Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజివైద్యవిద్యలో నాణ్యతుందా?

వైద్యవిద్యలో నాణ్యతుందా?

- Advertisement -

‘వైద్యోనారాయణోహరి’ అన్నారు పెద్దలు. అంటే వైద్యులు దేవతలతో సమానమని. ప్రాణాలను కాపాడేది వైద్యులు. అలాంటివారికి ఇచ్చే శిక్షణ ఎలా ఉంటుందనేది ఈనాటి సమస్య. ఒక డాక్టర్‌ను తయారు చేసే విద్యాసంస్థలు లోపభూయిష్టంగా ఉంటే ఎక్కడ నుంచి పరిజ్ఞానం లభిస్తుందన్నది ప్రశ్న. ”ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ” ఏర్పాటు చేయాలన్న తలంపుతో అప్పటి రాష్ట్రప్రభుత్వం రికార్డుస్థాయిలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయడం మెచ్చుకోదగినదే. విడతల వారీగా 26 కొత్త కాలేజీలు ప్రారంభమైనాయి. అయితే, నిబంధనల ప్రకారం ఉండాల్సిన గదులు, హాస్టల్స్‌, అధ్యాపకులు, ల్యాబ్‌లు, ల్యాబోరేటరీలు, అనుబంధ ఆస్పత్రులు లేకపోతే నైపుణ్యత కలిగిన వైద్య విద్యా ర్థులు బయటకు ఎలా వస్తారు. అలా శిక్షణ సరిగాలేని వారు ప్రాణాలను ఎలా కాపాడతారు?
జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) ఇటీవల ప్రభుత్వ, ప్రయివేటు కాలేజీల్లో తనిఖీలు నిర్వహించింది. చాలా ప్రయివేటు కాలేజీల్లో సగానికిపైగా అధ్యాపకులు లేరు. నిబంధనల ప్రకారం ఉండాల్సిన దానికంటే ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, రెసిడెంట్లు, ట్యూటర్లు, సిబ్బంది తక్కువగా ఉన్నారు. మౌలిక సదుపాయాలు ఘోరంగా ఉన్న కాలేజీలకు నోటీసులు జారీ చేసింది. ఇది ఆందోళన కలిగించే అంశం. మరి ప్రభుత్వ కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి ఉంటే ఎలా? ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోనూ చాలావరకు శాశ్వత భవనాలు లేవు. ఇరుకు గదుల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన వెంటిలేషన్‌ లేక అవస్థలు పడుతున్నారు. ఐదారు కాలేజీల్లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. కాలేజీ ఒకచోట, హాస్టల్‌ వసతి మరోచోట ఇలా విద్యార్థులు నరకయాతన పడుతున్నారు. ఇవన్నీ ఎన్‌ఎంసీ బృందం తనిఖీల్లో బయటపడ్డాయి. ఈ సమస్యలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం కాదా?
ప్రస్తుతం పాత, కొత్త వాటితో కలుపుకుని రాష్ట్రంలో 35 ప్రభుత్వ వైద్య కళాశాలలు నడుస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2022లో ఏడు, 2023లో తొమ్మిది, గతేడాది ఎనిమిది కొత్తగా ఏర్పడ్డాయి. దీనికి ప్రయివేటు మెడికల్‌ కాలేజీలు అదనం. ఒక మెడికల్‌ కాలేజీ కేవలం తరగతి గదులు, ల్యాబ్‌లు, భవనం మాత్రమే కాదు. పూర్తిస్థాయి మౌలిక వసతులు, అనుభవజ్ఞులైన బోధనా సిబ్బంది, ప్రధానంగా రోగులతో నిండిన అనుబంధ ఆసుపత్రి అవసరం. వాస్తవ పరిస్థితుల్లో అనేక కాలేజీలు పాక్షిక భవనాలతోనే ప్రారంభమై, ఇప్పటికీ కొన్ని చోట్ల తాత్కాలిక ప్రీఫ్యాబ్రికేటెడ్‌ షెడ్లలో తరగతులు సాగుతున్నాయి. ఫ్యాకల్టీ, పరికరాల కొరత, లైబ్రరీల్లో తగిన పుస్తకాలు లేకపోవడం, ప్రయోగశాలల్లో పాత పరికరాలే ఉండటం విద్యార్థుల ప్రాక్టికల్‌ శిక్షణను దెబ్బతీస్తున్నాయి. తాత్కాలిక భవనాలతో ఇబ్బందులు పడుతున్నామని, అధ్యాపకులు లేకపో వడం వల్ల శ్రద్ధ పెట్టలేకపోతున్నామని తనిఖీ బృందం ఎదుట సమస్యలను విద్యార్థులు ఏకరువు పెట్టారు. కాలేజీలను ఏర్పాటు చేసే సమయం లోనే తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నది నిపుణులు అభిప్రాయం.
ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం 150 సీట్లకు ఒక్కో కాలేజీలో 600 పడకలు ఉండాలి.116 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫె సర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, 78 మంది రెసిడెంట్లు, సిబ్బంది, ఐదు పడకల గల ఐసీయూ, పుస్తకాలు, ల్యాబ్‌లు… ఇలా చాలా నిభంధనలు ఉన్నాయి. వాటిని ప్రభుత్వాలు అమలు చేయాలి. అప్పుడే నిబంధనలు పాటించడం లేదని ప్రయివేటు మెడికల్‌ కాలేజీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. అలా చేయకుండా ఎక్కువ కాలేజీలను ఏర్పాటు చేశామని గత పాలకులు, నైపుణ్యం కలిగిన విద్యను అందించేందుకు కష్టపడుతున్నామని ప్రస్తుత పాలకులు చెప్పుకుంటే ఉపయోగం ఉండదు.
కేంద్రప్రభుత్వం మెడికల్‌ విద్యకు తగిన ప్రోత్సాహం ఇవ్వడం లేదన్నది వాస్తవం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సహకారం శూన్యమే. విభజన హామీలను పక్కన పెట్టేయడం, బీబీనగర్‌లోని ఎయిమ్స్‌ను పట్టించుకోకపోవడం, పైగా నిధులివ్వకుండా దేశంలో మెడికల్‌ విప్లవం వచ్చిందని గొప్పలు పోవడం మరీ విడ్డూరం. కేరళ వంటి కొన్ని రాష్ట్రాల అనుభవాలు చూస్తే ప్రతి దశలో మౌలిక వసతులను పటిష్టం చేస్తున్నది. కాలేజీలను అభివృద్ధి చేయడం వల్ల దీర్ఘకాలంలో మెరుగైన ఫలితాలు తీసుకొస్తుంది. అందుకే మన రాష్ట్రం, కేరళలాంటి రాష్ట్రాల అనుభవాలను పరిశీలించి వైద్య విద్యకు మెరుగులు దిద్దవచ్చు. అప్పుడే ప్రజలు ప్రాణాలు కాపాడే వైద్యులు తయారవుతారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img