Thursday, October 30, 2025
E-PAPER
Homeజాతీయంమీ డేటా భద్రమేనా?

మీ డేటా భద్రమేనా?

- Advertisement -

‘సేల్స్‌ఫోర్స్‌’పై భారీ హ్యాకింగ్‌ దాడి
కోట్లాది మంది సమాచారం తస్కరణ
వారి వివరాలూ సైబర్‌ నేరగాళ్ల చేతికి
బాధిత జాబితాలో డిస్నీ, గూగుల్‌, టొయోటా వంటి పెద్ద కంపెనీలు
టెక్‌ వరల్డ్‌లో ఆందోళన
ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల్లో కొత్త టెన్షన్‌
అప్రమత్తత అవసరమని హెచ్చరిస్తున్న నిపుణులు

ప్రస్తుత డిజిటల్‌ ప్రపంచంలో డబ్బు కన్నా అతి ముఖ్యమైంది వ్యక్తిగత సమాచారం. ఈ వ్యక్తిగత సమాచారం ఇప్పుడు మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్స్‌, ఇతర గాడ్జెట్లు, జీమెయిల్స్‌, ఇతర సోషల్‌ మీడియా వేదికల ఖాతాల్లో నిక్షిప్తమై ఉంటున్నది. అయితే అనుకోకుండా ఆ సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కితే ఇక అంతే సంగతులు. ఆ సమాచారం చాలా వరకు దుర్వినియోగమయ్యే ప్రమాదమే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు వ్యక్తిగత సమాచార భద్రత, గోప్యతకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నాయి.

మెటా వంటి పెద్ద పెద్ద టెక్‌ దిగ్గజ కంపెనీలనూ పలు దేశాలు వివరణలు కోరిన సందర్భాలూ ఉన్నాయి. కాగా ఇప్పుడు టెక్‌ ప్రపంచంలో ఒక కొత్త అలజడి మొదలైంది. ఒక ఆందోళనకు గురి చేసే వార్త ఒకటి చక్కర్లు కొడుతున్నది. ప్రపంచ ప్రఖ్యాత క్లౌడ్‌ సర్వీస్‌ కంపెనీ సేల్స్‌ఫోర్స్‌పై హ్యాకర్లు దాడి చేశారనీ, కోట్లాది మంది వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించారని పలు టెక్‌ రిపోర్టులు చెప్తున్నాయి. ‘ది స్టేట్స్‌ మెన్‌’ వార్త కథనం దీనిని వివరించింది.

న్యూఢిల్లీ : కంపెనీలు తమకు కావాల్సిన సమాచారాన్ని సహజంగానే కంప్యూటర్లలో నిల్వ చేస్తుంటాయి. కానీ వినియోగదారుల సమాచారాన్ని నిల్వ చేయటం కోసం, ఆ డేటాను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఇంటర్నెట్‌ సాయంతో ఒక్క లాగిన్‌ ద్వారా పొందటం కోసం కంపెనీలు క్లౌడ్‌ బేస్డ్‌ సాఫ్ట్‌వేర్‌ను వాడుతుంటాయి. ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ను అందించే ప్రఖ్యాత కంపెనీయే సేల్స్‌ఫోర్స్‌. ఇది ఒక అమెరికన్‌ టెక్నాలజీ కంపెనీ. సాధారణ ప్రజలు దీనిని ఉపయోగించే అవకాశాలు అంతగా లేకున్నా.. అనేక పెద్ద కంపెనీలు వాడుతుంటాయి. వాటి వినియోగదారుల వివరాల నిర్వహణకు ఉపయోగిస్తుంటాయి. అయితే హ్యాకర్లు ఆ సాఫ్ట్‌వేర్‌లోని లోపాలను వినియోగించి డేటాను దొంగిలించారని సమాచారం. ఇప్పుడు ఈ వార్తే అందరినీ కలవరపాటుకు గురి చేస్తున్నది.

ప్రఖ్యాత బ్రాండ్ల యూజర్ల డేటా లీక్‌
ఈ డేటా లీక్‌లో డిస్నీ, గూగుల్‌, టొయోటా, అడిడాస్‌, సిస్కో, ఐకియా, పండోరా వంటి ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్ల వినియోగదారుల వివరాలు ఉన్నాయని తెలుస్తున్నది. ఇవి రోజూ కోట్లాది మంది వినియోగదారుల సమాచారాన్ని నిర్వహించే సంస్థలు కావటంతో వాటిపై హ్యాకర్ల దృష్టి పడిందని విశ్లేషకులు చెప్తున్నారు. వినియోగదారుల పేర్లు, ఈ-మెయిల్‌ అడ్రస్‌, ఫోన్‌ నెంబర్లు, పుట్టిన తేదీలు, లాయల్టీ ప్రోగ్రామ్‌ వివరాలు వంటివి లీక్‌ అయినట్టు చెప్తున్న జాబితాలో ఉన్నాయి. అయితే హ్యాకర్లకు ఇలాంటి సమాచారమే పెద్ద ఆయుధమవుతుందని టెక్‌ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే.. వీటిని ఉపయోగించి వారు ఫిషింగ్‌ (అంటే మోసపూరిత ఈ-మెయిల్స్‌), ఐడెంటిటీ థెఫ్ట్‌ వంటివి చేయగలరని వివరిస్తున్నారు.

ప్రతి ఒక్కరూ ప్రమాదంలోనే..!?
ప్రస్తుత ప్రపంచంలో ప్రజల జీవితాలు ఆన్‌లైన్‌లోనే నడుస్తున్నా యన్నది ఎవరూ కాదనలేరు. షాపింగ్‌, బ్యాంకింగ్‌, మెడికల్‌ రికార్డులు, గేమింగ్‌ ఇలా ప్రతి ఒక్కటి దీనితోనే ముడిపడి ఉన్నది. దీంతో వినియోగదారుల వివరాలు అనేక యాప్‌లు, వెబ్‌సైట్లలో నమోదై ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి సమాచారమే హ్యాకర్లకు లక్ష్యంగా మారింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రమాదంలోనే ఉన్నారన్న విషయాన్ని కాదనలేమని సైబర్‌ నిపుణులు చెప్తున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాస్‌వర్డ్‌ల మార్పు
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చాలంటున్నారు. ఒక్క పాస్‌వర్డ్‌ను అనేక వెబ్‌సైట్లలో వాడొద్దనీ, పాస్‌వర్డ్‌ కూడా చాలా సింపుల్‌గా కాకుండా బలంగా ఉండాలని చెప్తున్నారు. ఇందు కోసం ప్రత్యేక పాస్‌వర్డ్‌లు వాడాలని సూచిస్తున్నారు. 2-ఫ్యాక్టర్‌ ఆథెంటికేషన్‌ (2ఎఫ్‌ఏ)ను సెట్‌ చేసుకోవడం ద్వారా అదనపు భద్రత లభిస్తుందని చెప్తున్నారు.

అకౌంట్లను తరచూ పరిశీలించాలి
బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌లు, క్రెడిట్‌కార్డ్‌ లావాదేవీలు, డిజిటల్‌ వాలెట్‌లు వంటివి అన్నీ పరిశీలించాలని సూచిస్తున్నారు. ఏదైనా అనుమానాస్పద లావాదేవీ కనిపిస్తే వెంటనే రిపోర్ట్‌ చేయాలని అంటున్నారు.

ఐడెంటిటీ ప్రొటెక్షన్‌ సేవల వినియోగం
వీటి వినియోగం ద్వారా ఈ-మెయిల్‌ లేదా ఫోన్‌ నెంబర్‌ డార్క్‌ వెబ్‌లో కనిపిస్తే అలర్ట్‌ ఇస్తాయని సూచిస్తున్నారు. కొన్ని సేవలు బీమా, రికవరీ సహాయం కూడా అందిస్తాయని నిపుణులు చెప్తున్నారు.

అప్రమత్తత అవసరం
మన డిజిటల్‌ జీవితం రోజురోజుకూ విస్తరిస్తోంది. ప్రతి యాప్‌, సైట్‌లో ‘ఐ అగ్రీ’ అనే క్లిక్‌ను మనం తరచూ చూస్తుంటాం. దీనర్థం.. ఈ క్లిక్‌ ద్వారా మన వ్యక్తిగత సమాచారం ఎక్కడో నిల్వ అవుతుంది. ఇప్పుడు సేల్స్‌ఫోర్స్‌ హ్యాకింగ్‌ ఘటన ప్రపంచవ్యాప్తంగా డేటా భద్రతపై కొత్త చర్చకు దారి తీసిందని మేధావులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామంతో ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలు మరిన్ని కఠినమైన గోప్యతా నియమాలు తీసుకురావొచ్చనీ, కంపెనీలకు కఠిన పరీక్షలే ఎదురు కావచ్చని చెప్తున్నారు. ఎన్ని చట్టాలున్నా.. ఈ డిజిటల్‌ ప్రపంచంలో వ్యక్తిగత సమాచార రక్షణకు మన అప్రమత్తత, అవగాహనే కీలకమని సూచిస్తున్నారు.

హ్యాకర్లు ఈ డేటాను ఎలా వాడతారు?
సున్నితమైన ఈ పర్సనల్‌ డేటాకు సైబర్‌ నేరస్థుల నుంచి డిమాండ్‌ ఉంటుంది. ఈ డేటాను ‘డార్క్‌ వెబ్‌’లో అమ్మకానికి పెడతారు. ఇందులో ప్రతీ పేరు, ఈ-మెయిల్‌, ఫోన్‌ నెంబర్‌కు కూడా ఒక ధర ఉంటుంది. దీంతో ఈ వివరాలను పెద్ద ఎత్తున విక్రయిస్తారు. ఆ సమాచారాన్ని పొందడం ద్వారా సైబర్‌ నేరస్థులు వాటిని ఫిషింగ్‌ స్కామ్‌లకు వాడతారు. కొందరు హ్యాకర్లు కంపెనీల విశ్వసనీయతకు విఘాతం కలిగించడం, అవమానానికి గురయ్యేలా చేయడం, ప్రతీకారం తీర్చుకోవడం, రాజకీయ ఉద్దేశాలతో నష్టం చేకూర్చటం వంటి లక్ష్యాలతో డేటా చోరీకి పాల్పడుతుంటారు. సాధారణంగా ఒక సంస్థ డేటా ఉల్లంఘన జరిగిందని గుర్తించడానికి సగటున ఐదు రోజులు పడుతుంది. కొన్ని సార్లు అది వారం లేదా నెలల తర్వాతే బయటపడుతుందని నిపుణులు చెప్తున్నారు.

దాడి వెనుక ఆ గ్రూపు హస్తం?
ఈ దాడి వెనుక లాప్సస్‌ సైబర్‌ క్రైమ్‌ నెట్‌వర్క్‌ హస్తం ఉన్నదని భావిస్తున్నారు. ఇది గతంలో మైక్రోసాఫ్ట్‌ వంటి పలు దిగ్గజ కంపెనీలను కూడా హ్యాక్‌ బాధితులుగా మిగిల్చిందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. వాస్తవానికి లాప్సస్‌డాలర్‌ అనేది ‘సోషల్‌ ఇంజినీరింగ్‌’లో నిపుణులైన హ్యాకర్ల గ్రూపు. అంటే సిస్టమ్‌లను బద్దలు కొట్టడం కాకుండా మనుషులను మోసం చేసి వారి లాగిన్‌ వివరాలు పొందడం వీని ప్రధాన పద్ధతి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -