హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. జట్టు కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను నియమించింది. అయితే, ఈ నిర్ణయం తాత్కాలికమే. సన్‌రైజర్స్ జట్టుకు కొన్ని సీజన్ల నుంచి రెగ్యులర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియా ఆటగాడు పాట్ కమిన్స్ గాయం కారణంగా ఐపిఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కమిన్స్ జట్టుతో చేరేవరకు ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం బుధవారం అధికారికంగా వెల్లడించింది. మరోవైపు సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఇటీవలి టి20 వరల్డ్ కప్‌లో ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో 193 స్ట్రైక్‌రేట్‌తో కిషన్ 317 పరుగులు చేశాడు. ఇక అభిషేక్ శర్మ పూర్తి స్థాయిలో రాణించకపోయినా.. కొన్ని మ్యాచుల్లో తనదైన శైలిలో ఆడి ఆకట్టుకున్నాడు. ఇషాన్ కిషన్ గత ఏడాది ఝార్ఖండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ (టి20)లో ఝార్ఖండ్‌ను విజేతగా నిలబెట్టాడు. కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ రాణించాడు.



