సవాలు విసిరి పారిపోయిన సీఎం
మరో అవకాశమిస్తున్నా… చర్చకు రావాలి
లేకపోతే క్షమాపణ చెప్పాలి : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రచ్చ చేయడమే తప్ప చర్చించడం సీఎం రేవంత్ రెడ్డికి తెలియదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతులు, యువతకు ఎవరేం చేశారో చర్చించాలంటూ సవాల్ విసిరిన ముఖ్యమంత్రి ఢిల్లీ పారిపోయారని ఎద్దేవా చేశారు. మరోసారి అవకాశమిస్తున్నాననీ, సమయం, స్థలం, తేదీ వారే నిర్ణయించి చర్చకు సిద్ధం కావాలని అన్నారు. చర్చించేందుకు సిద్ధంగా లేకుంటే వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బూతులు మాట్లాడటమే తప్ప రైతుల గురించి రేవంత్ రెడ్డికి మాట్లాడటం రాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరించిన కేటీఆర్ మంగళవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు వచ్చారు. వందలాది మంది అనుచరులు ఆయనను అనుసరించడంతో క్లబ్ గులాబీ శ్రేణులతో నిండిపోయింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి అని రాసి ఉన్న ఖాళీ కుర్చీని వేదికపై ఉంచారు. ఆ పక్క కుర్చీలో కేటీఆర్ కూర్చున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విచారం ప్రకటిస్తూ బీఆర్‌ఎస్ నేతలు ఒక నిమిషం మౌనం పాటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 18 నెలలుగా 70 లక్షల మంది రైతులను, కోట్లాది కుటుంబాలను కాంగ్రెస్ దగా చేసిందని మండిపడ్డారు. హామీల అమలుకు గ్యారంటీ అంటూ నమ్మబలికి 18 నెలల తర్వాత కూడా ఒక్క హామీని నెరవేర్చలేదని తెలిపారు. రైతుల గురించి కనీస పరిజ్ఞానం లేకుండా సీఎం మాట్లాడుతున్నారనీ, అందుకే సిద్ధపడేందుకు 72 గంటల సమయమిచ్చినట్టు తెలిపారు. స్థలం, సమయం, తేదీ ముఖ్యమంత్రి ఇష్టానికే వదిలేసినట్టు చెప్పారు. అటు నుంచి సమాధానం రాకపోవడంతో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు మంగళవారం ఉదయం 11 గంటలకు తాము వస్తున్నామనీ, అక్కడే చర్చకు రావాలని కోరినట్టు తెలిపారు. సీఎం రాలేకపోయినా సరే… ఆయన పక్షాన ఉప ముఖ్యమంత్రి గానీ, వ్యవసాయశాఖ మంత్రి గానీ, లేకపోతే ఎవరైనా మంత్రులు వచ్చినా తాము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
నీళ్లు, నియామకాలు, నిధులను తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. బనకర్లకు పచ్చజెండా ఊపుతూ, కృష్ణా నీటిని ఆంధ్రకు తరలిస్తే ఆయన కండ్లు మూసుకున్నారని మండిపడ్డారు. రైతుభరోసా, రైతు రుణమాఫీ దక్కని రైతుల జాబితాలు, ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలు, బోనస్ రాక మిల్లర్లకు అమ్ముకుని నష్టపోయిన రైతుల జాబితాలతో తాను చర్చించేందుకు వచ్చినట్టు చెప్పారు. గత కాంగ్రెస్ పాలన నాటి రోజులను మళ్లీ తెచ్చారనీ, రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
మాట తప్పడం రేవంత్ రెడ్డికి అలవాటు
మాట తప్పడం, పారిపోవడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటేనని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 2018లో కొడంగల్‌లో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేశారని తెలిపారు. జీహెచ్‌ఎంసీలో బీఆర్‌ఎస్ సొంతగా గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మరోసారి మాట తప్పి పారిపోయారని గుర్తుచేశారు. సోషల్ మీడియాలో పిల్లలు పోస్టు పెడితే గజ గజ వణికిపోయే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించేందుకు కేసీఆర్ అవసరం లేదనీ, బీఆర్‌ఎస్‌లో ఏ నాయకుడైనా సరిపోతాడని అన్నారు. అసెంబ్లీలో మైక్ ఇవ్వకుండా కాలక్షేపం చేస్తున్నారనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు.