ప్రపంచీకరణలో పడిపోయిన టీచర్ల స్థానం
- సినిమాలు, ఓటీటీలు, టీవీలతో దిగజారుతున్న విలువలు
- విద్యార్థుల్లో పెరుగుతున్న నేరప్రవృత్తి
- ప్రభుత్వ టీచర్లపై పెరుగుతున్న పనిభారం
- బోధనేతర పనులతో చదువుపై ప్రభావం
- ప్రయివేటు విద్యాసంస్థల్లో శ్రమదోపిడీ
- ఉద్యోగ భద్రత కరువు కనీస వేతనాలుండవు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది అన్నారు మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్. సమాజానికి, విద్యార్థులకు మార్గదర్శి ఉపాధ్యాయుడు. తన జ్ఞానాన్ని విద్యార్థులకు పంచుతూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతాడు. విలువలు, దేశభక్తిని నేర్పుతాడు. ఆదర్శంగా జీవిస్తాడు. అందుకే గురువు స్థానం వెలకట్టలేనిది. ప్రపంచంలో అన్ని వృత్తుల కన్నా ఉపాధ్యాయ వృత్తికి ఎంతో గౌరవమున్నది. ఎందుకంటే ఉపాధ్యాయులు సమాజాన్ని ప్రభావితం చేస్తారు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు విద్యార్థులు ఎంత ఎత్తుకు ఎదిగినా టీచర్ల వద్ద ఓనమాలు నేర్చుకున్న వారే. అందుకే టీచర్లకు సముచిత గౌరవం దక్కేది. పాలకులు కూడా ప్రాధాన్యత ఇచ్చేవారు. సెప్టెంబర్ ఐదో తేదీన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులకు రాష్ట్రపతి, రాష్ట్రాల్లో
ఉత్తమ టీచర్లకు ముఖ్యమంత్రి లేదా విద్యామంత్రులు అవార్డులను ప్రదానం చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఉపాధ్యాయుల కీర్తి ప్రతిష్టలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. గురువుకు సముచిత గౌరవం దక్కడం లేదు. ప్రపంచీకరణలో గురువుల స్థానం మారిపోతున్నది. విద్యాప్రమాణాలు ఎలా దిగజారుతున్నాయో పంతుళ్ల స్థానం కూడా అలాగే పడిపోతున్నది. నూతన ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చాక విద్యారంగం బాధ్యతల నుంచి ప్రభుత్వాలు తప్పుకుంటున్నాయి. విద్యా ప్రయివేటీకరణను ప్రోత్సహిస్తున్నాయి. దీంతో ఉపాధ్యాయుల పట్ల పాలకుల తీరులోనూ ఎంతో మార్పు వచ్చింది. ప్రభుత్వాలు వారిని పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తున్నది. ఉపాధ్యాయ దినోత్సవాన్ని బాధ్యతగా కాకుండా ఒక తంతుగా నిర్వహిస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పాఠకులకు నవతెలంగాణ ప్రత్యేక కథనాన్ని అందిస్తున్నది.
ఉపాధ్యాయులపై పెరుగుతున్న ఒత్తిడి
రాష్ట్రంలో 30,137 (గురుకులాలు కలిపి) ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వాటిలో సుమారు 1.30 లక్షల మంది పనిచేస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు బోధనపై దృష్టిసారించలేకపోతున్నారు. బోధనేతర పనులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఒత్తిడి పెరుగుతున్నది. ఇంకోవైపు ప్రభుత్వ విద్యారంగంలో రెగ్యులర్ ఉపాధ్యాయులతోపాటు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, తాత్కాలిక, గెస్ట్ ఇలా వివిధ రకాల పేరుతో నియమిస్తున్నారు. వారికి ఉద్యోగ భద్రత లేదు. ఉపాధ్యాయ ఖాళీలను, బోధనేతర సిబ్బందిని సకాలంలో భర్తీ చేయడం లేదు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. ఉపాధ్యాయులే బిల్లులు పంపించడంతోపాటు బెల్లులు కొట్టాల్సిన పరిస్థితి దాపురించింది. చదువు చెప్పాలా? బోధనేతర పనులు చేయాలా?అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఉపాధ్యాయులంటే సమాజంలో చిన్నచూపు ఉండేలా సినిమాలు, ఓటీటీలు, టీవీల్లో సీరియళ్లతోపాటు వివిధ కార్యక్రమాలు ప్రభావితం చేస్తున్నాయి. వాటి ప్రభావంతో విద్యార్థుల్లో నేరప్రవృత్తి పెరుగుతున్నది. పిల్లలను దండించే పరిస్థితి ఇప్పుడు లేదు. దీంతో విలువలతోపాటు విద్యా ప్రమాణాలు కూడా పడిపోతున్నాయి. ఉపాధ్యాయులంటే విద్యార్థులకు గౌరవం ఉండడం లేదు.
ప్రయివేటు టీచర్ల అరిగోస
దేశంలో, రాష్ట్రంలో ప్రయివేటు పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య ఏటా పెరుగుతున్నది. రాష్ట్రంలో 11,757 ప్రయివేటు బడుల్లో సుమారు 2.30 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వారికి సర్వీసు నిబంధనలుండవు. ఉద్యోగ భద్రత కరువు. కనీస వేతనాలు అమలు కావు. పీఎఫ్, ఈఎస్‌ఐ అమలు చేసే ప్రయివేటు పాఠశాలలు కొన్ని మాత్రమే. ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులను వసూలు చేస్తున్నాయి. కానీ కనీస వేతనాలు ఇవ్వకుండా ఉపాధ్యాయులను శ్రమదోపిడీ చేస్తున్నాయి. ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయుల సమస్యలు అన్నీఇన్నీ కావు. కానీ ప్రభుత్వాలు వారికి న్యాయం చేసే దిశగా ఆలోచించడం లేదు.
గురువులకు సముచిత గౌరవం ఇవ్వాలి
గురువులకు సముచిత గౌరవం ఇవ్వాలి. ఏడాదికోసారి సెప్టెంబర్ ఐదో తేదీన ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించడమే కాకుండా అందరినీ ప్రభుత్వం పట్టించుకోవాలి. బోధనేతర సిబ్బందిని నియమించాలి. బోధనేతర పనుల భారాన్ని తగ్గించాలి. ప్రయివేటు పాఠశాలల్లో ఉపాధ్యాయుల పట్ల శ్రమదోపిడీని అరికట్టాలి. సర్వీసు నిబంధనలు రూపొందించాలి. కనీస వేతనాలను అమలు చేయాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రతిభావంతులను ఉపాధ్యాయ వృత్తిలోకి ఆకర్షించాలి. ఇంటర్ పూర్తయ్యాక ఇంజీనిరింగ్, మెడిసిన్ కోర్సుల్లో ఎక్కువ మంది చేరతారు. ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్లు, త్వరగా స్థిరపడాలని భావించే వారు డీఎడ్, బీఎడ్‌లో చేరుతున్నారు. ఇందులో మార్పు రావాలి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపర్చాలి. అందరికీ నాణ్యమైన, సమానమైన విద్యనందించాలి. ప్రాథమిక పాఠశాలల్లో కనీసం ఇద్దరు టీచర్లుండాలి. 40 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులుంటే తరగతి గదికొక టీచర్ ఉండాలి. పర్యవేక్షణ వ్యవస్థ పటిష్టం చేసి ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం పెంచాలి.
– చావ రవి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు