Saturday, January 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఇప్పుడు ఫోన్ల ట్యాపింగ్‌ జరగడం లేదా?

ఇప్పుడు ఫోన్ల ట్యాపింగ్‌ జరగడం లేదా?

- Advertisement -

నాతో సహా మంత్రులవీ ట్యాప్‌ చేస్తున్నారు
డీజీపీ, ఇంటెలిజెన్స్‌ ఐజీ, సీపీ సమాధానం చెప్పగలరా…
మట్టి సాక్షిగా చెప్తున్నా… నేను ఏ తప్పూ చేయలేదు
అక్రమ, అనైతిక పనులకు పాల్పడలేదు
ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ డ్రామా
రేవంత్‌రెడ్డి అవినీతి, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తూనే ఉంటాం
నా వ్యక్తిత్వ హననం చేసిన వారినీ వదిలేది లేదు : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇప్పుడు రాష్ట్రంలో ఫోన్ల ట్యాపింగ్‌ జరగడం లేదని ఎవరైనా చెప్పగలరా?అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె తారక రామారావు (కేటీఆర్‌) ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనతోపాటు మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్‌ చేయిస్తున్నారని చెప్పారు. ఫోన్ల ట్యాపింగ్‌ జరగడం లేదని డీజీపీ, ఇంటెలిజెన్స్‌ ఐజీ, హైదరాబాద్‌ సీపీ మీడియా ముఖంగా సమాధానం చెప్పగలరా?అని అడిగారు. నెహ్రూ కాలం నుంచి ఇప్పటి వరకు శాంతి భద్రతలు, దేశ భవిష్యత్తు కోసం నిఘా విభాగాలు ఆ పనిచేస్తాయని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సిట్‌ విచారణకు ముందు, ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో ఏమీ లేదన్నారు. కాలక్షేపం కోసమే విచారణ చేశారని అన్నారు. ఆరు గ్యారెంటీల మోసం, 420 హామీల దగా, సింగరేణి బొగ్గు కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసమే సిట్‌ విచారణ పేరుతో ప్రభుత్వం డ్రామాలు ఆడుతున్నదని విమర్శించారు. ఎన్ని సార్లు పిలిచినా విచారణకు వెళ్తామన్నారు. రూ.50 లక్షలతో నోటుకు ఓటు కేసులో దొరికిన దొంగ ఇప్పుడు ముఖ్యమంత్రి కావడం వల్లే ఈ రాజకీయ కక్ష సాధింపులు జరుగుతున్నాయని అన్నారు. నాలుగు కోట్ల ప్రజలను నయవంచన చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని వదిలిపెట్టేది లేదన్నారు. కాంగ్రెస్‌ను బొంద పెట్టేదాకా నిద్రపోబోమని అన్నారు. గత 20 ఏండ్లుగా రాష్ట్రం కోసం, ప్రజల కోసం పని చేస్తున్నానని చెప్పారు.

డ్రగ్స్‌ తీసుకుంటాననీ, సినీ హీరోయిన్లతో సంబంధాలున్నాయంటూ తనపై వ్యక్తిత్వ హననం జరిగిందని అన్నారు. దీనికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. తన కుటుంబాన్ని, పిల్లలను కూడా మానసిక క్షోభకు గురి చేశారని చెప్పారు. వ్యక్తిత్వ హననం చేసిన వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి అవినీతి, కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలపైన వంద శాతం ప్రాణం పోయేదాకా పోరాడుతూనే ఉంటామన్నారు. తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పారు. లీకుల మీద ఆధారపడి ఈ ప్రభుత్వం నడుస్తున్నదని అన్నారు. మీడియా వాస్తవాలను గ్రహించి రాయలనీ, ప్రసారం చేయాలని సూచించారు. అమృత్‌ పథకంలో, సింగరేణి బొగ్గు కుంభకోణంలో సీఎం రేవంత్‌రెడ్డి బామ్మర్ది సృజన్‌రెడ్డి కీలక సూత్రధారి అనీ, ఆయనపై సిట్‌ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. విచారణ సమయంలో తారక రామారావు తప్ప ఏ రావు లేరని అన్నారు. ఈ విచారణలో తనతోపాటు మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్‌ అవుతున్నాయన్న నిజం తేలిపోయిందని వివరించారు. తాము భయపడే వాళ్లమైతే సమయం అడిగే వాళ్లమనీ, కోర్టును ఆశ్రయించే వాళ్లమని గుర్తు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో చీల్చి చెండాడతామని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -