కేంద్రమంత్రి లలన్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలకు తేజస్వీ కౌంటర్
ఓటు వేయకుండా తాళాలు వేస్తే ఊరుకుంటామా..! ఖబడ్దార్ అంటూ హెచ్చరిక
మోకామా /విభూతిపూర్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారపర్వం హాట్‌హాట్‌గా సాగుతోంది. మోకామా, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆర్జేడీ అభ్యర్థి అనంత్‌సింగ్, విభూతిపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థి అజయ్ కుమార్‌కు మద్దతుగా తరునియా మైదాన్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆర్జేడీ నేత, మహాగట్‌బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వీయాదవ్ పాల్గోని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి లలన్‌సింగ్‌పై నిప్పులు చెరిగారు. బాబాసాహేబ్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికీ కల్పించిన ఓటు హక్కును లేకుండా చేయటానికి..ఇది నీ అబ్బ జాగీరా అంటూ ప్రశ్నించారు. అటు కేంద్రం, ఇటు నితీశ్ సర్కార్ ఎన్ని అడ్డంకులు కల్పించినా ధైర్యంగా ఓటువేయాలని కోరారు.
‘పేదలు, అత్యంత వెనుకబడిన వారు ఓటు వేయడానికి తమ ఇండ్లనుంచి బయటకు రాకూడదని కేంద్రమంత్రి లలన్ సింగ్ అన్నారంటే.. అసలు కేంద్ర ఎన్నికల కమిషన్ ఉన్నదా?” అని తేజస్వీ ప్రశ్నించారు. ప్రతిపక్ష ముఖ్యమంత్రి అభ్యర్థి సింగ్ దళితులు, పేదలు, అత్యంత వెనుకబడిన తరగతుల వారు ఓటు వేయకుండా నిరోధించడంపై బహిరంగం గా మాట్లాడుతున్నారని, ఇది ఎన్నికల కమిషన్ నిబంధనల ఉల్లంఘనకు సమానమని ఆరోపించారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఎన్డీఏ బలహీనపరిచేలా కుట్ర చేస్తోందని అన్నారు. బీహార్‌లో స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగేలా చూడాలని అధికారులను కోరారు.
సీపీఐ(ఎం)అభ్యర్థిని గెలిపించండి :తేజస్వీ
సీపీఐ(ఎం)అభ్యర్థి అజయ్ కుమార్‌ను గెలిపించాలని తేజస్వీయాదవ్ కోరారు. విభూతిపూర్ అసెంబ్లీ నియోజకవర్గం తరునియా మైదాన్‌లో ఆయనకు మద్దతుగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో తేజస్వీ మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి గురించి ప్రత్యేక శ్రద్ధ చూపుతానని హామీ ఇచ్చారు. కేంద్రంలోని బీజేపీ, బీహార్‌లోని నితీశ్ సర్కార్‌ను అడ్రస్ లేకుండా తరిమివేయాలని పిలుపునిచ్చారు.



