Monday, September 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపేరుకే వరంగల్‌ 'ఐటీ హబ్‌'!?

పేరుకే వరంగల్‌ ‘ఐటీ హబ్‌’!?

- Advertisement -

పెద్ద కంపెనీలు రావు.. సౌకర్యాలు ఉండవు..
దృష్టి సారించని పాలకులు
మౌలిక వసతుల కల్పనతో అవకాశాలు
స్థానిక యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా స్టార్టప్‌లు


నవతెలంగాణ-కాజీపేట
హైదరాబాద్‌ తర్వాత అతి పెద్ద నగరం వరంగల్‌కు ఎడ్యుకేషన్‌ హబ్‌గా పేరుంది. దాంతో ఇక్కడ ఐటీ సెక్టార్‌ వేగంగా విస్తరిస్తుందని అందరూ ఊహించారు. కానీ, అంతంతమాత్రంగానే ఉంది. కంపెనీలు ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదని, వచ్చిన కొన్ని కంపెనీలకు కనీస సౌకర్యాలు ప్రభుత్వాలు ఇవ్వలేకపోతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఫలితంగా కొన్ని సంస్థలు మూతపడే దశకు వచ్చాయని సమాచారం. వరంగల్‌ నగర శివారు మడికొండలో ఐటీ హబ్‌ ఏర్పాటై పదేండ్లు దాటినా ఎలాంటి అభివృద్ధి కానరావట్లేదు. 2014లో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఐటీ హబ్‌ కోసం 40 ఎకరాల భూమి కేటాయించింది. ఐటీ సెజ్‌, ఐటీ నాన్‌ సెజ్‌కు కలిపి మొత్తంగా 47 ఎకరాల స్థలం కేటాయించారు. అందులో రోడ్ల నిర్మాణం, విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు మొదలైన మౌలిక సదుపాయాలు కల్పించారు. రోడ్‌ ఏరియా, ఓపెన్‌ స్పేస్‌ ఏరియా, కమర్షియల్‌ ఏరియా, పబ్లిక్‌ ఏరియాకి దాదాపు 17 ఎకరాల స్థలం కేటాయించారు. మిగిలిన 30 ఎకరాల ప్లాటింగ్‌ ఏరియా స్థలంలో సైంట్‌ లిమిటెడ్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థకు ఐదెకరాలు, ఐటీ ఇంక్యుబేషన్‌కి రెండు ఎకరాలు స్థలం కేటాయించారు. అందులో 30 వేల చదరపు అడుగుల ఐటీ ఇంక్యుబేషన్‌ బిల్డింగ్‌ నిర్మించగా జెన్పాక్ట్‌, టెక్‌ మహీంద్రా సంస్థలు ప్రారంభించగా, కొంతకాలం తర్వాత టెక్‌ మహీంద్రా సంస్థని మూసివేసింది.

ఆ బిల్డింగ్‌ మొత్తంగా జెన్‌ ప్యాక్‌ సంస్థ తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. అలాగే ఏకే రాపోలు తీరం ప్రయివేట్‌ లిమిటెడ్‌ స్టూడియోకి ఎకరం 10 గుంటలు, సాహి సిస్టం ప్రయివేట్‌ లిమిటెడ్‌కి ఐదు ఎకరాలు, టేక్‌ వేవ్‌ ఇన్ఫోటెక్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ సంస్థకి ఎకరం 20 గుంటలు, కూల్‌ కారు ఇన్ఫో సొల్యూషన్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌కి 30 గుంటలు, అలాగే క్వాడ్రాంట్‌ టెక్నాలజీస్‌, లెనోరా ఐటీ సొల్యూషన్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ సంస్థలకి స్థలం కేటాయించారు. ఇందులో ప్రస్తుతం సెయింట్‌ లిమిటెడ్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ, ఇంక్యుబేషన్‌ సెంటర్‌లో జన్పాక్ట్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ, క్వాడ్రాంట్‌ టెక్నాలజీ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆరోపణలొస్తున్నాయి. 2016 నుంచి స్టార్టప్‌లు ఏర్పాటయ్యాయి. ఈలోగా బడా కంపెనీలు వచ్చేస్తున్నాయని చెప్పి ఉన్న స్టార్టప్‌లనూ ఖాళీ చేయించారు. సియెంట్‌, ఆ తర్వాత టెక్‌మహీంద్ర, జెన్‌పాక్ట్‌ క్యూ కట్టాయి. అయినా ఆశించిన స్థాయిలో ఉపాధి అవకాశాలు రాలేదు. వీటిలో టెక్‌ మహీంద్ర సంస్థ వరంగల్‌ ఆఫీస్‌ని పూర్తిగా మూసేసింది.

మౌలిక మార్పులు చేస్తే అవకాశాలు
కాజీపేట ఐటీ హబ్‌ అభివృద్ధి మంచి లక్ష్యంతో ప్రారంభించినా, పెద్ద కంపెనీలను ఆకర్షించడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఉద్యోగులను నిలుపుకోవడం వంటి సవాళ్లను అధిగమించాల్సి ఉంది. ఈ సమస్యలను పరిష్కరిస్తే, ఈ ప్రాంతం ఐటీ హబ్‌గా ఎదగగలదు. వరంగల్‌లోని ఐటీ హబ్‌ మొదటి దశ విజయవంతం అయిన తర్వాత, ప్రభుత్వం రెండవ దశను ప్రారంభించింది. దీని కోసం ఐటీ, ఐటీ-సంబంధిత సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విస్తరణలో భాగంగా మరిన్ని కంపెనీలు, ముఖ్యంగా కొత్తగా ప్రారంభమయ్యే (స్టార్టప్‌) సంస్థలకు స్థలం కేటాయించారు. ఈ ఐటీ హబ్‌ ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ఇప్పటికే అనేకమంది ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లు ఈ హబ్‌లో ఉద్యోగాలు పొందారు. పెద్ద పెద్ద అంతర్జాతీయ కంపెనీలు (ఉదాహరణకు, ఇన్ఫోసిస్‌, విప్రో) రావడం లేదు. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు పరిమితంగా ఉంటున్నాయి. ఐటీ హబ్‌లో సరిపడా మౌలిక సదుపాయాలు లేకపోవడం సమస్యగా మారింది. సరైన నిర్వహణ లేకపోవడం, విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు వంటి సమస్యలు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. అంతేకాదు, తక్కువ వేతనాలు, అవకాశాలు తక్కువగా ఉండటంతో, ఇక్కడ పనిచేసే ఉద్యోగులు ఎక్కువ జీతాల కోసం హైదరాబాద్‌ లేదా ఇతర పెద్ద నగరాలకు వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఇక్కడ పనిచేసే ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతోంది. ప్రభుత్వం మారిన తర్వాత, ఐటీ హబ్‌ల అభివృద్ధిపై సరిగా దృష్టి పెట్టడం లేదని, నిర్వహణ సరిగ్గా లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తే స్థలం కేటాయిస్తాం
మడికొండ ఐటీ పార్క్‌లో దాదాపు పది నుంచి 15 ఎకరాల స్థలం ఉంది. ఔత్సాహికులైన ఇంటర్‌ ఫ్యునర్స్‌ (పారిశ్రామికవేత్తలు) సాఫ్ట్‌వేర్‌ సంస్థలు నెలకొల్పడానికి ముందుకు వస్తే వారికి స్థలం కేటాయించి తగిన ప్రాధాన్యతను కల్పిస్తాం. మడికొండ ఐటీ పార్క్‌ హైదరాబాద్‌ హైవే మెయిన్‌ రోడ్డుకి దగ్గర ఉన్నందున త్వరలో మామునూరుకు ఎయిర్‌పోర్టు రానున్నందున రవాణా సౌకర్యం సులభతరం అవుతుంది. తద్వారా పారిశ్రామిక అభివృద్ధి వేగవంతంగా జరుగుతుంది.
టీజీఐఐసీ వరంగల్‌ జోనల్‌ మేనేజర్‌ అజ్మీర స్వామి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -