మానవత్వం మంటగలిసింది. అగ్రకులోన్మాదం అప్పుడే లోకం చూస్తున్న రెండునెలల పసికందు ప్రాణం తీసింది. నాగర్‌కర్నూల్ లోని కుమ్మెరలో ఈనెల18న చోటుచేసుకున్న ఈ ఘటన భూస్వామ్య పోకడను, దానిలోని రక్షసత్వాన్ని తట్టిలేపింది. అయినప్పటికీ ప్రభుత్వం గానీ, అధికార యంత్రాంగం గానీ స్పందించలేదు. మాది ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే ముఖ్యమంత్రి రేేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో జరిగిన ఈ దారుణంపై ఇంతవరకు పట్టించుకోలేదు. కారణం, అగ్రవర్ణ, పెత్తందారి మూలాలేనా? గ్రామంలో ఇంత వివక్ష రాజ్యమేలుతున్నా ఎవరూ ప్రశ్నించకపోవడం బాధాకరం. అదే గ్రామానికి చెందిన చంద్రకళ అనే దేవదాసి కొడుకు గణేష్ దళిత యువతిని కులాంతర వివాహం చేసుకున్నాడు. అతని అక్క కీర్తి మరొకరిని కులాంతర వివాహం చేసుకుంది. సామాజికంగా దళితులు, రజకులు కావటం, ఆర్థికంగా సెంటు భూమి లేకపోవడం, ఆ కుటుంబం వివక్షకు, దాడికి, చివరకు చిన్నారి హత్యకు దారితీసేవరకు వెళ్లాయి. పెత్తందారులుగా చలామణి అవుతున్న గ్రామ సర్పంచ్ తుకారం రెడ్డి ఇంటి పక్కనే ఆ కుటుంబం, నివాసం ఉండేది.
పలుమార్లు ‘మీరు ఉంటున్న ఇంటి అడుగు స్థలం కూడా నాదేనని’ ఘర్షణకు దిగిన సందర్భాలున్నాయి. దీంతో దొరలకు భయపడి ఆ కుటుంబం చాలాకాలం బయటే జీవించింది. ఇటీవల కుమ్మెరలో ప్రతి ఏడాదిలాగే మల్లన్న జాతర జరగ్గా, దానికి గణేష్ అక్క కీర్తి వెళ్లింది. అక్కడే ఉన్న శ్రీనివాస్ రెడ్డి ‘గుడి లోపలికి వెళ్లటానికి వీల్లేదు’ అని హుకుం జారిచేశాడు. ‘దీంతో మేమెందుకు వెళ్లకూడదు.. మేం మనుషులం కాదా? దేవుడి దగ్గరికి వెళ్లే హక్కు మాకు లేదా? దేవుడిని మేము దర్శించుకోకూడదా’ అని నిలదీసింది.. రూ. వంద ఫీజు చెల్లించి లోపలికి వెళ్లాలని చెప్పగా చెల్లించింది. కానీ, రశీదు అడిగింది. దీంతో అగ్రహించిన రెడ్డి ‘తక్కువ కులం దానా.. దొమ్మరి దానా’ అని పత్రికలో రాయలేని విధంగా బూతులు తిట్టాడు. విషయం తెలుసుకున్న గణేష్ ‘గ్రామంలో అగ్రకుల ఆధిపత్యం పెచ్చరిల్లుతుంది. మహిళలని చూడకుండా దౌర్జన్యం చేశారు, దీనికి కళ్లెం వేయాలి’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రెచ్చిపోయిన పెత్తందారులు ఎనిమిది మంది సుమారు మూడున్నర గంటల పాటు అక్కడే గణేశుని దొరకబట్టి గదిలో కుక్కి చితకబాదారు.
విడతలవారీగా దాడిచేసి తీవ్రంగా కొట్టారు. తన కొడుకును కొట్టొద్దని చంద్రకళ కాళ్లమీద పడ్డా వినలేదు. మహిళని అని చూడకుండా తన్నారు. గణేష్ భార్య మౌనిక, సోదరి కీర్తి ‘కొట్టకండి అవసరమయితే మేము ఊరు వదిలివెళ్తాం’ అంటూ బతిమిలాడిన వినలేదు.. పచ్చి బాలింతగా ఉన్న మౌనిక ‘నా రెండు నెలల పసిబిడ్డను చూసైనా వదిలిపెట్టండి’ అని ప్రదేయపడినప్పటికీ వినకుండా ఆ పసిబిడ్డను కూడా కాలితో తన్ని ప్రాణం తీశారు. అమానవీయంగా చిన్నారిని హత్య చేసిన ఆ గ్రామ అగ్రకుల పెత్తందారులపై బాధితులు ఫిర్యాదు చేయడానికి 100కి డయల్ చేయగా పోలీసులు స్పందించలేదు. పైగా బాధితుల పక్షాన నిలవాల్సిన పోలీసులు అగ్రకులస్తులకు లొంగిపోవడం పెద్దఎత్తున చర్చ కు తావిచ్చింది. రివర్స్‌లో నిందితుల ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు, బాధితులు ఫిర్యాదు చేస్తే మాత్రం పట్టించుకోకపోవడం విచారకరం.
దీన్నిబట్టి చట్టం ఉన్నవారికి చుట్టం వలే మారుతుందన్న మాటలకు ప్రత్యక్ష రూపం. ఈ దాడిలో ఎనిమిది మంది పాల్గొంటే ముగ్గురిని మాత్రమే అరెస్టు చేశారు. మిగతావారు ఎక్కడీ వీరంతా స్థానిక ఎమ్మెల్యే బంధువులు, అనుచరులు కావడంతోనే ఈ కేసులో నుంచి వారిని తప్పిస్తున్నట్టు తెలుస్తోంది. వెంటనే దీనిపై విచారణ వేగవంతం చేసి, మిగిలినవారిని కూడ అరెస్టు చేయాలి. బాధితులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం స్పందించాలి. గ్రామంలో కులవివక్ష పునరావృతం కాకుండా అవగాహనా కార్యక్రమాలు, సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయాలి. ఇంతటితో ఈ సమస్య పరిష్కారం కాదు, అంతకన్నా ముందు అగ్రకులాల ఆధిప్యతం, వారి భూస్వామ్యం నశించే విధంగా చర్యలు తీసుకోవాలి. బడిలో, గుడిలో కూడా సమానత్వంపై చర్చ చేసి, అందరూ సమానమనే భావన తీసుకురావాలి. ఇది ప్రస్తుత పరిస్థితిలో చాలా అవసరం.
ఎందుకంటే, తెలంగాణలో ప్రత్యేకించి మత, కుల విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కొన్ని శక్తులు ఆజ్యం పోస్తున్నాయి. దీనివల్లే అగ్రకుల ఆధిపత్యం, మెజారిటీ మతోన్మాదం పెచ్చరిల్లుతున్నాయి. దాడులు, దౌర్జన్యాలు, లైంగికదాడుల వంటి హత్యలకు కారణమవుతున్నాయి. రాష్ట్రంలో సుమారు 143 కుల దురహంకార హత్యలు చోటుచేసుకున్నాయి. ఉత్తర తెలంగాణలో నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో వీడీసీ ముసుగులో అట్టడుగు వర్గాలను సాంఘిక బహిష్కరణలు జరుగుతున్నాయి. దాడులు, దౌర్జన్యాలు విపరీతంగా సాగుతున్నాయి. ప్రత్యేకించి ఆరెస్సెస్, సంఘ పరివార్ పేరిట సోషల్ మీడియాల్లో ముస్లిం, క్రైస్తవ వ్యతిరేకత రెచ్చగొట్టడం, విద్వేషాలు నింపడం, దాడులకు ఉసిగొల్పడం వంటివి చేస్తున్నాయి. శివాజీ, అంబేద్కర్ విగ్రహాల పోటీపెట్టి మహనీయులకు కూడా మతం రంగు పులిమి ఘర్షణలను తీసుకొస్తున్నాయి.
మేడారం జాతరలో కోవా బన్నులో కల్తీ ఉందని, పేరు అడిగి తెలుసుకున్న తర్వాత ముస్లిం కావడంతో, యూట్యూబ్ ఛానల్ ముసుగులో హిందుత్వ మతోన్మాదులు దౌర్జన్యానికి ఒడికట్టారు. మతసామరస్యాన్ని కోరుకునే మన సమాజం కోవాబన్ను అమ్ముకునే చిరు వ్యాపారికి బాసటగా నిలబడింది. మతోన్మాదుల ఆటలు సాగనివ్వమని ప్రకటించింది. కమ్మెర చిన్నారి విషయంలో కూడా సమాజం ఐక్యంగా నిలబడాలి. ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాడాలి. ఈ ఘటనపై బీజేపీ మౌనం వీడాలి. రాష్ట్ర అధ్యక్షుడు కూడా మహబూబ్‌నగర్ జిల్లా వాసే, అతను ఎందుకు స్పందించడం లేదు.
ఇద్దరు కేంద్రమంత్రులు ఏం చేస్తున్నట్టు. ఇదేనా మీరు చెప్పే హిందూ ధర్మం? బాధితుల పక్షాన నిలబడతారా? అగ్రకులస్తుల పక్కన చేరతారా అన్నది దీంతో బయటపడాలి. రాష్ట్రమంతా గమనిస్తున్నది. ఇప్పటికైనా అధికార, ప్రతిపక్షాలు చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగేవరకూ పోరాడాలి. కనీసం నిలువ నీడలేని వారికి ఇందిరమ్మ ఇల్లుతో పాటు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించాలి. ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. జాతరలో ధర్మకర్తల పేరుతో చెలరేగుతున్న అగ్రకులాల ఆధిపత్యానికి చెక్‌పెట్టాలి. వారిని ధర్మకర్తల నంచి తొలగించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతంం కాకుండా ప్రభుత్వం చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే ప్రజాఉద్యమాలతో సర్కార్ దిగొచ్చేలా చేయాలి.
టి.స్కైలాబ్‌బాబు
9177549646



