Sunday, December 28, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఇదా మన సంస్కృతి!

ఇదా మన సంస్కృతి!

- Advertisement -

వాళ్లిప్పుడు క్రిస్టియన్ల కోసం వచ్చారు. రేపు మన కోసమూ వస్తారు. వాళ్లు మానవత్వం మరచినవాళ్లు. అరాచకమై నిలిచినవాళ్లు. అసహన అలంకారులు. విద్వేషం వారి భాష. విధ్వంసం శ్వాస. ఉన్మాదం వారి తాత్వికత. ప్రేమ, కరుణలు వారి శత్రువులు. సనాతన ధర్మ పెదవులపై పలుకులు. అధర్మం, హింస ఆచరణలు. వీళ్లెవరో ఇంకా చెప్పాలా! మహానటులు, అబద్దా నిబద్దులు. చట్టాలను తమ చేతుల్లోకి తీసుకున్న మతోన్మాదులు. పిచ్చివాడి చేతిలో రాయుంటే కొన్ని గాయాలతో బయటపడవచ్చు. మతోన్మాది చేతిలో అధికారముంటే, దేశం మొత్తం రక్తం చిందుతుంది. హృదయాలన్నీ మానని గాయాలవుతాయి. ఇప్పుడు దేశం మనస్సు గాయాలతో శోకిస్తున్నది. భిన్నత్వంలో ఏకత్వం రక్తమోడుతున్నది. ప్రజాస్వామిక లౌకికవిలువలు విలపిస్తున్నవి. సనాతనం మాటున కిరాతకం రాజ్యమేలుతున్నది. వాళ్లిప్పుడు క్రిస్మస్‌ వేడుకలపైకి వచ్చారు. రేపు మన ఇంట్లో వేడుకల్లోకి వస్తారు. విలువల్ని విశ్వాసాల్ని ధ్వంసమొనరుస్తారు.

కరుణామయుడు, శాంతి బోధకుడుగా పేరున్న క్రీస్తు జన్మదినాన్ని ప్రపంచమంతా డిసెంబరు మాసపు చివరలో పండుగ చేసుకుంటారు. పూల మెరుపులతో చెట్టు, శాంతా క్లాజ్‌ ఎర్రని టోపీలు ధరించి క్రిస్మస్‌ తాతయ్య అందించే తీయతీయని బహుమతులు. ఇంటి ముందు నక్షత్ర వెలుగుల అలంకరణ, ప్రార్థనలు అందరం కలిసే చేసుకునే వాళ్లం. అది రంజాన్‌ అయినా సంక్రాంతి అయినా క్రిస్మస్‌ అయినా అందరికీ పండుగలానే అనిపించేది. అన్నీ పంచుకునే వాళ్లమే. ఎందుకంటే వాళ్లంతా భారతీయులే. క్రిస్మస్‌రోజు నా స్నేహితుడి ఇంట్లో అరిసెలు, సకినాలు, సేమియా చేసి పెట్టేవాళ్లు. మన వంటకాలే. క్రీస్తు పేదలకోసం పోరాడి శిలువ వేయబడ్డాడని ప్రేమించే వాళ్లము. మరిప్పుడు వీళ్లకు ఏమయింది. ఇలా పండుగ సమూహాలపై మూకలు దాడులు చేస్తున్నారు. నక్షత్ర వెలుగుల అలంకరణలపై పెట్రోలు పోసి తగలేస్తున్నారు. ఏ ధర్మం, ఏ దేవుడు చెప్పాడిలా చేయమని, ఏమిటీ పైశాచిక ఆనందం! క్రిస్మస్‌ వేడుకలు జరుపుకుంటున్న క్రిస్టియన్లను బెదిరిస్తూ, దుర్భాషలాడుతూ విధ్వంసానికి పాల్పడుతున్నారు విశ్వహిందూ పరిషత్‌, ఆరెస్సెస్‌, భగజరంగ్‌దళ్‌ సమూహాలు. చర్చీల ముందుచేరి జైశ్రీరాం అంటూ హనుమాన్‌ చాలీసాలు చదువుతూ ఆటంకాలు కలిగిస్తున్నారు. పోలీసులుకానీ, అధికారులుకానీ, ప్రభుత్వంకానీ ఈ అరాచకాన్ని అడ్డుకోవటం లేదు. కనీసం ప్రభుత్వమూ ఇది సరికాదని ప్రకటించనూ లేదు.

డిసెంబరు 22న ఢిల్లీలోని లాజ్‌పత్‌నగర్‌ ఏరియాలో కొంతమంది మహిళలు, పిల్లలు, శాంతాక్లాజ్‌ టోపీలు ధరించి క్రిస్మస్‌ వేడుకలు జరుపుకుంటూ ఉంటే, ఒక రౌడీ మూకవచ్చి, వాళ్లని బెదిరించి వెళ్లగొట్టారు. సెంట్‌మెరీస్‌ స్కూల్‌, పానిగ్గాన్‌, నల్‌చారిలో వీహెచ్‌పి, భజరంగ్‌దళ్‌ మూక వెళ్లి క్రిస్‌మస్‌ అలంకరణను కాల్చేసి జైశ్రీరాం అనే నినాదాలు చేశారు. ఛత్తీస్‌గఢ్‌ రారుపూర్‌లోని ఒక మాల్‌పై దాడిచేసి క్రిస్మస్‌ అలంకరణ పగులగొట్టి తగులబెట్టారు. ఒరిస్సాలో క్రిస్‌మస్‌, శాంతాక్లాస్‌ టోపీలను విక్రయిస్తున్న వీధి పేద అమ్మకందార్లను బెదిరిస్తూ, ఇది క్రిస్టియన్‌ దేశం కాదు, హిందూదేశం, ఇక్కడ అమ్మవద్దని వారిని తరిమేసారు కొందరు కాషాయ మూకలు. ఇంకా ఘోరమైన విషయాలేమిటంటే, సత్యనిష్ట ఆర్య అనే హిందూ అవతారమెత్తిన ఒక కాషాయధారి, మూకతో కలిసి ప్రార్థన చేయిస్తున్న పాస్టర్‌ దగ్గరికి వెళ్లి మైకులాక్కుని, ‘మీ జీసస్‌ ఎలా పుట్టాడో చెప్పు’, మేరీకి ఎలా కడుపు అయిందో చెప్పమని అసహ్యంగా ప్రశ్నించాడు. ఒక మహిళ అడ్డువచ్చి వివరిస్తుంటే, ‘నువ్వెలా పుట్టావో నీకు తెలుసా’ అని కించపరిచాడు. ఛత్తీస్‌గఢ్‌ బదెటివ్డా గ్రామంలో క్రిస్టియన్‌ మతం పుచ్చుకున్న ఓ పెద్దాయన చనిపోతే, అతన్ని హిందూ ఆచారంలోనే అంత్యక్రియలు జరపాలని అడ్డుకుని దౌర్జన్యం చేశారు.

ఒక పాస్టర్‌ ఇంట్లోని బైబిల్స్‌ అన్ని బయటపడేసి నిప్పుపెట్టి, ఆయనతోనే మంటల్లో వేయించి, దౌర్జన్యంగా క్షమాపణలు రాయించడం ఎంత దారుణం! ఇవన్నీ జరుగుతుండగానే మన మహానట చక్రవర్తి ఢిల్లీలోని కెథడ్రాల్‌ చర్చిలోకి వెళ్లి క్రిస్‌మస్‌ ప్రార్థనా గీతాలకు తన్మయుడై భక్తిని ప్రదర్శించాడు. క్రిస్టియన్లతో మన దేశానికి ఎప్పటి నుండో ఆత్మీయ సంబంధాలున్నాయనీ వాక్రుచ్చారు కూడా. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఢిల్లీ, కేరళ, తమిళనాడు మొదలైన ప్రాంతాల్లో క్రిస్‌మస్‌ వేడుకలను లక్ష్యంగా చేసుకుని విధ్వంసం చేస్తుంటే పోలీసు ఉన్నా పట్టించుకోలేదు. ‘సబ్‌కా సాత్‌’ అంటే ఇదేనా! రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ప్రకారం, ఏ మతాన్నయినా, విశ్వాసాన్నయినా కలిగివుండవచ్చు. ఈ హక్కును అడ్డుకోవడం అంటే రాజ్యాంగాన్ని అడ్డుకోవడమే. ఒకవేళ ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే, చర్యలు తీసుకోవాల్సింది చట్టం, ప్రభుత్వం, కానీ ఈ కాషాయ మూకలు కాదు. రాబోయే రోజుల్లో కేరళ, తమిళనాడు, బెంగాల్‌లలో ఎన్నికలు జరుగనున్నాయి. వాటిలో నినాదాలను రెచ్చగొట్టి గెలవాలన్న దుష్టపన్నాగంలో భాగమే ఈ దాడులు. వీటిని దేశంలోని సమస్త ప్రజలు వ్యతిరేకించి, దేశ సహనపూరిత వారసత్వాన్ని చాటాలి. ఐక్యతగా నిలవాలి!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -