Sunday, March 1, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్‌పై ఇజ్రాయిల్‌,అమెరికా దాడి

ఇరాన్‌పై ఇజ్రాయిల్‌,అమెరికా దాడి

- Advertisement -

– తిప్పికొడుతున్న టెహ్రాన్‌.. యూఎస్‌ స్థావరాలే లక్ష్యంగా క్షిపణుల ప్రయోగం
– ఒకవైపు చర్చలంటూనే దాడులకు దిగిన వైనం
– ఇజ్రాయిల్‌-అమెరికా దాడితో దక్షిణ ఇరాన్‌లో 70 మంది మృతి
– పాఠశాలపై జరిగిన దాడిలో మరో 50 మందికిపైగా బాలికలు మరణం
– తాజా పరిస్థితులపై రష్యా ఆగ్రహం


దుబాయ్‌ : మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఇరాన్‌పై ఇజ్రా యిల్‌, అమెరికా సేనలు శనివారం పెద్ద ఎత్తున విరుచుకుపడ్డాయి. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ, ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌ నివాసం, నిఘా ప్రధాన కార్యాలయం సహా మొత్తం 30 ప్రాంతాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. దక్షిణ ఇరాన్‌లోని మినాబ్‌లో ఉన్న ప్రాథమిక బాలికల పాఠశాలపై జరిగిన దాడిలో 50 మందికి పైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడి హౌర్మోజ్‌గాన్‌ ప్రావిన్స్‌లో మృతుల సంఖ్య 70కి చేరుకున్నదని అక్కడి అధికారులు చెప్పారు. 90 మందికి పైగా గాయా లయ్యాయని తెలిపారు. అయితే మృతులు, క్షతగాత్రుల సంఖ్యపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇటు ఇరాన్‌ కూడా ఇజ్రాయిల్‌- అమెరికా సేనలకు దీటుగా బదులిస్తోంది. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఎదురు దాడులు చేస్తోంది. 70 ఖండాంతర క్షిపణులను ఇరాన్‌ ప్రయోగించింది. కువైట్‌, ఖతార్‌, యూఏ ఈ, జోర్డాన్‌ వంటి పది గల్ఫ్‌ దేశాలలోని ఇజ్రాయిల్‌, అమెరికా స్థావరాలపై క్షిపణులు ప్రయోగించింది. ఇస్లామిక్‌ నాయకత్వంపై తిరుగుబాటు చేయాలని, ప్రభుత్వాన్ని హస్త గతం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇరాన్‌ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకొని తొలి దాడులు జరిగాయని వార్తలు వచ్చాయి. కెర్మన్‌షా, క్వమ్‌, ఇస్ఫహాన్‌, తబ్రిజ్‌, కరజ్‌లోని సైనిక స్థావరాలు, అలాగే దక్షిణాన ఉన్న కెనరాక్‌లోని నౌకాదళ స్థావరంపై దాడులు జరిగాయి. కుర్దిష్‌ ప్రాంతంలోని కమ్యరాన్‌ నగరంలో ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) స్థావరంపై కూడా బాంబు దాడి జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతా లలో దాడులు జరుగుతున్నాయని, రాజధాని టెహ్రాన్‌లోని నివాస భవనాలు, దుకాణాల నుంచి దట్టమైన పొగలు వ్యాపించాయని ఇరాన్‌ మీడియా తెలిపింది.

సురక్షిత ప్రాంతానికి ఖమేనీ?
ఇజ్రాయిల్‌-అమెరికా దాడుల తర్వాత 86 సంవత్సరాల ఖమేనీని ఇరాన్‌ సేనలు సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తోంది. ఆయన బంకర్‌లోకి వెళ్లినట్టు సమాచారం. యునైటెడ్‌ ఆరబ్‌ ఎమిరేట్స్‌, బV్‌ారైన్‌, కువైట్‌లలో పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయి. సైనిక స్థావరాల సమీపంలో నివసిస్తున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి పోవాలని ఇజ్రాయిల్‌ రక్షణ దళాలు ఇరాన్‌ పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి. క్షిపణి లాంఛర్లు సహా వందలాది ఇరాన్‌ సైనిక లక్ష్యాలపై దాడి చేశామని ఇజ్రాయిల్‌ సైన్యం చెప్పుకుంది. టెహ్రాన్‌ సమీపంలోని నర్మక్‌లో ఇరాన్‌ మాజీ అధ్యక్షుడు మహమూద్‌ అహ్మదినెజాబ్‌ నివసిస్తున్న ఇంటి పైనా దాడి జరిగింది. ఖతార్‌లోని అమెరికా వైమానిక స్థావరం వద్ద పేలుడు శబ్దం వినిపించింది. అనేక క్షిపణులను తిప్పికొట్టామని ఖతార్‌ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

మీరు మొదలు పెట్టారు.. మేం ముగింపు పలుకుతాం : ఇరాన్‌
ఇజ్రాయిల్‌-అమెరికా దాడులపై ఇరాన్‌ స్పందించింది. యుద్ధం మీరు మొదలు పెట్టారు.. మేము ముగింపు పలుకుతామంటూ ఒక స్టేట్‌మెంట్‌ విడుదల చేసింది. డ్రోన్లు, క్షిపణులతో తాము తొలుత ప్రతీకార దాడిని ప్రారంభించామనీ, ఇవి కొనసాగుతాయని ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్‌ క్రాప్స్‌ తెలిపింది. దీంతో ఈ పరిస్థితులు ఎక్కడకు దారి తీస్తాయోనన్న భయం మధ్యప్రాచ్యంలో నెలకొంది. ఇటు ఇరాన్‌పై దాడుల తర్వాత ఇజ్రాయిల్‌ అప్రమత్తమైంది. స్టేట్‌ ఆఫ్‌ ఎమర్జెన్సీని ప్రకటించింది. దేశవ్యాప్తంగా సైరన్లు మోగిస్తూ.. దేశ పౌరులను అప్రమత్తం చేసింది. ఇజ్రాయిల్‌ సైన్యం.. దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయిల్‌లో స్కూళ్లు, కార్యాలయాలు మూసివేశారు. ఇరాన్‌, ఇజ్రాయిల్‌ గగనతలం మూసివేశారు.

ఇరాన్‌ రక్షణ మంత్రి మృతి!
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ భీకర దాడుల్లో ఇరాన్‌ రక్షణ మంత్రి అమీర్‌ నాసిర్జాదే మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇరాన్‌ గార్డ్స్‌ కమాండర్‌ పక్సూర్‌ కూడా చనిపోయినట్టు సమాచారం. అలాగే ఇరాన్‌ సైన్యాధి పతి అమీర్‌ హతామి మరణిం చినట్టు వార్తలు వచ్చాయి. ఈ మేరకు ఇజ్రాయిల్‌ మీడియా వెల్లడిం చింది. అయితే టెహ్రాన్‌ మాత్రం ఆ వార్తలను కొట్టి పారేసింది. తమ ఆర్మీ చీఫ్‌ చనిపోలేదని ప్రకటించింది. దీంతో ఇరాన్‌ ఆర్మీ చీఫ్‌ మరణంపై వస్తున్న వార్తలు కలకలం రేపాయి.

మధ్యప్రాచ్యానికి విమాన సర్వీసులు బంద్‌
దాడుల నేపథ్యంలో అన్ని ప్రధాన విమానయాన సంస్థ లు మధ్యప్రాచ్యానికి సర్వీసులను రద్దు చేశాయి. ఇరాన్‌, ఇజ్రాయిల్‌లతో పాటు యూఏఈ, బహ్‌రైన్‌, ఖతార్‌లు తమ గగనతలాలను మూసివేశాయి. కాగా ఒకవైపు చర్చలు జరు గుతుండగానే ఇజ్రాయిల్‌, అమెరికా సేనలు సంయుక్తంగా దాడులు జరిపాయని ఇరాన్‌ సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్‌ఎన్‌ఎస్‌సీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటిని సమర్ధవంతంగా తిప్పికొడతామని తెలిపింది.

రంగంలోకి సౌదీ అరేబియా
తాజా దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియా కూడా ఇరాన్‌పై యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఈమేర కు యుద్ధానికి సన్నాహాలు మొదలు పెట్టింది. మిత్ర దేశా లను ఏకం చేసేపనిలో సౌదీ క్రౌన్‌ ప్రిన్స్‌ మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఉన్నట్టు సమాచారం. కువైట్‌ ఎమిర్‌, ఖతార్‌ ఎమిర్‌తో ఫోన్లలో చర్చలు జరిపారు. యూఏఈ, బహ్‌రైన్‌, ఖతార్‌, కువైట్‌, జోర్డాన్‌లకు మద్దతు ఇవ్వడానికి అందుబా టులో ఉన్న అన్ని వనరులనూ మోహరిస్తున్నట్టు తెలుస్తోంది.

భారతీయులకు ఇండియన్‌ ఎంబసీ సూచనలు
కాగా ఇండ్ల నుంచి అనవసరంగా బయటికి రావద్దని, సాధ్యమైనంత వరకూ ఆవాసాలలోనే ఉండాలని, పరిస్థితులను ఎప్పటికప్పుడు గమ నించాలని టెహ్రాన్‌లోని ఇండియన్‌ ఎంబసీ అక్కడి భారతీయులను కోరింది. అంతేకాదు గల్ఫ్‌లోని భారత రాయబార కార్యాలయాలు అప్రమత్త మయ్యాయి. భారత పౌరులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాయి. స్థానిక అధికారులు ఇచ్చిన సూచనలను పాటించాలని వివరించాయి. యూఏఈ, సౌదీ అరేబియా, జోర్డాన్‌తో పాటు గల్ఫ్‌ ప్రాంతాల్లోని పలు భారత ఎంబసీలు అడ్వైజరీలు జారీ చేశాయి.

పాలనను మార్చటం ఎవరివల్లా కాదు : ఇరాన్‌
అమెరికా నుంచి హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్‌ స్పందించింది. ఇరాన్‌లో పాలనను మార్చాలని అనుకో వడం ఎవరి వల్ల కూడా కాదని చెప్పింది. అది సాధ్యమ య్యే పనికాదని తెలిపింది. తమను తాము కాపాడుకోగల మని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎవరి సాయమూ తమకు అవసరం లేదని వివరించింది. ఉద్రిక్త పరిస్థితుల ను తగ్గించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేసింది.

టెహ్రాన్‌లో యూఎస్‌కు వ్యతిరేకంగా నిరసనలు
యూఎస్‌-ఇజ్రాయిల్‌ దాడులకు వ్యతిరేకంగా ఇరాన్‌లో నిరసనలు ఎగిసిపడ్డాయి. అమెరికాకు వ్యతిరేకం గా పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. టెహ్రాన్‌లో వేలాది మంది నిరసనకారులు రోడ్ల మీదకు వచ్చారు. దేశ జెండా లను, ఖమేనీ చిత్రపటాలను చేతిలో పట్టుకొని.. యూఎస్‌ దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనల్లో మహిళలు, చిన్నారులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


బుర్జ్‌ ఖలీఫా ఖాళీ
అమెరికా సైన్యానికి ఆశ్రయ మిస్తున్న గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ దాడులు చేస్తోంది. క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్‌ అయిన దుబారు లోని బుర్జ్‌ ఖలీఫాను అక్కడి ప్రభుత్వం ఖాళీ చేయించింది. అందులో ఉంటున్నవారిని సురక్షి త ప్రాంతాలకు తరలించింది. దుబారు పై ఇరాన్‌ మిస్సైల్‌ దాడి చేసిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా బుర్జ్‌ ఖలీఫాను ఖాళీచేయించారు.

ప్రపంచ శాంతికి బాధ్యత వహించాలి : యూఎన్‌కు ఇరాన్‌ లేఖ
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ), యూఎన్‌ సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌లకు ఇరాన్‌ ఒక లేఖను సమర్పించింది. ఐక్యరాజ్య సమితి ప్రపంచ శాంతికి బాధ్యత వహించాలని పిలుపునిచ్చింది. అమెరికా, ఇజ్రాయిల్‌ దురాక్రమణ చర్యలు, చట్ట విరుద్ధమైన బలప్రయోగం, శాంతి ఉల్లంఘనను పరిష్కరించడానికి, జవాబుదారీతనాన్ని నిర్ధారించి తక్షణ చర్యలు తీసుకోవడానికి భద్రతా మండలి సభ్యులందరూ వెంటనే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని భద్రతా మండలి సభ్యులకు ఇరాన్‌ పిలుపునిచ్చింది. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్నీ ఈ దురాక్రమణ చర్యలను ఖండించాలని పిలుపునిచ్చింది. ఇటు ఇరాన్‌ లేఖ, మరోపక్క ఫ్రాన్స్‌ అభ్యర్థన మేరకు యూఎన్‌ఎస్‌సీ సమావేశం కానుంది.

సైనిక చర్యను తక్షణమే ఆపండి : చైనా
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ జరిపిన సైనిక దాడులపై చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్రిక్తతలు మరింత గా పెరగకుండా నివారించేందుకు తక్షణ మే సైనిక చర్యను ఆపాలని చైనా విదేశాంగ ప్రతినిధి కోరారు. ఇరాన్‌ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను, భద్రతను గౌరవించాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పారు. సమస్య పరిష్కారం కోసం చర్చలు, సంప్రదింపులు ప్రారంభించా లని సూచించారు. మధ్యప్రాచ్యంలో శాంతి, సుస్థిరత లను కాపాడాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.

మీ దేశాన్ని మీరే పాలించుకోండి : ట్రంప్‌
మధ్యప్రాచ్యంలో దాడుల నేపథ్యంలో డోనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశారు. ”మీ దేశాన్ని మీరే పాలించుకోండి. అది మీదే. రాబోయే తరాలకు మీరిచ్చే ఏకైక అవకాశం ఇదే” అని ట్రంప్‌ ఆ వీడియోలో ప్రకటించారు. పెద్ద ఎత్తున పోరాటం జరుగుతోందని ఆయన తెలిపారు. అనేక సంవత్సరాలుగా ఇరాన్‌ ప్రజలు అమెరికా సాయం కోరుతున్నారని, కానీ దానిని ఎన్నడూ పొందలేకపోయారని అన్నారు. కాగా ఇరాన్‌పై యూఎస్‌-ఇజ్రాయిల్‌ చేపట్టిన సంయుక్త దాడులను ట్రంప్‌ ధ్రువీకరించారు. తాము ఎన్ని హెచ్చరికలు చేసినా ఇరాన్‌ తన అణుకేంద్రాలను పునర్నిర్మించడానికి.. క్షిపణులను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తోందనీ, అందువల్లే ఆ దేశానికి వ్యతిరేకంగా భారీ సైనిక చర్య చేపట్టామని తెలిపారు. ఇక ఇరాన్‌ ఎప్పటికీ అణ్వాయుధాలు కలిగి ఉండకుండా వాటిని పూర్తిగా నాశనం చేస్తున్నామని చెప్పారు. ఇరాన్‌ అణ్వాయుధ ప్రయత్నాలు మానుకోకపోతే మరిన్ని తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్‌ హెచ్చరించారు. ఇటీవలి కాలంలో ఇరాన్‌ వ్యవహారాలలో అమెరికా జోక్యం చేసుకోవడం ఇది రెండోసారి. ఎనిమిది నెలల క్రితం ఇరాన్‌ అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా దాడి చేసిన విషయం తెలిసిందే.

అమెరికా-ఇజ్రాయిల్‌ తీరుపై రష్యా ఆగ్రహం
ఇరాన్‌పై జరుగుతున్న దాడులు ప్రమాదకరమని రష్యా వ్యాఖ్యానించింది. ఇజ్రాయిల్‌, అమెరికా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వరల్డ్‌ ఆర్డర్‌ను మార్చేలా అమెరికా నాయకత్వం వ్యవహరిస్తోందంటూ ఆరోపించింది. ఇది పెను విపత్తుకు దారితీస్తుందని హెచ్చరించింది. ఇరు పక్షాలు సంయమనం పాటించాలని యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) కోరింది. ఇరాన్‌-అమెరికా మధ్య చర్చలు జరగాలని యూకే, ఫ్రాన్స్‌, జర్మనీ పిలుపునిచ్చాయి. ఇరాన్‌పై ఇజ్రాయిల్‌, అమెరికా దాడులను పాకిస్తాన్‌ ఖండించింది. తక్షణమే ఉద్రిక్తత తగ్గించాలని పాక్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.

ఉద్రిక్తతలు తగ్గించేందుకు ప్రయత్నించాలి : భారత్‌
ఇరాన్‌, అమెరికా-ఇజ్రాయిల్‌ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తాజా పరిణామాలపై భారత్‌ స్పందించింది. ఉద్రిక్తతలు తగ్గించేందుకు ప్రయత్నించాలని సూచించింది. ఇరు పక్షాలు సంయమనం పాటించాలని కోరింది. పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. సమస్యలను పరిష్కరించేందుకు చర్చలు, దౌత్య మార్గాలను అనుసరించాలని తెలిపింది. దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని వివరించింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రకటను విడుదల చేసింది. భారత దౌత్య కార్యాలయాలు దేశ పౌరులతో టచ్‌లో ఉన్నాయని వివరించింది.

హర్మూజ్‌ జలసంధి మూసివేత
భీకర దాడుల నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హర్మూజ్‌ జలసంధిని ఇరాన్‌ పూర్తిగా మూసివేసింది. జలసంధిలోని అన్ని నౌకలనూ నిలిపివేసింది. ముడి చమురు రవాణాకు ఈ హర్మూజ్‌ జలసంధి ఎంతో కీలకం. 30 శాతం ముడి చమురు రవాణా ఇక్కడి నుంచే జరుగుతుంది. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో దీనిని మూసివేయాలని ఇరాన్‌ తీసుకున్న నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనున్నది. ఇరాన్‌ నిర్ణయంతో చమురు ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది.

మధ్యప్రాచ్యంలో భీకర యుద్ధం
మధ్యప్రాచ్యం మళ్లీ అగ్నిగుండంగా మారుతోంది. చర్చల బల్లపై మాటలు సాగుతుండగానే ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ దాడులు ప్రారంభమవడం పరిస్థితిని ఒక్కసారిగా ఉద్రిక్త స్థితికి తీసుకెళ్లింది. టెహ్రాన్‌ పై క్షిపణులు విరుచుకుపడగా డజన్ల సంఖ్యలో ప్రాణనష్టం సంభవించినట్టు సమాచారం. ఇరాన్‌ ప్రతీకార దాడులు సైతం పరిస్థితులను బెంబేలెత్తిస్తుండగా, హర్మూజ్‌ జలసంధి మూసివేత ప్రపంచాన్ని కుదిపేస్తోంది. చమురు సరఫరాలు ఆగిపోవడం, ధరలు ఎగసిపడటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఘర్షణ ఇక్కడితో ఆగుతుందా? లేక మధ్యప్రాచ్యమంతా యుద్ధ మంటల్లో చిక్కుకుపోతుందా? అన్న అనిశ్చితి పెరుగుతోంది. ఐక్యరాజ్యసమితి సహా పలు దేశాలు తక్షణ సంయమనం కోరుతున్నాయి. యూరప్‌ చర్చల మార్గాన్నే సూచిస్తుండగా, ఆసియా దేశాలు ఇంధన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధం కేవలం సరిహద్దుల్లోనే కాదు..ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గుండెలోకి చొచ్చుకుపోయే ప్రమాదం ఉందన్న భయం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది.

ఇరాన్‌పై దాడులకు సీపీఐ(ఎం) ఖండన
సార్వభౌమాధికారం, అంతర్జాతీయ ఒప్పందాలు ఉల్లంఘన
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ దాడులను స్రీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. ఈ దాడులు ఇరాన్‌ దేశ సార్వభౌమాధికారాన్ని, ఐక్యరాజ్య సమితి నిబంధనావళి, అన్ని అంతర్జాతీయ ఒప్పందాలను దారుణంగా ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో ప్రకటన విడుదల చేసింది. చర్చలను పూర్తిగా విస్మరించి మరీ అమెరికా, ఇజ్రాయిల్‌ ఈ దాడులకు పాల్పడ్డాయి. ట్రంప్‌ చేస్తున్న ప్రకటనలను, ఈ దాడులను బట్టి తాజా చర్చలను యూఎస్‌ఎ ఎన్నడూ విశ్వసించలేదని స్పష్టంగా అర్థమవుతోంది. పలు సార్వభౌమ దేశాలపై తన ఇష్టాను సారం దాడులకు దిగుతూ, యుద్ధో న్మాదంతో కూడిన బెదిరింపుల ధోరణిలో అమెరికా వ్యవహరిస్తోంది. వెనిజులాపై ఇటీవల అమెరికా జరిపిన దాడికి కొన సాగింపుగా ఇరాన్‌పై దాడి చోటుచేసు కుంది. ఇజ్రాయిల్‌ లో భారత ప్రధాని నరేంద్ర మోడీ తన పర్య టన ముగించుకుని వచ్చిన వెంటనే ఇరాన్‌పై దాడి ప్రారంభమైంది. తన మిత్ర దేశమైన ఇరాన్‌పై జరుగుతున్న ఈ దాడు లను భారత ప్రభుత్వం నిర్ద్వంద్వంగా ఖండించాలి. తక్షణమే ఈ ఘర్షణలను విరమించాలని పొలిట్‌బ్యూరో డిమాండ్‌ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -