Thursday, May 15, 2025
Homeరాష్ట్రీయంఇది ప్రజాస్వామ్యమా? రేవంత్‌రెడ్డి రాచరిక రాజ్యమా?

ఇది ప్రజాస్వామ్యమా? రేవంత్‌రెడ్డి రాచరిక రాజ్యమా?

- Advertisement -

– సీఎం హోదాలో దిగజారుడు మాటలు సరికాదు
– కొత్తగా ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చారో
– శ్వేతపత్రం విడుదల చేయండి : హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

అధికారులను ఉరి తీయాలని విజిలెన్స్‌, ఎన్డీఎస్‌ఏ నివేదికలు చెబుతాయా? ఇది ప్రజాసామ్య రాజ్యమా? రేవంత్‌రెడ్డి రాచరిక రాజ్యమా? అని బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్‌కు నియామక పత్రాలిచ్చి తమ ఘనతగా చెప్పుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి తంటాలు పడ్డాడని విమర్శించారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి నాలుగు మంచి మాటలు చెప్పాల్సిందిపోయి వారికి హెచ్చరికలు చేసి భయభ్రాంతులకు గురిచేయడం సబబు కాదని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ది ఉంటే 18 నెలల కాంగ్రెస్‌ పాలనలో కొత్తగా ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చారనే విషయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కాళేశ్వరం కూలిపోయిందని సీఎం ప్రచారం చేయడాన్ని తప్పుబట్టారు.కాళేశ్వరంపై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఖర్చు చేసింది రూ.1.50 లక్షల కోట్లు అంటావు.. ఓసారి లక్ష కోట్ల రూపాయలంటావు…గుంటకు నీళ్లివ్వలేదంటావు..మరోసారి 50 వేల ఎకరాలకే నీళ్లు ఇచ్చారంటావు…ఇలా ఇష్టమొచ్చినట్టు మాట్లాడమేంటని ప్రశ్నించారు. సీఎం హోదాలో దిగజారి మాట్లాడటం సరిగాదని హితవు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించినట్టు అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డినే శ్వేతపత్రంలో చెప్పారుగదా? అని అడిగారు. 99శాతం ప్రాజెక్టు బాగుండి ఒక్క శాతం మాత్రమే మరమ్మతుకు గురి కావడం వాస్తవం కాదా? అని నిలదీశారు. కుప్పకూలిన ఎస్‌ఎల్‌బీసీ భవితవ్యం గురించి ఒక్కమాట కూడా ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రూ. 3900 కోట్లు ఖర్చుచేసి 12 కిలోమీటర్ల టన్నెల్‌ పనులు పూర్తి చేసింది వాస్తవం కాదా? అని నిలదీశారు. రేవంత్‌ పాలనలో ఇరిగేషన్‌ పెరగలేదనీ, ప్రజలకు ఇరిటేషన్‌ పెరిగిందని విమర్శించారు. ఆరు ప్రాజెక్టులు పూర్తి చేసి ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పి మాట తప్పారని ఎత్తిచూపారు. నీటిపారుదల శాఖలో 30 ఈఎన్సీ, సీఈ పోస్టుల్లో 15 ఖాళీగా ఉన్నాయనీ, 57 సూపరింటెండ్‌ ఇంజినీర్ల పోస్టులకు గానూ 40 ఖాళీలున్నాయని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -