భార్యా భర్తలంటే ఒకరికి ఒకరు తోడూ నీడా. ఇది ఎవ్వరూ కాదనలేని నిజం. అలాంటి భార్యకు తగిన గౌరవం, సముచిత స్థానం భర్త ఇవ్వాలి. భార్య విలువ తెలిసిన భర్తలు ఎవరైనా తమ భార్యలను గౌరవిస్తారు. కానీ కొంత మంది భార్యను నలుగురిలో అవమానిస్తుంటారు. ఎప్పుడూ ఆమెను చిన్నచూపు చూస్తూ అవహేళన చేస్తుంటారు. ‘నేను భర్తను ఏమైనా చేయొచ్చు’ అని ఇలా ప్రవర్తిస్తే భవిష్యత్‌లో కచ్చితంగా కొన్ని సమస్యలు వస్తాయి. అలాంటి కథనం గురించే ఈ వారం ఐద్వా అదాలత్(ఐలమ్మ ట్రస్ట్)లో తెలుసుకుందాం…
మీనాక్షికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. భర్త రాజుకు బంగారం షాపు వుంది. వారికి పెండ్లి జరిగి పదిహేనేండ్లు అవుతుంది. పెండ్లయిన ఇన్నేండ్లకు ‘నేను నా భర్తతో కలిసి ఉండలేను, విడిపోతాను’ అంటూ మా దగ్గరకు వచ్చింది. ‘అసలు ఏం జరిగింది, ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని భర్త నుండి ఎందుకు విడిపోవాలనుకుంటున్నావు. ముందు నీ సమస్య ఏంటో చెప్పు. అప్పుడు ఏం చేయాలో చెప్తాము’ అన్నాము.
దానికి ఆమె ‘నేను ఎవరికి చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. అందరికీ నా సమస్య చిన్న విషయంగా కనిపిస్తుంది. మీరు కూడా అలాగే అనుకుంటారు. అయినా చెబుతాను అంటూ తన సమస్య గురించి చెప్పుకొచ్చింది. ఆమెకు ఇంట్లో అస్సలు గౌరవం లేదు. రాజుతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఆమెను పట్టించుకోరు. ఇంట్లో ఏం జరిగినా, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా అందులో ఆమె భాగస్వామ్యం ఉండదు. రాజు అన్ని విషయాలు అక్క, తమ్ముడితో మాట్లాడుకొని నిర్ణయించుకుంటాడు. మీనాక్షికి అసలు ఏ విషయమూ చెప్పడు.
ఒక వేళ ఆమె అడిగినా ‘నీకు సంబంధం లేదు’ అంటాడు. మీనాక్షికి పెండ్లిలో ఇచ్చిన కట్నంతోనే రాజు వ్యాపారం ప్రారంభించాడు. కానీ ఆ వ్యాపారం ఎలా ఉంది, ఎంత ఆదాయం వస్తుంది వంటి విషయాలేమీ ఆమెతో చెప్పడు. వ్యాపారం బాగా పెరిగి మరో నాలుగు షాపులు కూడా పెట్టాడు. కానీ ఈ ఇవేవీ ఆమెకు తెలియదు. కారు, ఇల్లు కొన్నారు. ఆదాయం బాగుంది. కానీ మీనాక్షికి మాత్రం ఆ ఇంట్లో విలువ లేదు, సంతోషం అంతకన్నా లేదు. ఇంట్లోకి కావల్సిన సరుకులు కూడా అతనే తీసుకొస్తాడు. పిల్లల ఫీజు కోసం ఆమె ఎన్నో సార్లు అడిగితే తప్ప డబ్బులు ఇవ్వడు.
ప్రతి దాని కోసం భర్తను అడగడం కంటే తనే ఉద్యోగం చేయాలనే నిర్ణయానికి వచ్చింది. కానీ దానికి రాజు ఒప్పుకోలేదు. ఆదాయం పెరగడంతో అతని అలవాట్లు కూడా మారిపోయాయి. స్నేహితులతో బయట తిరగడం, బెట్టింగ్ ఆడడం మొదలుపెట్టాడు. వ్యాపారం నిర్లక్ష్యం చేశాడు. దాంతో నష్టాలు వచ్చాయి. ఆస్తులన్నీ ఒక్కొక్కటీ అమ్మేశాడు. చివరకు ఇల్లు, కారు కూడా అమ్మేశాడు. రెండు షాపుల్లో ఒకటి తమ్ముడు చూసుకుంటున్నాడు. ఇంకొకటి అతని అక్క చూసుకుంటుంది. అప్పులు బాగా పెరిగిపోయాయి. దాంతో షాపు వాళ్ల అక్క అతనికి ఇచ్చేసింది. కానీ షాపులో బంగారం, వెండి ఏమీ లేదు. దాంతో మీనాక్షి వాళ్ల నాన్న మళ్లీ కొంత డబ్బు ఇచ్చాడు. రాజు దాన్ని కూడా నిలుపుకోలేకపోయాడు. అప్పుల వాళ్లు ఇంటికి వచ్చేవాళ్లు. ఈ అప్పుల గురించి మీనాక్షికి ఏమీ తెలియదు.
అప్పుల్లో కొంత అతని తమ్ముడు తీర్చుతానని చెప్పాడు. రాజుకు వ్యాపారం తప్ప బయటకు వెళ్లి ఉద్యోగం చేయడం రాదు. అప్పుల బాధ భరించలేక తాగుడుగు అలవాటు పడ్డాడు. అతని ప్రవర్తనతో మీనాక్షితో పాటు పిల్లలు కూడా విసిగిపోయారు. మాటి మాటికి పుట్టింటికి వెళ్లి డబ్బులు తీసుకురమ్మని మీనాక్షిని వేధించేవాడు. లేకపోతే ‘నువ్వు నాకు అవసరం లేదు’ అంటాడు. ఈ బాధలన్నీ భరించలేక మీనాక్షి తన ముగ్గురు పిల్లల్ని తీసుకొని అక్క దగ్గరకు వచ్చేసింది. అక్కడ కూడా ఆమెను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ప్రతి సారి వచ్చి గొడవలు పెట్టుకుంటున్నాడు. అందుకే ఆమె అతని నుండి విడిపోవాలనే నిర్ణయానికి వచ్చింది.
అంతా విన్న తర్వాత మేము రాజును పిలిపించి మాట్లాడితే అతను అసలు తన తప్పేమీ లేదని అంతా మీనాక్షిదే తప్పనట్టు చెప్పుకొచ్చాడు. ‘ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం, బట్టలు ఉతకడం, గిన్నెలు కడగడం కూడా ఆమెకు రాదు. ఎప్పుడూ ఏదో ఒక సాకు చెబుతూనే ఉంటుంది. నేను చెప్పిన మాట అస్సలు వినదు. అయినా నేను వేరే ఆమెను చూసుకోకుండా ఆమెను భరిస్తున్నాను. ఇప్పుడు ఆమెకు వచ్చిన ఇబ్బంది ఏమిటో అర్థం కావడం లేదు. ఇంట్లో నుండి వెళ్లిపో అనగానే వెళ్లిపోయింది. ఇలా మీ దగ్గరకు వచ్చింది’ అన్నాడు.
దానికి ఆమె ‘నా అంతట నేను వెళ్లలేదు, అతనే మా బట్టలు సర్ది బస్సు ఎక్కించాడు’ అంది. దానికి అతను ‘అవును మేడమ్ ఇంట్లో ఎప్పుడూ గొడవలే. అది కావాలి, ఇది కావాలి అని ఏదో ఒకటి అడుగుతూనే ఉంటుంది. అప్పుల వాళ్లు ఇంటికి రావొద్దు అంటుంది. అప్పు ఇచ్చిన వాళ్లు రాకుండా ఎలా ఉంటారు?’ అన్నాడు. ‘ఎప్పుడో అర్థ రాత్రి వచ్చి వాళ్లు తలుపు కొడతారు. అప్పుడు రాజు ఇంట్లో ఉండడు. నేనేం సమాధానం చెప్పాలి. ఇదంతా నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఒకతనైతే నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం చెప్పినా ఆయన పట్టించుకోలేదు. ఇక ఏ ధైర్యంతో నేను అక్కడ ఉండాలి’ అని సూటిగా ప్రశ్నించింది. మీనాక్షి అంత కచ్చితంగా చెప్పడంతో అతను అయోమయంలో పడ్డాడు. వెంటనే ‘మేడమ్ మీనాక్షి నన్ను వదిలి ఎప్పుడూ ఇన్ని రోజులు ఉండలేదు. కానీ ఇప్పుడు ఉంది. అంటే నా వల్ల ఆమె ఎంత ఇబ్బంది పడిందో అర్థమవుతుంది. ఇకపై నా భార్యా పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటాను.
వాళ్లను నాతో పంపించండి’ అన్నాడు. దానికి మీనాక్షి ‘రాజు ఉద్యోగం చేయడం లేదు, వ్యాపారం లేదు. ఆ ఊళ్లో నాకూ పిల్లలకు విలువ లేకుండా చేశాడు. అతనితో ఉండడం నాకు ఇష్టం లేదు’ అంది. దానికి మేము ‘రాజు నువ్వు ఉద్యోగం చేయకుండా ఉంటే ఎలా? కుటుంబాన్ని ఎలా పోషిస్తావు. నీ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నావు. వాళ్లు స్కూల్‌కి కూడా వెళ్లడం లేదు. నీ వల్ల నీ భార్య చాలా బాధపడుతుంది. మానసికంగా కుంగిపోయింది. నీకసలు భార్యంటే విలువ లేదు. ఆమెను ఓ మనిషిగానే చూడడం లేదు. అందుకే ఆమె అంతగా విసిగిపోయింది. ఆమెకు కొంచెం టైం ఇవ్వు. ముందు నువ్వు ఉద్యోగంలో చేరి సంపాదించు. నువ్వు మారావని ఆమె నమ్మాలి. అప్పుడే ఆమె నీతో సంతోషంగా వస్తుంది. అప్పటి వరకు ఉద్యోగం చేస్తూ నెలకు పది వేలు ఆమెకు పంపించు. నువ్వ పూర్తిగా మారావని మీనాక్షికి నమ్మకం వచ్చిన తర్వాత అప్పుడే మేము ఆమెతో మాట్లాడి నీతో పంపిస్తాము’ అని చెప్పి పంపించాము.
వై వరలక్ష్మి, 9948794051