– యూఎస్ ఎయిడ్ సాయం నిలిపివేతపై పరిశోధకుల ఆందోళన
– రాబోయే కాలంలో కోటిన్నర మంది చనిపోవచ్చు
– వీరిలో మూడో వంతు మంది చిన్నారులే
– ఆరోగ్య సేవల నిలిపివేతతో ప్రబలనున్న వ్యాధులు
– ట్రంప్ బాటలోనే మరికొన్ని సంపన్న దేశాలు
వాషింగ్టన్ : విదేశీ సాయాన్ని నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రపంచవ్యాప్తంగా 1.4 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. వీరంతా ఆర్థికంగా, శారీరకంగా బలహీనులే. వీరిలో మూడో వంతు మంది అభం శుభం తెలియని చిన్నారులేనని ప్రతిష్టాత్మక లాన్సెట్ జర్నల్‌లో మంగళవారం ప్రచురితమైన ఓ పరిశోధన నివేదిక తెలియజేసింది. ఈ వారం స్పెయిన్‌లో జరగబోయే ఐరాస సహాయ సదస్సుకు అనేక మంది ప్రపంచ నేతలు, వ్యాపార దిగ్గజాలు హాజరవుతారు. దుర్బలులకు సాయం పెంచే విషయంపై వారు చర్చించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విడుదలైన పరిశోధన నివేదిక ప్రాధాన్యత సంతరించుకుంది.
సాయంలో భారీ కోతలు
ప్రపంచంలోని 133 దేశాలకు చెందిన డేటాను అధ్యయనం పరిశీలించింది. 2001-2022 మధ్యకాలంలో యూఎస్ ఎయిడ్ సంస్థ అందించిన సాయంతో వర్ధమాన దేశాలలోని 9.1 కోట్ల మంది ప్రజలు మరణం నుండి బయటపడ్డారని పరిశోధకులతో కూడిన అంతర్జాతీయ బృందం అంచనా వేసింది. యూఎస్ ఎయిడ్ సాయంలో ట్రంప్ ప్రభుత్వం 83 శాతం కోత పెట్టింది. దీనివల్ల మరణాల రేటు పెరిగే అవకాశం ఉన్నదని పరిశోధ కులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక సాయంలో కోత కారణంగా 2030 నాటికి 1.4 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉన్నదని, వీరిలో 45 లక్షల మంది ఐదేండ్ల లోపు వయసున్న చిన్నారులు ఉండవచ్చునని వారు అంచనా వేశారు. అంటే ఏటా ఏడు లక్షల మంది చిన్నారులు సాయం అందక చనిపోతారన్న మాట. ఆర్థిక సాయంలో కోత విధించడానికి ముందు అమెరికా ప్రభుత్వ మొత్తం వ్యయం లో యూఎస్ ఎయిడ్ వాటా 0.3 శాతం ఉండేది. అమెరికా పౌరులు యూఎస్ ఎయిడ్‌కు రోజుకు 17 సెంట్లు అందజేసే వారు. అంటే ఏడాదికి 64 డాలర్లు సమకూర్చేవారన్న మాట.
సాయంతో తగ్గిన మరణాలు
యూఎస్ ఎయిడ్ మద్దతుతో నడిచిన కార్యక్రమాల కారణంగా మరణాల సంఖ్య పదిహేను శాతం తగ్గిందని పరిశోధనలో తేలింది. అలాగే ఐదేండ్ల వయసు లోపు చిన్నారులలో మరణాలు 32 శాతం మేర తగ్గి పోయాయి. వివిధ వ్యాధుల కారణంగా మరణాలు సంభవిం చకుండా నివారించడంలో యూఎస్ ఎయిడ్ సాయం ఎంతగానో ఉపకరించింది. యూఎస్ ఎయిడ్ నుండి తక్కువ సాయం పొందుతున్న లేదా అసలు సాయమే పొందని దేశాలతో పోలిస్తే ఎక్కువ మద్దతు అందుకుంటున్న దేశాలలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్ మరణాలు 65 శాతం తగ్గాయి. మలేరియా, నిర్లక్ష్యానికి గురైన ఉష్ణమండల వ్యాధుల విషయంలోనూ మరణాలు సగానికి సగం తగ్గిపోయాయి.
అమెరికా బాటలో…
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ సహా పలు దేశాలు కూడా తమ విదేశీ సహాయ బడ్జెట్లను తగ్గించుకుంటామని ప్రకటించాయి. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్‌లో ఆయా దేశాల సాయం తగ్గితే రాబోయే సంవత్సరాలలో మరిన్ని మరణాలు సంభవించవచ్చునని అధ్యయన సహ రచయిత కాటరీనా మాంటీ చెప్పారు. కాగా స్పెయిల్‌లో జరిగే ఐరాస సమావేశానికి అమెరికా హాజరు కావడం లేదు. గత దశాబ్ద కాలంలో జరుగుతున్న అతి పెద్ద సహాయ సదస్సు ఇదే.
ఆరోగ్యసేవలపై ప్రభావం
ప్రపంచ దేశాలకు అందుతున్న మానవతా సాయంలో యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్ ఎయిడ్) సంస్థ 40 శాతం వరకూ సమకూరుస్తోంది. అయితే ఇది డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాకముందు మాట. ఆయన జనవరిలో శ్వేతసౌధంలో అడుగు పెట్టిన తర్వాత ఆ సాయానికి కోత పడింది. ఈ చర్య కారణంగా…దుర్బలులకు రెండు దశాబ్దాలుగా అందుతున్న ఆరోగ్య సేవలు నిలిచిపోవడమే కాక తిరోగమన బాట పడతాయని అధ్యయన సహ రచయిత, బార్సెలోనా ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ పరిశోధకుడు డేవిడ్ రసెల్లా హెచ్చరించారు. ‘స్వల్ప, ఓ మోస్తరు ఆదాయం కలిగిన అనేక దేశాలు ఈ చర్యతో తీవ్ర దిగ్భ్రాంతి చెందుతాయి. ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్ కంటే లేదా ప్రధాన ఆయుధ ఘర్షణ కంటే దీని స్థాయి అధికంగా ఉంటుంది’ ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.