో చదివిస్తున్నారు పేరెంట్స్. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు రెండో విద్యా సంవత్సరం కూడా నిరాశే ఎదురైంది. ఫీజుల నియంత్రణ, విద్యాహక్కు చట్టం అమలుపై 2024 జూలైలో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చైర్మన్‌గా మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క సభ్యులతో ఏర్పడ్డ మంత్రి వర్గ ఉప సంఘం రెండుసార్లు సమావేశమై చర్చించింది. దీనికి తోడు ఫీజుల నియంత్రణకు రాష్ట్ర విద్యా కమిషన్ ఓ నివేదిక కూడా ఇచ్చింది. ప్రయివేటు విద్యాసంస్థల్లో పేద పిల్లలకు 25 శాతం ఉచిత సీట్లు కల్పించేలా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రయివేటు, కార్పోరేట్ సంస్థల్లో ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకోవాల్సి ఉండగా..ఆ దిశగా ఎలాంటి అడుగులూ పడలేదు. దీంతో ఆయా విద్యాసంస్థల దోపీడీకి అడ్డుకట్ట పడలేదు. ఫీజుల పేరుతో రూ.25 వేల నుండి రూ.లక్షా 20 వరకు వసూలు చేస్తున్నాయి. పాఠ్య పుస్తకాల రూపంలోనూ ఒక్కో విద్యార్థి వద్ద నుండి వేలాది రూపాయలు గుంజుతున్నాయి. వీటితో పాటు యూనిఫాం, టై బెల్ట్, షూస్ పేరుతో అదనపు దోపిడీకి పాల్పడుతున్నాయి.
ప్రయివేటు, కార్పోరేట్ విద్యాసంస్థల్లో దోపిడీపై ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న చర్యలు శూన్యం. ఆయా విద్యాసంస్థల్లో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వారిచే తనిఖీలు చేపట్టి.. విద్యా శాఖ అధికారుల ద్వారా కట్టడి చేసే అవకాశాలున్నా ఆ దిశగా అడుగులు పడలేదు. విద్యాహక్కు చట్టం మేరకు 25శాతం పేద విద్యార్థులకు కేటాయించాల్సి ఉండగా.. కనీసం ఐదు శాతం కూడా సీట్లు ఇప్పించలేని ప్రభుత్వ స్థితి. బుక్స్ పేరుతో వసూలు చేస్తున్న యాజమాన్యాలపైనా చర్యలు తీసుకునే పరిస్థితిలో విద్యాశాఖ లేదు. విద్యాశాఖను సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డినే నిర్వహిస్తున్నారు. ఫీజు నియంత్రణా చట్టం తీసుకురావడంతో పాటు పాఠ్యపుస్తకాలు, ఇతరాత్ర అదనపు వసూళ్లపై ఉక్కుపాదం మోపితే.. తల్లిదండ్రులకు కొంతైనా మేలు జరిగే అవకాశముంది.
చిలగాని జనార్థన్
8121938106
విద్యార్థులకు..ఏదీ భరోసా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES