ఆకలి
ఆగమంటే ఆగదు
మండుతున్న ప్రేవుల్లో
రణనినాదాలు చెలరేగుతాయి
ఉపాధి లేక
అసంతృప్తి అంతర్లీనంగా రగులుతుంటే
కప్పిపెట్ట ఎవరితరం
వ్యవస్థ నిండా
అవినీతి పేరుకుపోతుంటే
ఆమోదిస్తున్నారనుకునే పాలకులకు
హెచ్చరిక జారీ కాబోతుందనే సంకేతం
అహంకారం జూలు విదిల్చి
ప్రజాస్వామ్యాన్ని నీరుగార్చే ప్రయత్నాలు
కొద్దోగొప్పో సోషల్ మీడియా బువ్వ పెడుతుందనుకున్న జనం
వ్యసనమో నిజమో తేల్చే సమయం లేదు
తెలిసిందల్లా యువతరం బుర్రల్లో తిరుగుబాటు ధ్వని
రాజ్యమంతా వ్యాపించిన నిరసన జ్వాలలు
అధికార మదానికి చరమ గీతాలు
హింసా అహింసా మధ్యే మార్గాలు లేవు
అగ్ని కీలల్లో పాలక భవనాలు
తరిమి తరిమి కొట్టారు
రోజుల్లోనే ఎంతటి మార్పు
అది మౌలిక మార్పో కాదో
ఇదమిత్థంగా తేలదు
ఆంక్షలు దాటిన తరం ఆకాంక్షలు నెరవేరునో లేవో
కాలం వంతెన మీద సయ్యాటలే!!
- మంజుల సి హెచ్