ఎఫ్-35, యుద్ధ నౌకలను మోహరించిన అమెరికా
కారకాస్ : అమెరికా, వెనిజులా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. వెనిజులాకు చెందిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌లోకి అమెరికా ఎఫ్-35 యుద్ధ విమానాలను పంపింది. దీనిపై మండిపడిన వెనిజులా ఈ చర్యను చొరబాటుగా అభివర్ణించింది. తమ సార్వభౌమత్వంపై అమెరికా దాడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ సముద్ర తీరానికి 75 కిలోమీటర్ల దూరంలో యుద్ధ విమానాలు కన్పించాయని వెనిజులా విదేశాంగ, రక్షణ మంత్రిత్వ శాఖలు తెలియజేశాయి. కరేబియన్ ద్వీపంలో అమెరికాకు చెందిన ప్యూర్టో రికోలో ట్రంప్ గత నెలలో పది ఎఫ్-35 యుద్ధ విమానాలను మోహరించిన విషయం విదితమే.
వాస్తవానికి గత మూడు దశాబ్దాలుగా కరేబియన్ ద్వీపంలో అమెరికా తన సైనిక సన్నాహకాలను ముమ్మరం చేస్తోంది. కరేబియన్ సముద్రం మీదుగా అమెరికాకు మాదక ద్రవ్యాల రవాణా జరుగుతోందన్న కారణంతో దానిపై పోరాడేందుకు ఎనిమిది యుద్ధ నౌకలను, ఓ అణు జలాంతర్గామిని కూడా ఆ ప్రాంతానికి పంపింది. అయితే వెనిజులా సమీపంలోనే ఈ మోహరింపులన్నీ జరగడం గమనార్హం. తన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారని వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురో ఆరోపించారు. అందుకోసమే సైనిక మోహరింపులు జరుపుతున్నారని విమర్శించారు. అయితే మాదక ద్రవ్యాలను రవాణా చేసే వారితోనే సాయుధ ఘర్షణకు తలపడుతున్నామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు.